22, జూన్ 2024, శనివారం

ఏక్ తారలు..!!

1.  మనసు ఛాయ దొరికింది_గతాన్ని వెదికే వాస్తవంలో..!!

2.  కదిలించే కథనాలే అన్నీ_కరకురాయిని సైతం కన్నీరు పెట్టిస్తూ..!!

3.  వదిలేస్తే విడిపోయేవే బంధాలన్నీ_తృణప్రాయపు వ్యామోహాల్లో పడి..!! 

4.  శూన్యాన్ని ఛేదించే శరమేగా బంధమంటే_వెలితిని పూడ్చే వెసులుబాటుగా..!!

5.  మనసు రాతలన్నీ మౌనంతోనే_భాష అక్కర్లేని భావాలను పంచుతూ..!!

6.  నినదించడమే నిత్యకృత్యమైంది_ఎద పదాలను ఏరుకుంటూ..!!

7.  నింగికెగసినా నేలరాలిన జ్ఞాపకాలే కొన్ని_మనసు పొరల్లో తడుముతూ..!!

8.  శూన్యానికి చుట్టానౌతున్నా_ఆఖరి మజిలీలో ఆనందాన్నివ్వమంటూ..!!

9.  బంధాలు బలహీనమే_బాధ్యతలు ధనత్వానికి కట్టుబడినప్పుడు..!!

10.  కథగా కంచికి చేరానిలా_కలల దుప్పటి కమ్మేస్తే..!!

11.  ముగింపునెరుగని వాక్యాలు కొన్ని_కథలోని కలలకు అనుసంధానమౌతూ..!!

12.  చీకటి చుట్టాలందరూ_నావాళ్ళే..!!

13.  బాల్యాన్ని ఆస్వాదిస్తున్నాం_భవిత భయం లేకుండా..!!

14.  కలవాలన్న తపన చాలదూ_ఏ దారి లేకున్నా..!!

15.  కన్నీరెక్కడ?_కలలింకిన చీకటిలో..!!

16.  అమ్మెప్పుడూ ఆటవస్తువే_ఏ యుగంలోనైనా..!!

17.  నన్ను నేను కోల్పోయా_నీవంటూ తెలిసాక..!!

18.  కథలన్నింటా విశేషాలే_వినగలిగే మనసు మనదైనప్పుడు..!!

19.  ఆశగా చూస్తున్నా..ఒక్కసారైనా మరలి చూస్తావని..!!

20.  మలివయసు పసిదనమిది_పుడమి సహనానికి ధీటుగా..!!

21.  నా సర్దుబాట్లు ఎప్పుడూ వుండేవే_నీతో సహవాసం చేస్తున్నంత కాలమూ..!!

22.  జ్ఞాపకమని తడుముతున్నా_గతం మిగిల్చిన గాయమని మరచి..!!

23.  పొడిబారిన మనసులే కొన్ని_దరిజేరే బంధాలకై ఎదురుచూస్తూ..!!

24.  మనసుకు ఎంత ఓపికో_కాగితాన్ని కలాన్ని అనుసంధానం చేయడానికి..!!

25.  తెరలు తెరలుగా వెన్నెల జలతారులు_నీ చెలిమి సహవాసంలో..!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner