నేస్తం
పొద్దుపొద్దున్నే కొందరు జనాల తీరు చూసి చీదర వేస్తోంది. చాన్నాళ్ళ నుండి ఎదురౌతున్న మనస్తత్వాలే కాని, బాగా కోపం వచ్చేస్తోంది. పొద్దున్నే బోలెడు మంచిపనులు చేసేయాలని, సమాజాన్ని ఉద్దరించేయాలని, పూజలు పునస్కారాలని ఇలా బోలెడు పనుల్లో తలమునకలౌతుంటాం మనం.
చిన్నవాళ్ళో, తెలియని వాళ్ళో అయితే మనమూ సరిపెట్టుకోవచ్చు. మనం పట్టణాల్లో అపార్ట్మెంట్లలో చాలా నాగరికంగా బతికేస్తున్నామని ఓ..తెగ ఫీల్ అయిపోతున్నామిప్పుడు. కొత్త పిచ్చోడు పొద్దెరగడన్నట్టన్న మాట. మనమెక్కడి నుండి వచ్చామన్న మూలాలను మరిచిపోయాం. మన బాధ్యతలు, బంధాలు గుర్తుండవు కాని స్వచ్ఛ సేవలు మాత్రం పొంగుకు వస్తాయి. మనం ఆధునికంగా బతుకుతున్నామనుకుంటే సరిపోదు. మన ప్రవర్తన అలాగే కూడా ఉండాలి కదా.
మనకి అత్యాధునిక సౌకర్యాలతో ఇల్లున్నా, బయట ఒకటి, రెండు వగైరాలు ఎక్కడబడితే అక్కడ చేయవచ్చు. ఏ పెంపుడు జంతువులు కూడా మన ఇంటి చుట్టుపక్కల ఓ నాలుగు కిలోమీటర్ల వరకు తిరగను కూడా తిరగకూడదు. బయట ఖాళీ స్థలాలు, రోడ్లు కూడా మనవే మరి. మన అమ్మాబాబు ఇచ్చిన ఆస్తులు కదా. రేపోమాపో పోయేవాళ్ళ దగ్గర నుండి కాస్త మధ్య వయసు వారి వరకు చాలామంది ప్రవర్తన ఇలానే వుంది.
ఊరకుక్కలు దాడి చేస్తున్నాయి. వాటిని చంపేయమంటున్నారు. సరైన పనే అది. మరి అదే చట్టం ఊరమనుషులకు కూడా అమలు చేయమని ఎవరూ మాట్లాడరు ఎందుకని. పిల్లలను బయట వదిలేయడం మన తప్పు. పిచ్చికుక్కలు దాడి చేస్తాయి. మన పిల్లల సంరక్షణ మనమే చూసుకోవాలి. ఒక్కోసారి ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్ని అమానవీయ సంఘటనలు జరుగుతాయి. అన్నీ తెలిసిన మనుషులకే మంచి చెడు అని లేనప్పుడు ఊరకుక్కలు ఎంత చెప్పండి?
ఇప్పటికి చెత్త పన్ను కూడా కడుతున్నాం. రేపటి నుండి మనిషికి, పెంపుడు జంతువులకు కూడా పన్ను కట్టించుకుంటారేమో. పోయేదేముంది కట్టేద్దాం కట్టేద్దాం. ఉచితాలకు అలవాటు పడిన ప్రాణాలు కదా. ఏ పన్ను వేస్తే మనకేంటి? మనదంతా అర్ధరాత్రి పాలనే కదా..!! యథా రాజా..తథా ప్రజా…!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి