30, జూన్ 2024, ఆదివారం

మారాలి..!!

https://www.andhrapravasi.com/news.php?news=42516&category=c5380

      ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడిన నాయకులు శాసనసభలకు, లోక్ సభలకు వెరసి చట్టసభలకు గైర్హాజరు కావడం సబబేనా? వీరికి కూడా హాజరు శాతం లెక్క వేయాలి. సరిపడా హాజరు లేని నాయకులు తరువాత ఎన్నికల్లో పాల్గొనడానికి అనర్హులుగా ప్రకటించాలి. 

      ప్రజల సొమ్ముతో కట్టిన చట్టసభల్లోనికి ప్రజలకు ప్రవేశం ఉండదు. కనీసం వారు ఎన్నుకున్న నాయకులైనా సక్రమంగా సభలకు వెళ్ళాలి కదా. సభలకు వెళ్ళనప్పుడు వారిని ఎన్నుకోవడంలో అర్థమేముంది? ప్రజల సమస్యలకు సమాధానాలు ఎక్కడ దొరుకుతాయి? గెలిచిన నాయకులు వారి వారి అభివృద్ధి, ఎన్నికల్లో ఖర్చు పెట్టిన సొమ్ము తిరిగి రాబట్టుకోవడంలో చూపే నిబద్దత, తమను ఎన్నుకున్న ప్రజల అవసరాలు తీర్చడంలో చూపకపోవడానికి కారణాలేంటి? 

        అధికారం వచ్చింది కదాని ప్రజల సొమ్ముని తమ సొంత అవసరాలకు వాడుకునే నాయకులకు శిక్షలేమి ఉండవా? ప్రజల సొమ్ముని ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టడాన్ని అరికట్టే చట్టాలు లేవా! ఐదేళ్ళ పాలనలో రాబడి, పోబడి లెక్కలు అప్పజెప్పాల్సిన అవసరం లేదా! ఎంత అధికారంలో ఉంటే మాత్రం మన సొంత తిరుగుళ్ళకి కూడా ప్రజల సొమ్ము వాడుకోవడంలో జవాబుదారీతనం ఎక్కడుంది? మన నాయకులకు రాజ్యాంగం, చట్టంలో లొసుగులను ఎలా వాడుకోవాలో తెలిసినంత బాగా, తమను ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేయడంలో లేదు. 

         ఏ నాయకుడైనా భవిష్యత్ తరాల పురోభివృద్ధికి బాటలు వేయాలి కాని, కులమత, ప్రాంతీయ, వ్యక్తిగత కక్షలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తే, ప్రజల్లో తిరుగుబాటు ఎలా ఉంటుందో అందరు బాగా చూసారు. ఇది గుర్తుంచుకుని అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించిన నాయకుడు జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయి, చరిత్రలో తనకంటూ ఓ పేజీని పదిలపర్చుకుంటాడు. చరిత్రహీనుడు ఏమౌతాడన్నది మనకు తెలిసినదే కదా..!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner