రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారి సరికొత్త కవితా సంపుటి ముదిర గురించి నాలుగు మాటలు..!!
తెలుగు ఉపాధ్యాయినిగా పని చేసి, తెలుగుభాష మీద మక్కువతో తెలుగుభాషకు ఎనలేని సేవ చేసిన, చేస్తున్న ప్రముఖ తెలుగుభాషా పరిశోధకురాలు, కథ, కవిత, నవల, లేఖా సాహిత్యం వంటి ఎన్నో తెలుగు సాహితీ ప్రక్రియలలో నిష్ణాతురాలు, తెలుగు గజల్ చరిత్రలో తనకంటూ సముచితమైన స్థానాన్నిసంపాదించుకుని, ఎన్నో పురస్కారాలు, పలు ప్రపంచరికార్డులను సొంతం చేసుకున్న ప్రముఖవ్యక్తి “రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారి మరో కొత్త పుస్తకం “ముదిర” కు హృదయపూర్వక శుభాభినందనలు.
ఈ సృష్టికి మూలం స్త్రీ. అనాది నుండి ఈనాటి ఆధునిక యుగం వరకు స్త్రీ మనోభావాల గురించి ఎవరెన్ని చెప్పినా సమగ్రంగా స్త్రీమూర్తిని ఎవరూ ఆవిష్కరించలేదనే చెప్పాలి. ఆ ప్రయత్నంలోనే రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారు తనకున్న తెలుగుభాషా పటిమను ఉపయోగించి అచ్చంగా ముదిత మనోభావాలనే పలుకోణాల్లో ఆవిష్కరించే ప్రయత్నం “ముదిర” కవితా సంపుటిలో చేసారు.
ఈ “ముదిర” కవితా సంపుటిలో కొన్ని ఇలా నామాటల్లో మీ అందరి ముందుకు..
నాకంటూ ఎవరు లేకున్నా ప్రకృతి నాతో సహకరించినా, సహకరించకున్నా ప్రకృతిని నాలో ఇముడ్చుకుని స్నేహం కోసం, నాకంటూ ఓ చిరు గుర్తింపు కోసం “నేనిక్కడే ఉన్నా” అంటూ మగువ మనసు సున్నితత్వాన్ని అందంగా ఈ కవితలో చెప్పారు.
“మౌనం విలువ కాలం విలువ తెలిసేది ఒక్క ప్రేమికులకేనేమో..అనుభూతులను ప్రేమించే వారికేనేమో..అక్షరాలను, అనుభూతులను అందంగా మలచే కవికేనేమో..” అని చక్కని భావుకత్వాన్ని “నీవు నాతో ఉన్నప్పుడు జీవితం” ఓ రస ప్రవాహమౌతుంది అని చీకటి వెలుగుల జీవితాన్ని చిక్కని కవితగా చెప్పారు.
అక్షరాలను, పదాలను స్పర్శించే చూపులకు అక్షరాల, పదాల ఆత్మ అవగతమౌతుంది అని “ఐనా” కవితలో అతివ అంతరంగ కల్లోలాన్ని విప్పి చెప్పారు.
మరో కవిత “రాత్రి నిశ్శబ్దంలో” అనామికగా ఏకాంతమై ఏకాంతగా రాత్రి నిశ్శబ్దంలో వేలాడుతూ..మిగిలిన ఒంటరితనపు ఊసులను చెప్పారు.
“నేనో” కవిత నా గురించి ఎవరికి ఏం తెలుసు అన్న ప్రశ్నను సంధిస్తూ తనేంటో చెప్పడం చాలా బావుంది.
చీకటి, వెలుగు, ప్రకృతి, ప్రేమ, వేదన, సంవేదన, ఒంటరితనం, కోపం, శాంతం, ఓర్పు..ఇలా ఒకటనేమిటి సమస్త ప్రకృతిని తనలోని భావాలకు ఆపాదించి భాషాపరమైన వాడుకలో మరిచిన చాలా పదాలను తన కవితలో జొప్పించి, పదుగురిని మెప్పించగల నేర్పు, నైపుణ్యం రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారికి వెన్నతో పెట్టిన విద్య. తనదైన ప్రత్యేక శైలితో “ముదిర”ను ముగ్ధవంతంగా తీర్చిదిద్దారు. వారికి మరోసారి హృదయపూర్వక అభినందనలు.
https://www.facebook.com/share/v/1PZ9LSumvs/?mibextid=wwXIfr

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి