26, మే 2025, సోమవారం

మనిషే చెట్టైతే..!!

 సమాజంలో మంచిని కాంక్షించే “మనిషే చెట్టైతే”..!


“విశ్వవ్యాప్తమైన ‘అమ్మకు’


  వీధి బ్రతుకు నెలవయింది!”

పాపగా పుట్టి బామ్మగా మారే క్రమంలో ఆడపిల్ల అవతారాలను, అవమానాలను చాలా చక్కగా చెప్పారు.

“ఆశలు కోకొల్లలు..

  ఆశయాలే-

  రాలే ఆకులు-“

జరుగుతున్న చరిత్రలో జారిపోతున్న విలువలను చెప్పిన కవిత “ఆశయాలే..?”

“కలం కదలిక..

 హృదయ చలనం-

 నాలోని రక్తంసిరా..

 కవిత్వ చిత్రాలు-!”

 కవి-చిత్రకారుడు నాణానికి ఒకో పార్శ్వం అంటూ కాలం ఆగినా తన కలం ఆగదని ఘంటాపథంగా చెప్పారు.

“అసలే..

  ప్రమాదాల వళ్ళో ప్రపంచం-

  అనుకున్నా..

  పిలవని అతిథి-!” ఉగాది అంటూ ఉగాది రాకను సరికొత్తగా చెప్పారు.

  “చెడుని ఆస్వాదించి మంచిని, మనిషికి ఆయువవుతుంది!” మంచిని మాత్రమే పంచే చెట్టు మనిషైతే ఎంత బావుండో అన్న ఆశతో ఈ కవితా సంపుటికి “ మనిషే చెట్టైతే” అన్న పేరు సబబుగా వుంది.

అమ్మానాన్నకు లెక్కలు తెలియవంటూ తనకూ లెక్కలు తెలియలేదని, ఎన్ని తప్పులు దిద్దినా ఇంకా లెక్కలు రావడం లేదంటూ చెప్తూ

” లెక్కలు తప్పినప్పుడే కదా

   మనిషి చచ్చిపోయేది

   మనసు లేని 

   ఒక మాంసం ముద్దలుగా  

   మిగిలిపోయేది!”

బాధ్యతల బంధాల గురించి చాలా గొప్పగా “లెక్క(కు)లు రానివాళ్ళు” కవితలో చెప్పారు.

“వలసపక్షి”, “అలుపెరగని ప్రయాణం” కవితలు చాలా బావున్నాయి. 

        తన జ్ఞాపకాలను, మనసు భావాలను, దేశభక్తిని, సమాజ స్థితిగతులను, తాతయ్య జ్ఞాపకాలను, ఊరిని, విశ్వశాంతిని, పోలీసులను, కాలాన్ని ఇలా అన్నింటి గురించిన ఆలోచనలకు చక్కని అక్షర రూపాన్నిచ్చి కవితలుగా మలిచి,  “ మనిషే చెట్టైతే” అన్న కవిత్వ సంపుటిని తీసుకు వచ్చిన “డా. ఫణికుమార్ చకిలం”కు హృదయపూర్వక అభినందనలు.


0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner