5, ఏప్రిల్ 2023, బుధవారం

జీవన మంజూష ఏప్రియల్ 23

నేస్తం,

         బంధాలు, అనుబంధాలు అనేవి మనం పెంచుకునేదాన్ని బట్టి వుంటాయి. వీటికి ప్రాణమున్న జీవులా లేదా వస్తువులా అని వుండదు. సృష్టిలో బంధాలు సుళువుగానే ఏర్పడతాయి, తెగిపోతాయి. కాని అనుబంధం ఏర్పడితే అంత సుళువుగా తెంచుకోలేము, అది వస్తువయినా, మనిషయినా, జంతువయినా, మెుక్కయినా. దీనికి సమయంతో పని లేదు. క్షణాలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాల తరబడి మనం వాటితో గడపనక్కర్లేదు. కొన్ని పరిచయాలు అనుబంధంగా మారడానికి క్షణాల సాహచర్యం సరిపోతుంది. మరికొన్ని బంధాలు సంవత్సరాల తరబడి కలిసున్నా అనుబంధంగా మారలేవు. వీటికి మనసుల మధ్యన ఆంతర్యాలు, అపోహలు కారణాలుగా మిగిలిపోతున్నాయి.

           ఈరోజుల్లో పిల్లలు, పెద్దల మధ్యన దగ్గరతనం అంతగా వుండటం లేదనే చెప్పాలి. ఆధునిక టెక్నాలజీ వచ్చి అనుబంధాన్ని తనతోనే తీసుకు వెళిపోతోంది. అమ్మానాన్న లేకున్నా పిల్లలు పట్టించుకోరు కాని, సెల్ ఫోను లేకపోతే వారికి ప్రపంచమే చీకటిగా మారిపోతున్న రోజులివి. అమ్మానాన్న అవసరాలకు మాత్రమే అనుకుంటూ, కాలంతోపాటుగా తామూ పరిగెడుతున్నామని సంబరపడిపోతున్నారు. మనమేమో మనం కష్టపడ్డాం కదా, మన పిల్లలకి కష్టం తెలియకుండా వుండాలని, వారు అడిగినవి సమకూర్చే పనిలో పిల్లలను పట్టించుకోవడం తగ్గించేస్తున్నాం. ఇది ఇలానే జరుగుతూ పోతే మన పిల్లలు కూడా మనల్ని గుర్తించని పరిస్థితి రావచ్చేమో రేపటి రోజున.

           కాలానికి కట్టుబడిపోతూ మనమూ కాల ప్రవాహంలో కొట్టుకుపోతున్నాం. దానినే పురోభివృద్ధి అనుకుంటున్నాం. సాంకేతికంగా ఎదుగుదల మంచిదే కాని మనిషి మనుగడకే ప్రమాదకరమౌతున్న శాస్త్రీయత ఎంతవరకు మంచిది అన్న ఆలోచన కూడా పొడజూపుతోందిప్పుడు. రాతియుగం నుండి నేటి అంతరిక్ష పయనం వరకు చూసుకుంటే మనిషి మేధస్సు ఎంతో అభివృద్ధి చెందింది. మానవ జీవన అవసరాలకు అనుగుణంగా. కాకపోతే మేధస్సు కొందరి వికృత ఆలోచనలకు పరాకాష్ఠగా ప్రపంచ వినాశనానికి, మానవ మనుగడకు ప్రమాదకారిగా మారుతోంది

              ఏదేమైనా అతి అనర్ధదాయకమన్నది మాత్రం నిజం. అది విషయంలోనైనా వర్తిస్తుంది. సమాజం బావుండాలంటే సదరు వ్యక్తుల మధ్యన సత్ సంబంధాలు నెలకొనాలి. అది ఇంటా బయటా కూడా వుండాలి. మనం మాత్రమే బావుంటే చాలన్న ఆలోచన నుండి మనతోపాటా మరో నలుగురు కూడా బావుండాలని కోరుకునేంతగా మనం ఎదగాలి. ఆధునికంగా ఎదగడం కాదు అనుబంధాలతో ఎదగడంలోనే అసలైన ఆనందం వుంటుందని మనమెరిగిన నాడు మనిషిగా మనం గెలిచినట్లే..!!






 

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner