18, మార్చి 2024, సోమవారం

నానీల తీరాన

 “నానీల తీరాన”


మనసును

ఇచ్చేసింది అక్షరాలకు

అనుభవాలను

నానీలుగా మార్చేస్తూ..!!


పుస్తకం నా చేతికి వచ్చి కొన్ని రోజులయినా తీరికగా తరువాత చదువుదాములే  అని పెట్టుకున్నా. ఈరోజు ఎందుకో అసలు ఏముందో చూద్దామని తీసానా..!! ఇక మెుదటి నానీ నుండి చివరి నానీ వరకు ఆపలేదు. ఇది బావుంది, ఇది బాలేదు అని లేదు అన్నీ చాలా పరిణితితో రాసినట్లుగా అనిపించాయి. జీవితంలో అన్ని పార్శ్వాలు చవి చూసినట్లుగా అర్థమయ్యింది. అమ్మమ్మ నుండి మెుదలెట్టి అమ్మ, నాన్న, గురువు, పల్లె, పట్టణం, అనుబంధాలు, ప్రేమలు, కన్నీళ్లు, గాయాలు, డబ్బు, రాజకీయం, చీకటి, వెలుతురు, చిన్నతనం, స్నేహాలు, సముద్రం..ఇలా ఒకటేమిటి ప్రతిదీ నాకయితే అద్భుతమే అనిపించింది. పుస్తకానికి పేరు సరిగ్గా సరిపోయింది. గాయాలను గురువుతో పోల్చడం చాలా బాగా నచ్చింది. 

ఓ మంచి పుస్తకం చదివిన అనుభూతిని అందించిన “ నానీల తీరాన” ఎన్ లహరికి హృదయపూర్వక అభినందనలు.

17, మార్చి 2024, ఆదివారం

రెక్కలు

 1.  చుట్టరికం

అవసరమే

తంత్రం

అనివార్యం


నమ్మకం

బలమైనది..!!

2.  ఇల్లెంత

విశాలమో

మనసంత

ఇరుకు


పరాయి సొత్తు

మనదనే బ్రాంతి..!!

3.  నటించడం

అలవాటై పోయింది

జీవన నాటకంలో

పాత్రదారులకు


ప్రపంచం

ఓ పెద్ద రంగస్థలం..!!

4.  మాటలు

ముత్యాలు

మూటలు

విలువైనవి


మరణం 

అనివార్యం..!!

5.   అవసరమని

తీసుకోవడం

స్వా’ర్జితమని

స్వాహా చేయడం


మని’షికి

తెలివెక్కువ..!!

6.  కథలాంటి

బతుకు

వ్యథలతో

నిత్య సమరం


అక్షరాలకు దక్కిన

అరుదైన చెలిమి..!!

7.  సాక్ష్యాలు

మనసుకి

సంతకాలు

మనిషికి


కాలం

నిర్వికారం..!!


8.  దూరాభారం

నాలుగడుగులైనా

మనమన్న మాట

మరిచినప్పుడు


రక్త సంబంధాలు

రాతి బంధాలు..!!

9.  పాశం

బలమైనదే

మనిషి

అవసరాన్ని బట్టి


కాలానికి

ఆమోదయోగ్యమే..!!

10.  అమ్ముకోవడం

అవసరార్ధం

కొనుక్కోవడం

సంతోషకరం


క్రియలు

కాలం చేతిలో..!!

11.  మాయ

తెరలు

మనసు

పొరలు


విడివడితే

సత్యమే..!!


12.  నిజాయితీకి

నిలువుటద్దం

మోసానికి

మరో రూపం


ఎవరు

చెప్మా..!!

13.  ఏమార్చే

మనుష్యులు

ఊసరవెల్లి

వ్యక్తిత్వాలు


జీవితపు

ముఖచిత్రాలు..!!


14.  కొందరికి

కొనుక్కోవడమిష్టం

మరికొందరికి

అమ్ముకోవడం అలవాటు


ఏ వ్యవస్థైనా

అతీతం కాదు..!!

15.  బాధతో

బంధం విలువ

ధనంతో

కపట ప్రేమలు


ఇజం

తెలుస్తుంది..!!

16.  ఆలోచన

అవసరం

మాటకు

కట్టుబడేటప్పుడు


తప్పించుకోవడం

అతితెలివి..!!

17.  ప్రతి 

ఆట

గెలుపు

కోసమే


లక్ష్యం

లక్ష’సాధనకే..!!

18.  గతం వదిలిన 

శిథిలాలు

వాస్తవం మిగల్చని

గురుతులు


కాల ప్రవాహంలో

ఎత్తుపల్లాలు..!!


19.   నవ్వుతూ

చేస్తారు

ఏడుస్తూ

అనుభవిస్తారు


కర్మ

ఫలితం..!!

20.  మనసు

శక్తివంతమైనదే

మనిషెంత

గాయపరిచినా


జీవితం

ఆశావహం..!!

21.  భారం

(ఆ)భరణమౌతోంది

బంధం

బలహీనమౌతోంది


బతకడం

అనివార్యం..!!

22.  గెలుపు

గుఱ్ఱం

ఎక్కేదెవరు?

దిగేదెవరు?


ఐదేళ్ళకోమారు

ఈ ఆట..!!

23.  మానసిక 

క్షోభ

భరించడం

సుళువు కాదు


కారకులకు

శిక్ష పడాలి..!!

24.  కాలానికి

తెలుసు

వాస్తవాలతో 

పడిన ముడి


బంధం

వీడనిదే..!!

25.  దాచాలన్నా

దాగనివి

వద్దన్నా

వీడనివి


మనసు 

ముత్యాలు..!!

26.  మాయ

నచ్చేస్తుంది

మాయం

జరిగిపోతుంది


మెలకువ

వస్తుంది..!!

27.  



12, మార్చి 2024, మంగళవారం

జీవన మంజూష 03/24


 నేస్తం,

          కొందరిని చూస్తుంటే వీరు ఇంతగా దిగజారి ప్రవర్తించడానికి కారణాలు ఏమిటన్నది అస్సలు అర్థం కావడం లేదు. తల్లిదండ్రులు వీరిని అంత సంస్కారహీనంగా పెంచారా అని బాధ వేస్తున్నది. అబ్బాయిలు ఏమైనా చేయవచ్చు ఆనాటి నుండి ఈనాటి వరకు. కాని అమ్మాయిలు పని చేసినా ఆక్షేపణలే అని బుుజువైంది. మనం వాడే బాష మన వ్యక్తిత్వాన్ని తెలుపుతుంది అని మనం మర్చిపోవడం చాలా బాధాకరమయిన విషయం. మన చట్టసభలే ఇందుకు ఉదాహరణ.

           ఒకప్పుడు ఆడపిల్లల్ని కాలేజ్ లలో ఏడిపించేవారు. ఎక్కడో ఒకటి అరా సంఘటనలు మినహాయించి శృతిమించని విధంగానే ఉండేది. రానురానూ కాలేజ్ లే కాకుండా స్కూల్స్ లో కూడా మెుదలైఇంతింతై వటుడింతైఅన్నట్టుగా టీజింగ్ వేళ్ళూరుకు పోయింది. ఇక మోబైల్ యుగంలో అది ఎంతలా పాకిపోయిందంటే మనం మనిషి అన్న విచక్షణని మరిచిపోయేతంగా!

            రీల్స్, వీడియోస్ పలానావాళ్ళే చేయాలి, ఇలాగే చేయాలి అన్న రూల్ ఏమైనా ఉందా! నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చేసినప్పుడు, ఎదుటివారికి కూడా హక్కు ఉందని మరిచిపోయి, మన ఇంట్లో కూడా మహిళలు ఉన్నారని, మనమూ అమ్మకే పుట్టామని మర్చిపోవడం చాలా విచారకరం. గత ఐదేళ్ళుగా ట్రోలింగ్ సంస్కారాన్ని పెంచి పోషిస్తున్న ప్రతి ఒక్కరికి మనం పాదాభివందనం చేయాల్సిందే. ఎందుకంటే ఇంత సంస్కారవంతంగా వారిని పెంచిన తల్లిదండ్రులకు మనం బుుణపడివున్నాం కనుక.

            బాధ్యతాయుతమైన పదవుల్లో వుండి, చట్టసభల్లో కూడా హేయమైన సంస్కృతికి శ్రీకారం చుట్టిన ప్రతి ఒక్కరూ ఇందుకు బాధ్యులే. ఇలాంటి సంస్కారవంతుల్ని ఎన్నుకుంటున్న మన ప్రజాస్వామ్యానికి నా ప్రగాఢ సానుభూతి. మార్పైనా ఒక్కరితోనే మెుదలవుతుంది అన్న మాటకు ఇవన్నీ సాక్ష్యాలే. వ్యవస్థ అయినా బావుండాలంటే ముందు మన ఇంట్లో మనతో వున్న వారి వ్యక్తిత్వాన్ని చూడాలి. నిజానిజాలు తెలుసుకోవాలి. పదవులదేముంది, కొన్ని కోట్లు మనవి కావనుకుంటే చాలు. కాని పదవికి వన్నె తేవడంతోనే మన వ్యక్తిత్వం, సంస్కారం తేటతెల్లమౌతుంది. విచక్షణా జ్ఞానం మనిషికి భగవంతుడు ఇచ్చిన వరం. దానిని ఉపయోగించడం, ఉపయోగించక పోవడం అన్నది మనిషి పెరిగిన పరిసరాలు, పెంపకాలపై ఆధారపడి వుంటుంది. సంస్కారం లేనప్పుడు ఎన్ని వున్నా ఏమి లేనట్లే. మంచి మార్పు కోసం ఎదురుచూడటమే మన పని. ఆధునిక పోకడల యుగంలో కాస్తయినా మన అమ్మానాన్నల పెంపకాలను నలుగురూ ప్రశ్నించకుండా ఉండేలా నడుచుకోవడానికి ప్రయత్నిద్దాం..!!



           

9, మార్చి 2024, శనివారం

గంగజాతర సమీక్ష


         గంగ కథే గంగజాతర” 

      మన చుట్టూ జరుగుతున్న సంఘటనలకు అక్షర రూపమివ్వడమట, అదీ కుల వృత్తుల గురించి, ఆచార, వ్యవహారాల గురించి రాయడమంటే కాస్త కష్టతరమైన విషయమే. ఎజ్రాశాస్త్రిగారి రచనలు ముఖపుస్తకంలో చూస్తున్నప్పుడు మాటే అనిపించేది. వ్యవస్థలో దాగిన లోపాలను ఎత్తి చూపడానికి గుండెధైర్యం చాలా ఎక్కువగానే కావాలన, కష్టాన్ని చెప్పడానికి పలుచని తెరలు తీయడం సుళువు కాదనీ

     ఎజ్రాశాస్త్రిగారు తనగంగజాతరనవలలో మన సమాజంలో జరుగుతున్న ఎన్నో సంఘటనలను మన ముందు ప్రత్యక్షంగా చూపారు. కనీస అవసరాలైన తిండి, నీటి కోసం తపన పడే అణగారిన వర్గాన్ని, నేరం ఒకరు చేస్తే, నేరాన్ని మరో వర్గానికి ఆపాదించి, వారిని భయబ్రాంతులను చేసి, ఊరు వదిలి పోయేటట్లు చేయడము, తరువాత వారు పడే ఇబ్బందులు, వీటికి సమాంతరంగా కులంలో జరిగే కులవృత్తులు, కలుపుగోలు తనాలు, మంచి, చెడు వగైరా కార్యక్రమాలు, అనుబంధాలు, ఆప్యాయతలు వంటి అన్నింటిని గంగజాతరలో చూపించారు

     ఆశయ సాధన కోసం తమ జీవితాలను ఎలా త్యాగం చేసారన్న విషయాన్ని, ఫ్లోరైడ్ బారిన పడిన తమ జాతిని ఎలా పరిరక్షించుకున్నారన్న విషయాన్ని సంజీవి, గంగ పాత్రలతో హృద్యంగా చిత్రీకరించి నవలకు చక్కని ముగింపు పలికారు. గొప్పగా రాసిన ఎజ్రాశాస్తిగారికి హృదయపూర్వక అభినందనలు. పుస్తకం కావాల్సినవారు సంప్రదించాల్సిన నెంబరు 7013975274.





Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner