నేస్తం,
ఈ రెప్పపాటు జీవితంలో మనం ఏం సాధించాలనుకుంటున్నాం? దాని కోసం ఎంతగా దిగజారాలనుకుంటున్నాం? ప్రతి ఒక్కరికి జీవితంలో లక్ష్యం వుండటం సహజమే, కాని ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి విలువలను వదులుకోవాల్సిన అవసరం లేదు. క్షణాల్లో గొప్పదనాన్ని అందుకోవాలన్న ఆరాటం, నేటి తరాన్ని తప్పొప్పులు తెలుసుకునే అవకాశాన్ని దూరం చేస్తోంది.
నాయకత్వం, అధికారం, పేరు, ప్రతిష్టలు వగైరాలన్నీ మనం కోరుకుంటే రావు. కులం, మతం మాత్రం మనకు జన్మతః వస్తాయి. మతం మార్చుకోవడం మన ఇష్టాన్ని బట్టి వుంటుంది. ఇది అందరికి తెలిసిన విషయమే. అయినా ప్రతి విషయానికి కులమతాలకు లంకె పెట్టి ఎవరి పబ్బం వారు గడుపుకుంటున్నారు. కుల పరంగా వచ్చే ప్రత్యేకతలు అన్నీ కావాలి కాని కులాలు వుండకూడదని సభల్లో గొంతు చించుకుంటారు కొందరు అభ్యుదయవాదులు. తమ కోటరీల వారికి మాత్రమే అన్ని ప్రత్యేక సదుపాయాలు, పురస్కారాలు అందించుకుంటారు. సదరు గొప్ప మనస్కులు ఇతరుల్లో లేని లోపాలు మనకు భూతద్దంలో చూపించి, అదే నిజమన్న భ్రమలో మనల్ని వుంచేయడానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తారు.
మనం వేసుకున్న ముసుగు ఏదైనా దానికి కట్టుబడి వుండాలి. ఏ ఎండకా గొడుగు పట్టడం మన నైజమని ఈరోజు తెలియకున్నా రేపైనా బయటబడక తప్పదు. నంగనాచి కబుర్లు నాలుగు రోజులు వింటారు ఎవరైనా, ఐదోరోజు నీ బతుకు తెలుసు ఛీ..పొమ్మంటారు. ఒకరిని వేలెత్తి చూపేముందు, మనమేంటని మన మనస్సాక్షిని నిజాయితీగా ప్రశ్నించుకుంటే, ఒకరి లోపాలను ఎత్తి చూపకుండా మన పని మనం చేసుకుపోతాం.
మన రాతలు ఎవరికీ నచ్చకపోయినా పర్లేదు కాని ఎవరిని హేళన చేయకూడదన్న ఇంగితజ్ఞానం కొందరిలో కరువవడం చాలా బాధాకరం. మన అమ్మానాన్న, గురువులు నేర్పిన సంస్కారం ఏమిటన్నది మన రాతలు చూసే నలుగురు తెలుసుకుంటారు. మన అసలు నైజం ఏమిటన్నది మనం చెప్పకనే మన రాతలు చెప్పేస్తాయి. అక్షరాలు మన చేతుల్లో సగర్వంగా తల ఎత్తుకు నిలబడాలి కాని అక్షరాలు కూడా అసహ్యించుకునే అ’శుద్ధరాతలు రాయడంలో మీ మీ ఆనందం, మీ పురస్కారాలు, మీ గొప్పదనం మీకు మాత్రమే మిగులుతాయి. ఏ కళకైనా గౌరవాన్ని పెంచండి, తద్వారా మీ విలువను పెంచుకోండి.
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి