ఈ రోజుల్లో ఎవరికి వారు తాము బావుంటే చాలు అనుకుంటారు. అలాంటి మానసిక స్థితిని దాటి మన అనుకున్న అందరు బావుండాలన్న సత్ సంకల్పంతో ముఖపుస్తక సమూహాల్లో అత్యంత ప్రాచుర్యాన్ని పొందిన “ తెలుగు సాహితీవనం “ తెలుగు సమూహం ప్రతిష్ఠాత్మకంగా ముద్రించిన కథా సంకలనం “ అంతర్వాహిని “. ఈ సమూహపు నిర్వాహకురాలు శాంతికృష్ణ గారి నిర్విరామ కృషికి నిదర్శనం ఈ సంకలనంలోని కథలు.
ఈ “ అంతర్వాహిని “ కథా సంకలనంలో కథల సంక్షిప్త వివరణ.
మన సమాజంలో ఆడపిల్ల అనే వివక్షను అందమైన అనుభూతిగా మార్చుకోవడం ఎలానో “ అదే కథ” లో నవీన్ చంద్ర హోతా చాలా చక్కగా చెప్పారు.
“ అమ్మ వీలునామా “ కథలో అసలైన వీలునామా మనం చదవవచ్చు. కొడుకులైనా కూతుర్లైనా తల్లితండ్రుల బాధ్యతను సరిగా నిర్వర్తించనప్పుడు, వారి ఆస్తులపై ఎటువంటి హక్కు ఉండదని తెలియజెప్పిన కథ. చాలా గొప్పగా రాసారు వారణాసి భానుమూర్తి.
“ ఆపద్బాంధవులు” కథ చదివిన తర్వాత నాకు ముందుగా గుర్తు వచ్చింది మాదిరెడ్డి సులోచన గారి “ ఈ దేశం మాకేమిచ్చింది” నవల. ఈ సమాజంలో ప్రతి ఒక్కరు స్వలాభం చూసుకోకుండా, మనమేం చేయగలం మన వంతుగా ఈ సమాజానికి అని ఆలోచిస్తే ఎంత బావుంటుందో డాక్టర్ డి ఎన్ వి రామశర్మ చక్కని సందేశాత్మక కథను అందించారు.
“ ఇకమాతు “ తెలంగాణ మాండలికంలో రాసిన కథ. పెంపుడు జంతువుల మీద ప్రేమను, వదలలేని ఆప్యాయతను అద్భుతంగా రాసారు. ఎవరిని నొప్పించకుండా తన బర్రెను కాపాడుకున్న కథానాయకుని చతురత చాలా బావుంది.
మనం వదిలించుకుందామని ఎంత ప్రయత్నిస్తున్నా మన చుట్టూ ఉన్న సమాజం వదలని సమస్య కులం, మతం, మూఢాచార సంప్రదాయాలు, సినిమా రాజకీయాల గురించి “ ఇచ్చింగ్ “ కథలో చాలా బాగా ప్రస్తావించారు.
కులమతాలు, వరకట్నాల పట్ల మన మూర్ఖత్వం, మన ఆచార, వ్యవహారాలే గొప్పవన్న అహం వలన కలిగిన పరిణామాల గురించి “ ఎవరికి తెలుసు “ కథలో చక్కగా వివరించారు.
కంటేనే కాదు, పెంచినా అమ్మ అమ్మే అంటూ అమ్మతనం గొప్పదనాన్ని అద్ఫుతంగా చెప్పిన కథ “ కల గనలేదు”.
ఎదిగే వయస్సున్న పిల్లలకు తల్లిదండ్రులు చెప్పే జాగ్రత్తలు, వాటి విలువను తెలిపే కథ “ కొత్తగా రెక్కలొచ్చెనా? “
“ కుండెడు నీరు “ కథ చాలామందికి అనుభవమే. మంచి కథ.
జాలి,దయ ఉండే కొందరి మానవత్వం గురించి ఈ “ గూడు విడిచిన గుండె “ కథ. పక్షుల గూడు పడగొట్టలేని మనసున్న మనిషి కథ.
పుట్టింటి ప్రేమానురాగాలకు ఏదీ కొలమానం కాదని చెప్పిన కథ “ గుండె చప్పుళ్ళ “.
తర్కానికి, (మూఢ)నమ్మకానికి మధ్యన ఓ చిన్న మనసు సంఘర్షణను చాలా బాగా చెప్పారు “ పత్రం..పుష్పం..” కథలో.
“ పెళ్లి కూతురు “ కథ కొన్ని వాస్తవ సంఘటనలకు అద్దం పడుతుంది.అందరు తప్పక చదవాల్సిన కథ.
అతుకుల బ్రతుకుల జీవితాల్లో పుట్టినరోజు ప్రేమ కానుక ఎంత ప్రేమను, సంతోషాన్ని పంచుతుందో “ ప్రేమ కానుక “ కథలో మనం చదవవచ్చు.
మధ్య తరగతి జీవితాల్లో సాధారణ బహుమతి అనుకున్నది, ప్రపంచంలోనే అత్యంత విలువైనదిగా ఎలా మారిందో “ బామ్మ బహుమతి “ గురించి మనుమరాలు చెప్పిన కథ.
“ మట్టిబంధం “ ఎంత గట్టిదో తెలియజెప్పిన మనసు బంధం. ఈ కాలంలో మన బాధ్యతలను గుర్తు చేసిన కత.
“ మనుషులు -మెషిన్లు “ కథ యంత్రాల యాంత్రికతను, మనిషి మనుగడను గురించి వివరిస్తూ సహజత్వానికి, కృత్రిమత్వానికి తేడాను తెలుపుతూ, లాభనష్టాల తూకాన్ని తేల్చి చెప్పింది.
కొందరు ఇంటిలో పెద్దవారిని చులకన చేయడం, పిల్లలను గారాబంతో చెడగొడుతున్నారు అన్న అపోహలకు సమాధానమే ఈ “ మబ్బులు వీడిన ఆకాశం “ కథ.
కడుపున కనక పోయినా పెంచిన అమ్మ బుుణం తీర్చుకున్న ఓ కూతురి కథ “ మమతల పాల కడలి “.
చక్కని అనుబంధాల, ఆప్యాయతల సరదా కథ “ లేడిపిల్లలా..”.
అనాగరికులను నాగరికులుగా మార్చితే, మనిషిలోని మృగతత్వాన్ని కూడా ఒంటబట్టించుకున్న రాజకీయానికి ఏ జాతైనా ఒకటేనని తెలియజెప్పిన కథ “ వేట “.
సరదాగా చెప్పినా సర్ ప్రైజులతో, తలమునకలయ్యే పనులతో సతమతమైన ఓ మనసు కథ “ వేళ కాని వేళ..త్వరపడి..”
తమ తమ విధి నిర్వహణల నుండి విశ్రాంతి తీసుకున్న వారికి, వారి కుటుంబ సభ్యులకు ఎదురైన సమస్యల నుండి బయటపడే మార్గం చూపిన కథ “ వ్యాపకం “.
దిగువ మధ్యతరగతి బతుకుల్లో అప్పుడప్పుడు వచ్చే అల్ప సంతోషాలు కొబ్బరి పచ్చడి, సైన్సు రికార్డు బొమ్మలు చేతులు మారడాలు, ఇచ్చిపుచ్చుకోవడాలు పిల్లల మధ్యన. ఇలాంటి సంఘటనలను “ సైన్సు రికార్డు అనే చక్కని కథగా మలచడం చాలా బావుంది.
తొందరపాటు నిర్ణయాలు జీవితాన్ని ఎలా మార్చేస్తాయో అని చెప్పడానికి, చిన్న చిన్న కారణాలకు సర్దుకుపోవడంలో ఆనందాన్ని, భార్యాభర్తల మధ్యన అవగాహనను తెలిపే కథ స్టేట్మెంట్.
“ అంతర్వాహిని “ కథా సంకలనంలోకి ప్రతి కథా మనలో ఎవరో ఒకరికి అనుభవమే. పేరున్న రచయితలు అని కాకుండా ప్రతి ఒక్కరు ఈ కథా సంకలనంలో తమ భాగస్వామ్యాన్ని పంచడం ముదావహం. ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక అభినందనలు. ఇందరిని ఒక చోట చేర్చి, వారి భావాలను అందంగా పేర్చిన శాంతికృష్ణ గారికి హృదయపూర్వక అభినందనలు.