అమ్మ దాచిన తాయిలం
కొంగుముడిలో
మనం చూడలేని
అమ్మతనం అనుభవ’మది..!!
మౌనం గానే ఎదగమని మొక్క నీకు చెపుతుంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధమందులో ఉంది.............. అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలినచోటే కొత్తచిగురు కనిపిస్తుంది
1. సారాయో
గంజాయో
ఎవడి యాపారం
వాడిది
ప్రపంచాన్ని
ఆక్రమించేయడమే..!!
2. వెలుతురు
చూడలేని వాస్తవాలు
చీకటి చుట్టాలై
బతికేస్తూ
ఆశల
విహంగాలు..!!
3. అహం
అదిలిస్తుంది
ఆప్యాయత
అక్కున చేర్చుకుంటుంది
ఏదైనా
బంధమే మరి..!!
4. మనం
గుర్తుంచుకోవడం
మనల్ని
గుర్తించడం
తేడా తెలుసుకుని
మసలుకోవాలి..!!
5. క్షణాలను
గుప్పిట బంధించలేము
సమయపాలన
అవసరమే
కాలమెప్పుడూ
మన చుట్టం కాదు..!!
6. చెప్పుకోవడానికే
అన్నీ
చేతికి
అందేవి కాదు
మానవ
సంబంధాలు..!!
నేను నేనుగా
వున్నాను
గతంలో
నన్ను నేను
కోల్పోయాను
వాస్తవంలో
రెండు కాలాలను
మోసుకుంటూ
నేనెవరో వర్తమానంలో..!!
రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారి సరికొత్త కవితా సంపుటి ముదిర గురించి నాలుగు మాటలు..!!
తెలుగు ఉపాధ్యాయినిగా పని చేసి, తెలుగుభాష మీద మక్కువతో తెలుగుభాషకు ఎనలేని సేవ చేసిన, చేస్తున్న ప్రముఖ తెలుగుభాషా పరిశోధకురాలు, కథ, కవిత, నవల, లేఖా సాహిత్యం వంటి ఎన్నో తెలుగు సాహితీ ప్రక్రియలలో నిష్ణాతురాలు, తెలుగు గజల్ చరిత్రలో తనకంటూ సముచితమైన స్థానాన్నిసంపాదించుకుని, ఎన్నో పురస్కారాలు, పలు ప్రపంచరికార్డులను సొంతం చేసుకున్న ప్రముఖవ్యక్తి “రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారి మరో కొత్త పుస్తకం “ముదిర” కు హృదయపూర్వక శుభాభినందనలు.
ఈ సృష్టికి మూలం స్త్రీ. అనాది నుండి ఈనాటి ఆధునిక యుగం వరకు స్త్రీ మనోభావాల గురించి ఎవరెన్ని చెప్పినా సమగ్రంగా స్త్రీమూర్తిని ఎవరూ ఆవిష్కరించలేదనే చెప్పాలి. ఆ ప్రయత్నంలోనే రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారు తనకున్న తెలుగుభాషా పటిమను ఉపయోగించి అచ్చంగా ముదిత మనోభావాలనే పలుకోణాల్లో ఆవిష్కరించే ప్రయత్నం “ముదిర” కవితా సంపుటిలో చేసారు.
ఈ “ముదిర” కవితా సంపుటిలో కొన్ని ఇలా నామాటల్లో మీ అందరి ముందుకు..
నాకంటూ ఎవరు లేకున్నా ప్రకృతి నాతో సహకరించినా, సహకరించకున్నా ప్రకృతిని నాలో ఇముడ్చుకుని స్నేహం కోసం, నాకంటూ ఓ చిరు గుర్తింపు కోసం “నేనిక్కడే ఉన్నా” అంటూ మగువ మనసు సున్నితత్వాన్ని అందంగా ఈ కవితలో చెప్పారు.
“మౌనం విలువ కాలం విలువ తెలిసేది ఒక్క ప్రేమికులకేనేమో..అనుభూతులను ప్రేమించే వారికేనేమో..అక్షరాలను, అనుభూతులను అందంగా మలచే కవికేనేమో..” అని చక్కని భావుకత్వాన్ని “నీవు నాతో ఉన్నప్పుడు జీవితం” ఓ రస ప్రవాహమౌతుంది అని చీకటి వెలుగుల జీవితాన్ని చిక్కని కవితగా చెప్పారు.
అక్షరాలను, పదాలను స్పర్శించే చూపులకు అక్షరాల, పదాల ఆత్మ అవగతమౌతుంది అని “ఐనా” కవితలో అతివ అంతరంగ కల్లోలాన్ని విప్పి చెప్పారు.
మరో కవిత “రాత్రి నిశ్శబ్దంలో” అనామికగా ఏకాంతమై ఏకాంతగా రాత్రి నిశ్శబ్దంలో వేలాడుతూ..మిగిలిన ఒంటరితనపు ఊసులను చెప్పారు.
“నేనో” కవిత నా గురించి ఎవరికి ఏం తెలుసు అన్న ప్రశ్నను సంధిస్తూ తనేంటో చెప్పడం చాలా బావుంది.
చీకటి, వెలుగు, ప్రకృతి, ప్రేమ, వేదన, సంవేదన, ఒంటరితనం, కోపం, శాంతం, ఓర్పు..ఇలా ఒకటనేమిటి సమస్త ప్రకృతిని తనలోని భావాలకు ఆపాదించి భాషాపరమైన వాడుకలో మరిచిన చాలా పదాలను తన కవితలో జొప్పించి, పదుగురిని మెప్పించగల నేర్పు, నైపుణ్యం రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారికి వెన్నతో పెట్టిన విద్య. తనదైన ప్రత్యేక శైలితో “ముదిర”ను ముగ్ధవంతంగా తీర్చిదిద్దారు. వారికి మరోసారి హృదయపూర్వక అభినందనలు.
https://www.facebook.com/share/v/1PZ9LSumvs/?mibextid=wwXIfr
ఒకప్పుడు సహజంగా బతికే మనం ఇప్పుడెలా జీవిస్తున్నామని ఆలోచిస్తున్నామా!
సహజసిద్ధమైన ప్రతిదీ మనకు భగవంతుడు, ప్రకృతి ప్రసాదించిన వరాలు. మనషి మేధస్సు పెరిగిన కొలది మానవాళికి ఉపయోగంతో పాటుగా, మనషి మనుగడ కూడా ప్రమాదంలో పడిపోతోంది. జననమరణాలను కూడా అసహజత్వంగా మార్చేస్తున్న ఇప్పటి కార్పొరేట్ వ్యవస్థ సమాజానికి మేలు చేస్తోందా? కీడు చేస్తోందా? అన్నది ప్రశ్నార్థకమే. వ్యవస్థ మనిషి మేధస్సుకు ప్రతిరూపం కావాలి కాని అష్టావక్రంగా మారకూడదు.
ఈ సృష్టిలో ప్రతి సమస్యకు చావే పరిష్కారం అనుకుంటే ప్రపంచం అంతా ఖాళీగా మారిపోయి వుండాలి. సమస్య లేని జీవరాశి ఈ సృష్టిలో వుండటం అరుదైన విషయం. మన పెద్దలు చెప్పినట్లు అన్ని జన్మలలోకెల్లా ఉత్తమమైనది మానవజన్మ. ఎవరికి ఉపయోగపడక పోయినా పర్లేదు, కనీసం మనం మరొకరికి భారంగా మారకుంటే చాలనుకున్నా మన జన్మకు సార్థకత లభించినట్లే. మనకోసం బతకడంలో కన్నా మన అనుకున్న వారి కోసం బతకడంలోని సంతృప్తి చాలా గొప్పది.
సహజ మరణాలు అతి సహజం. కాని ఇప్పటి రోజుల్లో అసహజ మరణాలు, బలవంతపు చావులు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీటికి ధనిక, పేద అన్న తేడా లేదు. పిల్లలు కూడా ఈ బలవన్మరణాలకు ఎక్కువగా పాల్పడటం అనేది చాలా బాధాకరం. అపురూపంగా పిల్లల్ని పాతికేళ్లు పెంచి, అందరికన్నా బావుండాలని తపనపడే తల్లిదండ్రులకు నేటి పిల్లలు ఇచ్చే బహుమతి..క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు, ఆ తల్లిదండ్రులను బతికున్న జీవచ్ఛవాలుగా మార్చేస్తున్నాయి. మనం చనిపోతే సమస్య చనిపోదు కదా. పోని సమస్య కోసం మన జీవితాన్ని ముగించేస్తూ వున్నవారికి మరింత బాధను కలగజేయడం సబబేనా! దయచేసి సమస్య కోసం చనిపోకండి. సమస్యను చంపే ప్రయత్నం చేయండి. మీ తల్లిదండ్రులకు మీరు ఆసరా కావాల్సిన వయసులో వారికి కడుపుకోతను కలిగించకండి.
ప్రతి చిన్న విషయానికి కూడా మనం ఈరోజుల్లో వింటున్న సర్వసాధారణమైన మాట “సమయం లేదు”. మన అనుబంధాలతో, ఆత్మీయులతో కూడా ఓ క్షణం సమయాన్ని కేటాయించ లేనప్పుడు మన జీవితానికి అర్థం లేదు. మనిషి బతికున్నప్పుడు మనం కేటాయించ లేని సమయాన్ని ఆ మనిషి చనిపోయినప్పుడు నాలుగు మాటలు చెప్పేసి చేతులు దులుపుకుంటే సరిపోదు. ఆ నాలుగు మాటలు ఆ మనిషి బతికున్నప్పుడు తనతో పంచుకుంటే ఇద్దరికి ఆత్మతృప్తి. కొన్ని క్షణాలను మన అనుకున్న వారి కోసం వెచ్చించే సమయాన్ని ప్రతొక్కరూ కల్పించుకుంటే చాలు. బోలెడు జీవితాలు సంతృప్తిగా సాగిపోతాయి.
మౌనంగా వుంటే ఎన్నో ఆలోచనలు వస్తాయి అందరికి....నాకు నా ఆలోచనలను అందరితో పంచుకోవాలని అనిపించి ఇది మొదలు పెట్టాను....మీ సలహాలు సూచనలు నాకందిస్తారని అనుకుంటూ....
చిన్నప్పటి నుంచి ఏదో చేయాలని వుండేది, అది కవితైనా, కధైనా వ్యాసమైనా, జీవితమైనా ఏదో ఒకటి... కనీసం ఒక్కరికి మనం మంచి చేయగలిగితే చాలు అనిపించేది. అమెరికాలో వున్నప్పుడు రోజు న్యూస్ పేపర్స్ లో అప్పుడే పుట్టిన పిల్లలని వదిలేసిన లేదా చంపేసిన సంఘటనలు ఎన్నో చదివి చాలా బాధ అనిపించేది....అలాంటి మానసిక సంఘర్షణల కి ఎన్నిటికో... ఒక రూపం నేను మొదలు పెట్టిన "URLC ట్రస్ట్"...ముందు ముందు మీ అందరి సహకారాన్ని సహాయాన్ని ఆశిస్తూ....నాలో వున్న నన్ను మీ ముందు ఉంచే ఈ చిరు యత్నమే.......