కొన్నింటి గురించి చెప్పాలంటే మాటలు దొరకవు. అలాంటి క్షణాలు ఈరోజు నాకు లభించాయి. ఎప్పుడో 1977 లో మా పరిచయం. అప్పుడు నేను రెండో తరగతి. ఆ సంవత్సరమే నవంబర్ లో దివిసీమను అతలాకుతలం చేసి ఎన్నో జీవాలను బలిగొన్న ఉప్పెన మీలో కొందరికి గుర్తుండే వుంటుంది.
అవనిగడ్డ శ్రీ గద్దె వేంకట సత్యనారాయణ శిశువిద్యామందిరంలో చదివిన అందరికి సుపరిచితులు ఆకుల వేంకట రత్నారావు గారు. మా హెడ్ మాస్టారు. ఆకారంలో చిన్నగా, సన్నగా ఉన్నా..ఆహార్యంలో ఆయనంటే అందరికి భయమే. వారు నేర్పించిన విలువలే ఈనాడు ఎంతోమంది ఉన్నతస్థాయిలో ఉండటానికి ఉపయోగపడ్డాయి. మాకు చదువొక్కటే కాకుండా..ఆటలు, పాటలు, సంస్కృత శ్లోకాలు, భగవద్గీత, హనుమాన్ చాలీసా, వేంకటేశ్వర సుప్రభాతం, పంచతంత్రం కథలు ఇలా ఎన్నో నేర్పించేవారు. మూడవ తరగతిలోనే హింది, తర్వాత ప్రాధమిక, మధ్యమిక వంటి పరీక్షలు కూడా రాయించేవారు. మాస్టారు ఇంగ్లీష్ చెప్పేవారు. అప్పుడు నేర్పిన టెన్స్‌లు ఇప్పటికీ అలానే గుర్తుండిపోయాయి. ఆయన జ్ఞాపకశక్తి ఎంత గొప్పదంటే ఇప్పటికి ఇంటి పేర్లతో సహా అందరిని పలకరిస్తారు. ఐదారు వందల మందిని అలా గుర్తుంచుకోవడమంటే మాటలా మరి..!
ఆమధ్యన పూర్వ విద్యార్థుల కలయికలో మాస్టారిని కలవడం జరిగింది. అప్పటి నుండి అప్పుడప్రుడు పలకరిస్తుంటారు. నాకు ఆరోగ్యం బాలేనప్పుడు కూడా ఆయనకు బాలేకపోయినా ఇంటికి వచ్చి చూసి వెళ్లారు. ఈమధ్యన చాలా రోజుల నుండి కలవాలనుకున్నా కుదరలేదు. అనుకోకుండా విజయవాడలో ఈరోజు వారి ఇంటికి వెళ్లి ఆ కలయికను ఇలా మీతో పంచుకుంటున్నాను. చిన్నప్పటి కబుర్లు ఇలా చెప్పుకుంటూ పోతే అంతే వుండదు కదా…మాస్టారికి నమస్కారాలతో..