4, అక్టోబర్ 2025, శనివారం

జీవన మంజూష అక్టోబర్ 25


 నేస్తం,

         ఒకప్పుడు సహజంగా బతికే మనం ఇప్పుడెలా జీవిస్తున్నామని ఆలోచిస్తున్నామా!

సహజసిద్ధమైన ప్రతిదీ మనకు భగవంతుడు, ప్రకృతి ప్రసాదించిన వరాలు. మనషి మేధస్సు పెరిగిన కొలది మానవాళికి ఉపయోగంతో పాటుగా, మనషి మనుగడ కూడా ప్రమాదంలో పడిపోతోంది. జననమరణాలను కూడా అసహజత్వంగా మార్చేస్తున్న ఇప్పటి కార్పొరేట్ వ్యవస్థ సమాజానికి మేలు చేస్తోందా? కీడు చేస్తోందా? అన్నది ప్రశ్నార్థకమే. వ్యవస్థ మనిషి మేధస్సుకు ప్రతిరూపం కావాలి కాని అష్టావక్రంగా మారకూడదు.

          సృష్టిలో ప్రతి సమస్యకు చావే పరిష్కారం అనుకుంటే ప్రపంచం అంతా ఖాళీగా మారిపోయి వుండాలి. సమస్య లేని జీవరాశి సృష్టిలో వుండటం అరుదైన విషయం. మన పెద్దలు చెప్పినట్లు అన్ని జన్మలలోకెల్లా ఉత్తమమైనది మానవజన్మ. ఎవరికి ఉపయోగపడక పోయినా పర్లేదు, కనీసం మనం మరొకరికి భారంగా మారకుంటే చాలనుకున్నా మన జన్మకు సార్థకత లభించినట్లే. మనకోసం బతకడంలో కన్నా మన అనుకున్న వారి కోసం బతకడంలోని సంతృప్తి చాలా గొప్పది

          సహజ మరణాలు అతి సహజం. కాని ఇప్పటి రోజుల్లో అసహజ మరణాలు, బలవంతపు చావులు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీటికి ధనిక, పేద అన్న తేడా లేదు. పిల్లలు కూడా బలవన్మరణాలకు ఎక్కువగా పాల్పడటం అనేది చాలా బాధాకరం. అపురూపంగా పిల్లల్ని పాతికేళ్లు పెంచి, అందరికన్నా బావుండాలని తపనపడే తల్లిదండ్రులకు నేటి పిల్లలు ఇచ్చే బహుమతి..క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు, తల్లిదండ్రులను బతికున్న జీవచ్ఛవాలుగా మార్చేస్తున్నాయి. మనం చనిపోతే సమస్య చనిపోదు కదా. పోని సమస్య కోసం మన జీవితాన్ని ముగించేస్తూ వున్నవారికి మరింత బాధను కలగజేయడం సబబేనా! దయచేసి సమస్య కోసం చనిపోకండి. సమస్యను చంపే ప్రయత్నం చేయండి. మీ తల్లిదండ్రులకు మీరు ఆసరా కావాల్సిన వయసులో వారికి కడుపుకోతను కలిగించకండి

            ప్రతి చిన్న విషయానికి కూడా మనం ఈరోజుల్లో వింటున్న సర్వసాధారణమైన మాటసమయం లేదు”. మన అనుబంధాలతో, ఆత్మీయులతో కూడా క్షణం సమయాన్ని కేటాయించ లేనప్పుడు మన జీవితానికి అర్థం లేదు. మనిషి బతికున్నప్పుడు మనం కేటాయించ లేని సమయాన్ని మనిషి చనిపోయినప్పుడు నాలుగు మాటలు చెప్పేసి చేతులు దులుపుకుంటే సరిపోదు. నాలుగు మాటలు మనిషి బతికున్నప్పుడు తనతో పంచుకుంటే ఇద్దరికి ఆత్మతృప్తి. కొన్ని క్షణాలను మన అనుకున్న వారి కోసం వెచ్చించే సమయాన్ని ప్రతొక్కరూ కల్పించుకుంటే చాలు. బోలెడు జీవితాలు సంతృప్తిగా సాగిపోతాయి.


0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner