5, ఫిబ్రవరి 2025, బుధవారం

పిఠాపురం కథలు సమీక్ష


 హాయిగా చదువుకునే పిఠాపురం కథలు..!



డా వేదుల శ్రీరామశర్శ(శిరీష) గారు గత నాలుగు దశాబ్దాలుగా సాహిత్యానికి సుపరిచితులు. వీరు బహుముఖ ప్రజ్ఞావంతులు. వీరి కథల సంపుటిపిఠాపురం రోడ్డులో మానవత్వం, సమాజ హితాన్ని కాంక్షించడం, సగటు మనుష్యుల జీవను విధానం వంటి అతి సాదాసీదా వస్తువులే అయినా చక్కని కథనంతో ప్రతి కథా సాగుతుంది. దాదాపుగా 29 కథలు సంపుటిలో వున్నాయి.

      వెలుతురు పుష్పాలు కథలో మధ్యతరగతి జీవితాల బస్సు ప్రయాణంలో విరిసిన మానవత్వం.

(ని)జాతీయ డైరీ కథ బావుంది. సగటు ప్రభుత్వ ఉద్యోగుల నిర్వాకం గురించి బాగా చెప్పారు

ఆలోచనవడ్లలో కథ వర్తమాన రాజకీయ పోకడలకు అద్దం పడుతోంది. అనుకోకుండా జరిగిన సంఘటనను అల్లర్లకు ఎలా వాడుకున్నారన్నది బాగా చెప్పారు.

శాస్త్రీయ సంస్కార వీణ కథ సంప్రదాయపు విలువలను వివరించింది.

నిజమే ఏదైనా లాభమోస్తే తనదాకా మార్పు, మరక మంచివే మరి. మాట మార్పు? కథలో చదవచ్చు.

నవ్య సాధన కథ చిన్నదే కాని పట్టుదలతో సాధించ లేనిది ఏదీ లేదని చక్కని సందేశాన్ని అందించింది. మాటలు కొన్ని కథల గురించి మాత్రమే

     డా శిరీషగారు తీసుకున్న ప్రతి కథావస్తువు మనల్ని కూడా ఎక్కడో చోట స్పృశిస్తూనే వుంటుంది. కాస్త వర్ణన, మరికాస్త సామాజిక విలువలు, సంప్రదాయాలు, రాజకీయాలు, లంచాలు ఇలా సాధారణ సంఘటనలే మనకు ప్రతి కథలోనూ తారస పడుతూనే వుంటాయి. జీవితాలను మించిన కథలు, కథనాలు మరెక్కడా వుండవని మరొక్కసారి వీరి కథల సంపుటిపిఠాపురం రోడ్డుద్వారా ఋజువైంది. చక్కని కథలను ఆసక్తికరంగా చదివించే కథనంతో రాసినందుకు వారికి హృదయపూర్వక అభినందనలు



జీవన మంజూష 02/25


 నేస్తం,

        రెప్పపాటు జీవితంలో మనం ఏం సాధించాలనుకుంటున్నాం? దాని కోసం ఎంతగా దిగజారాలనుకుంటున్నాం? ప్రతి ఒక్కరికి జీవితంలో లక్ష్యం వుండటం సహజమే, కాని లక్ష్యాన్ని చేరుకోవడానికి  విలువలను వదులుకోవాల్సిన అవసరం లేదు. క్షణాల్లో గొప్పదనాన్ని అందుకోవాలన్న ఆరాటం, నేటి తరాన్ని తప్పొప్పులు తెలుసుకునే అవకాశాన్ని దూరం చేస్తోంది

           నాయకత్వం, అధికారం, పేరు, ప్రతిష్టలు వగైరాలన్నీ మనం కోరుకుంటే రావు. కులం, మతం మాత్రం మనకు జన్మతః వస్తాయి. మతం మార్చుకోవడం మన ఇష్టాన్ని బట్టి వుంటుంది. ఇది అందరికి తెలిసిన విషయమే. అయినా ప్రతి విషయానికి కులమతాలకు లంకె పెట్టి ఎవరి పబ్బం వారు గడుపుకుంటున్నారు. కుల పరంగా వచ్చే ప్రత్యేకతలు అన్నీ కావాలి కాని కులాలు వుండకూడదని సభల్లో గొంతు చించుకుంటారు కొందరు అభ్యుదయవాదులు. తమ కోటరీల వారికి మాత్రమే అన్ని ప్రత్యేక సదుపాయాలు, పురస్కారాలు అందించుకుంటారు. సదరు గొప్ప మనస్కులు ఇతరుల్లో లేని  లోపాలు మనకు భూతద్దంలో చూపించి, అదే నిజమన్న భ్రమలో మనల్ని వుంచేయడానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తారు

           మనం వేసుకున్న ముసుగు ఏదైనా దానికి కట్టుబడి వుండాలి. ఎండకా గొడుగు పట్టడం మన నైజమని ఈరోజు తెలియకున్నా రేపైనా బయటబడక తప్పదు. నంగనాచి కబుర్లు నాలుగు రోజులు వింటారు ఎవరైనా, ఐదోరోజు నీ బతుకు తెలుసు ఛీ..పొమ్మంటారు. ఒకరిని  వేలెత్తి చూపేముందు, మనమేంటని మన మనస్సాక్షిని నిజాయితీగా ప్రశ్నించుకుంటే, ఒకరి లోపాలను ఎత్తి చూపకుండా మన పని మనం చేసుకుపోతాం

         మన రాతలు ఎవరికీ నచ్చకపోయినా పర్లేదు కాని ఎవరిని హేళన చేయకూడదన్న ఇంగితజ్ఞానం కొందరిలో కరువవడం చాలా బాధాకరం. మన అమ్మానాన్న, గురువులు నేర్పిన సంస్కారం ఏమిటన్నది మన రాతలు చూసే నలుగురు తెలుసుకుంటారు. మన అసలు నైజం ఏమిటన్నది మనం చెప్పకనే మన రాతలు చెప్పేస్తాయి. అక్షరాలు మన చేతుల్లో సగర్వంగా తల ఎత్తుకు నిలబడాలి కాని అక్షరాలు కూడా అసహ్యించుకునే శుద్ధరాతలు రాయడంలో మీ మీ ఆనందం, మీ పురస్కారాలు, మీ గొప్పదనం మీకు మాత్రమే మిగులుతాయి. కళకైనా గౌరవాన్ని పెంచండి, తద్వారా మీ విలువను పెంచుకోండి



Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner