కొన్ని అబద్ధాలను
నిజమని నమ్మేస్తాం..
ఎందుకంటే
అప్పటికి ఆ అబద్ధాలే
బావుంటాయి కాబట్టి..!!
మౌనం గానే ఎదగమని మొక్క నీకు చెపుతుంది ఎదిగిన కొద్ది ఒదగమనే అర్థమందులో ఉంది.............. అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలినచోటే కొత్తచిగురు కనిపిస్తుంది
కొన్ని అబద్ధాలను
నిజమని నమ్మేస్తాం..
ఎందుకంటే
అప్పటికి ఆ అబద్ధాలే
బావుంటాయి కాబట్టి..!!
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీశ్రీ కళావేదిక వారి ఆత్మీయ పురస్కారం..
కత్తిమండ ప్రతాప్ గారికి మరియు శ్రీశ్రీ కళావేదిక నిర్వాహకులు అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు.
1. వద్దనుకునే
బంధాలు
విదిలించుకోలేని
పాశాలు
మనసు
సున్నితమైనది..!!
2. బాధ్యత
లేదు
బంధాలు
అవసరార్థమే
కొందరు
పరాన్నజీవులు..!!
3. ఆకాశంలో చుక్కలు
చూపడం సులువే
లెక్కలేయడమే
బహు కష్టం
నీటి మీది
రాతలు..!!
4. ఆట
ఆడాలి
వేట
కొనసాగించాలి
గెలుపుదే
పైచేయి..!!
అవసరాల
అంతిమయాత్రకు
అడ్డుకట్టలు వేయడానికి
మనకంటూ..
కొన్ని లక్షణాలు వుండాలి
ఏ రాకలో
ఏ మర్మముందో
తెలుసుకోవడానికి..
మాటల మూటలు సరిపోవు
బలమైన బంధనాలు కావాలి
ఏ పోకడలను
అక్కడే ఆపాలంటే
పట్టు గట్టిగా బిగించాలి
లేదంటే..
దట్టమైన చుట్టరికమైనా మిగిలుండాలి
కాలానికి
నిలువెత్తు రూపురేఖలు
సుఖదుఃఖాల సమతూకమైన
చావుపుట్టుకల రాకపోకలే
జీవన ప్రమాణాల ప్రయాణాలు..!!
https://youtu.be/gxNczA3-brk?si=srqjofwvPtQY7lVK
చాలా కాలం తరువాత బాగా నచ్చిన సినిమా. సినిమా అంటే ఇలా వుండాలి. సీరియస్నెస్ లో కామెడి అంటే మామూలు విషయం కాదు. ఓ నిమిషం ఎలా వుంటుందో చూద్దామని మెుదలుపెట్టి సినిమా అయ్యే వరకు ఆపలేదంటే..మీరే అర్థం చేసుకోండి..మంచి సినిమా మిస్ కాకండి.
క్షణాలను పోగేసుకుంటూ
పరుగెత్తి పోతూనే వుంది కాలం
బంధాలను వదిలించుకుంటూ
యాంత్రికంగా మారిపోతున్నాడు మనిషి
అంతరిక్షానికి ఎగుతున్న విజ్ఞానాన్ని చూస్తూ
అదే పురోగతి అనుకుంటోంది మేధస్సు
మత్తులో తూగుతూ మాయాప్రపంచమే
మహా గొప్ప సంప్రదాయమనుకుంటోంది ఈనాటి యువత
క్రీడ ఏదైనా తనదే
పై చేయి అంటోంది ఆధిపత్యపు అభిజాత్యం
ఏ రాత ఎలా రాసినా
విధిరాత చేవ్రాలు చెరపలేమని తెలియక(తెలిపేవే ఈ అక్షరాలు)..!!
కొన్ని అరుదైన సంతోషాలు, జ్ఞాపకాలు, వెలకట్టలేని బహుమతులు జీవితంలో అనుకోకుండా దక్కుతాయి. అలా నాకు లభించిన కానుక మెున్న 5 ఫిబ్రవరి 2026.
ఆ అవకాశం నాకు కల్పించిన మా శిశు విద్యామందిరం, అవనిగడ్డ సీనియర్ శ్రీ సింహాద్రి రామలింగేశ్వరరావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
మేము చదువుకున్న పాఠశాల వార్షికోత్సవానికి నేనూ ఓ అతిథిగా వెళ్ళడం, రామలింగేశ్వరరావు గారు నాకు అరుదైన కానుకను ఇవ్వడం నా పూర్వజన్మ సుకృతం.
ఆమె చదువుకున్నప్పుడు.. ఆ స్కూల్ పేరు “శిశు విద్యా మందిరం, అవనిగడ్డ” లో 2 నుండి 6 వరకు అక్కడ చదివారు. ఇప్పుడు అదే స్కూల్ “విద్యా విహార్” గా రూపాంతరం చెందింది.
పేరు: మంజు యనమదల
చదువు: ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్.
అమ్మానాన్న : యనమదల సుబ్బారావు సామ్రాజ్యం గార్లు
అర్ధ భాగం: యార్లగడ్డ రాఘవేంద్ర రావు గారు
పిల్లలు: మౌర్యచంద్ర, శౌర్యచంద్ర
మెుదటిగా ఆహ్వానం సాహిత్య పత్రికలో కవిత ముద్రితమైంది.
2009లో ఏదో రాద్దామని “కబుర్లు కాకరకాయలు” బ్లాగ్ మెుదలుబెట్టాను అంటారు. అప్పటినుండి ఇప్పటి వరకు 2500 పోస్టులు రాశారు.. కవితలు, ఏక్ తారలు, ద్విపదలు, త్రిపదలు, రెక్కలు, వ్యాసాలు ఇలా కొన్ని సాహితీ ప్రక్రియల్లో ఆమె రాతలు కొనసాగుతున్నాయి..
మంజు యనమదల గారి ముద్రిత రచనలు
అక్షరాల సాక్షిగా..నేను ఓడిపోలేదు (కవిత్వం)
సడిచేయని (అ)ముద్రితాక్షరాలు ( మంజు మనసు ముచ్చట్లు)
చెదరని శి(థి)లాక్షరాలు ( కవిత్వం)
గుప్పెడు గుండె సవ్వడులు (జంట కవిత్వం) (మంజు వాణి)
5. అంతర్లోచనాలు ( మంజు మనసు ముచ్చట్లు)
6. ఏ’కాంతా’క్షరాలు ( ఏక్ తారలు)
7. అక్షర స(వి)న్యాసం (కవిత్వం)
8. కాలం వెంబడి కలం..అక్షరాలతో అనుబంధం (స్వగతం)
9. అక్షర విహంగాలు (రెక్కలు)
10. రాతిరి చుక్కలు..అక్షరాంగనల ఆంతర్యాలు (రెక్కలు) ( మంజు వాణి విజయ)
11. మూల్యాంకనం (కవిత్వం)
12. అవ్యక్తం(వ్యాసాలు)
13. అక్షరాలతో అనుబంధాలు(యనమదల వారి వంశవృక్షం)
14. జీవన మంజూష ( నవ మల్లెతీగలో ముద్రితమైన వ్యాసాలు )
15. గాలివాటం(రెక్కలు)
ఆమె రాతలకు మెచ్చి ప్రైడ్ ఎడ్యుకేషనల్ సొసైటీ వారు “కావ్యశ్రీ” పురస్కారాన్ని,
సుధీక్షణ్ ఫౌండేషన్ వారు “ఉత్తమ కవయిత్రి” పురస్కారం,” గిడుగు పురస్కారం” అంతర్లోచనాలు పుస్తకానికి,
“విశిష్ట పురస్కారం” కవితాలయం నుండి,
లివ్ అండ్ లెట్ లైవ్ ఫౌండేషన్ వారు “ఐడియల్ఉమన్ అవార్డ్ 2021” కి గాను అందించారు. ఆంధ్రాఆర్ట్స్ అకాడమీ మరికొన్ని సంస్థలు సంయుక్తంగా అందించిన “ 2021 ఉగాది పురస్కారం”, శ్రీశ్రీ కళాపీఠం వారి జాతీయ ప్రతిభా పురస్కారం తెలుగు తేజం, నారీరత్న(ఉమెన్ ఆఫ్ ఎక్స్లెన్స్ అవార్డ్ 2024), మరెన్నో ఆత్మీయ సత్కారాలు లభించాయి.. మల్లెతీగ సాహిత్య మాస పత్రికలో జీవన 'మంజూ'షకాలం, గోదావరి వార్తా పత్రికలో బోలెడు పుస్తక సమీక్షలు, మనం, ఆంధ్రప్రభ, గో తెలుగు డాట్ కాం, ఆంధ్రా ప్రవాసి, రవళి, తెలుగు సంస్కృతి విశాఖ, ఇంకా మరెన్నో అంతర్జాల పత్రికలలో రచనలు ప్రచురితం.
క్రిందటేడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ “ఉగాది పురస్కారం” లభించింది.
23 జనవరి 2008న స్థాపించిన “ఉప్పల రాజ్యలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్” ద్వారా ఎందరో పేద విద్యార్థులకు చేయూతను అందిస్తున్నారు.
ఇది మంజు యనమదల గారి రచనా ప్రస్థానం.
మంజు యనమదల గారికి అభినందనలు శుభాకాంక్షలు అందిద్దాం..
అవసరానికి మించినది ఏది వున్నా, ఎంత వున్నా మనిషికి దాని విలువ తెలియదు. తృప్తికి సరైన అర్థం తెలియని మనలో చాలామంది ఎంత వున్నా, ఎన్ని వున్నా ఇంకా ఏదో కావాలని ప్రాకులాడుతూనే వుంటారు. ఈ పరుగు, గమ్యం మనకు తెలియకుండా సాగిపోతూనే వుంటుంది. జీవితంలో అలసిపోతున్నా తప్పని పయనమంటూ పరుగులు పెడుతూనే వుంటారు. మనమెంత ప్రాకులాడినా మనకు దక్కాల్సినదే దక్కుతుంది అన్న ఆలోచన అస్సలు రాదు. ఏదైనా మనకెంత ప్రాప్తమో అంతే లభిస్తుంది. ఈ చిన్న లాజిక్ మర్చిపోయి మనమూ ప్రశాంతంగా వుండము, మనతో వున్నవారిని ప్రశాంతంగా వుండనీయము.
తన చుట్టూ ఎందరున్నా ఎవరూ లేని ఏకాకులు కొందరు. ఎన్ని వున్నా ఏమీ లేని నిరుపేదలు మరికొందరు. తత్వం బోధపడని వారు తాత్వికులమని చెప్పుకుంటారు. అన్నీ తెలిసినవారు ఏమి తెలియని నిరాడంబరులుగా జీవిస్తుంటారు. వీరు ప్రపంచానికి పిచ్చివాళ్లుగా కనబడుతుంటారు. విలువ అనేది మన వెనుకనున్న ఆస్తిని బట్టో, లేదా మనకున్న అధికారాన్ని బట్టో రాదు. మన నడవడి, నడతను బట్టి నిర్ణయం జరుగుతుంది. మన స్థితిగతులు మన స్థాయిని ఈ సమాజంలో పెంచవచ్చు. కాని మనమేంటన్నది మన మానసిక స్థితిని బట్టి తెలుస్తుంది. మన ఊపిరి మరికొందరికి ఊతమవ్వాలి కాని ఉసులు తీయకూడదు.
మన మాటలు, చేతల ప్రభావంతో మన స్థాయిని చూపించుకోవాలని అనుకోవడం సమంజసం కాదు. సమాజంలో మన స్థితి చాలామంది కన్నా మెరుగుగా వుండొచ్చు కాని ఆ స్థాయిని వున్నతంగా చూపించుకోవడం కన్నా నలుగురికి సాయం చేయడంలో శ్రద్ధ పెడితే మన మానవత్వం బయటబడుతుంది. అందరు ఒకే స్థాయిలో గొప్పవారుగా మనలేరు. ఎవరి మేధస్సు వారిది. ఈ సమాజంలో “స్టేటస్” దే ప్రధాన పాత్రగా నడుస్తోందిప్పుడు. జీవిత పరమపద సోపానంలో గెలుపోటములు శాశ్వతం కాదు. అందరికి ఈ విషయం తెలిసినా, తెలియనట్లే మనం నటిస్తూ, బంధాలను, బంధుత్వాలను మన అవసరాలకు వినియోగించుకుంటూ సగటు మనిషిగానే ఈ సమాజంలో బతికేస్తున్నాం.
మనం బావుండడానికి మన అతి తెలివిని ఉపయోగిస్తూ, బాగా తెలివిగలవారిమని పొంగిపోతుంటాం. కాలం కలిసి వస్తే ఏదో సామెత చెప్పినట్టుగా మన మేధావితనమని విర్రవీగుతాం. అందరికి అవకాశాలు వాటంతట అవి రావు. కొందరు మాత్రమే అవకాశాలని సృష్టించి చరిత్రలో నిలిచిపోతారు. అవకాశవాదులు కొన్నాళ్ళు మాత్రమే హవా కొనసాగిస్తారు. ఆశావహులు అవకాశాల కోసం ఎదురుచూస్తూనే వుంటారు. నిరాశావాదులు నిరాశ్రయులుగా మిగిలిపోతారు. ఈ రెప్పపాటు జీవితానికి ఎన్నెన్ని రూపాలో మనలోనే. శాశ్వతానికి, అశాశ్వతానికి అక్షరమే తేడా. మనిషి జీవితానికి కూడా చివరి మజిలీలో మిగిలేది ఏమిటన్నది అందరికి అవగతమే. ఆస్తులు, అంతస్తులు ఏవీ వెంట రావు. మనం చేసే మంచి, చెడు మాత్రమే మన తరువాతి తరాలకు మనమిచ్చే విలువైన సంపద..!
” కాన్సర్ వైద్యరంగంలో అగ్రగణ్యుడు మన తెలుగువాడు నోరి “
వైద్యో నారాయణో హరిః అన్న మన భారతీయ ఆర్యోక్తికి నిలవెత్తు నిదర్శనం డాక్టర్ నోరి దత్తాత్రేయ గారు. మన ప్రాచీన వైద్యవిద్యకు ధన్వంతరి మూలపురుషుడైతే, మెుట్టమెుదటి శస్త్రచికిత్సను చేసిన వైద్యుడు శుశ్రుతుడు. ఆ శుశ్రుతనికి ఏమాత్రం తీసిపోని విధంగా కాన్సర్ గురించి ప్రపంచమంతా భయపడే తరుణంలో తనదైన వైద్యంతో ప్రపంచ వ్యాప్తంగా ఎందరికో ప్రాణదానం చేసిన దేవుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారు.
దత్తాత్రేయ గారిది కృష్ణాజిల్లా లోని తోట్లవల్లూరు. పుట్టింది మంటాడలో. సత్యనారాయణ, కనకదుర్గమ్మ గార్ల ఆఖరి సంతానం. తండ్రి ఉపాధ్యాయుడు. దత్తాత్రేయ గారి వయసు నాలుగు సంత్సరాలప్పుడు తండ్రి కురుమద్దాలి శ్రీరామ అవధూత పిచ్చెమ్మ ఆశ్రమంలో ప్రవచనాలు చెప్తూ, ప్రమాదవశాత్తు మరణించారు. తనకున్న కొద్దిపాటి పొలాన్ని ఆశ్రమానికే ఇచ్చేసారు.ప్రవచనాలు చెబితే వచ్చే డబ్బు కూడా ఆయన ఆశ్రమానికే ఇచ్చేవారు. ఆయన మరణానంతరం పిల్లల ఉన్నతి కోసం ఆ తల్లి పడని కష్టం లేదు. దత్తాత్రేయ గారి పరీక్ష ఫీజు కట్టడానికి తల్లి గాజులు అమ్మి ఫీజు డబ్బులు ఇచ్చారు.
దత్తాత్రేయ గారు ఉస్మానియాలో అంకాలజీలో పరిశోధనా విద్యార్థిగా ఉన్నప్పుడు, ఓ అంతర్జాతీయ సదస్సుకు అమెరికా నుండి వచ్చిన వైద్యబృందానికి సహాయకుడిగా నియమించారు. ఆ సమయంలో వీరిలోని కొత్త విషయాలు తెలుసుకోవాలన్న జిజ్ఞాసను కనిపెట్టి ఓ పెద్దాయన తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి అమెరికా వచ్చినప్పుడు కలవమన్నారట. చదువు పూర్తయిన తర్వాత ఇండియా , అమెరికాలలో చాలా ఉద్యోగ ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. చివరిగా తనకు విజిట్ంగ్ కార్డ్ ఇచ్చినాయనను వెదుక్కుంటూ స్లోన్ కెటరింగ్ మెమోరియల్ కేన్సర్ సెంటర్ కి వెళితే, అక్కడ కూడా ఫెలోషిప్ ఎంపికలు అయిపోయాయని, ఎవరైనా రాకపోతే సీట్ ఇస్తామన్నారట. మంచి మనసుకు దైవం సహకరిస్తుందనడానికి నిదర్శనంగా వీరికి సీట్ లభించడమే కాకుండా, అంచెలంచెలుగా ఎదిగి తనకు విజిటింగ్ కార్డ్ ఇచ్చిన పెద్దాయన చైర్మన్ పదవినే చేపట్టారు.
ప్రపంచం గుర్తుంచుకునే శాస్త్రవేత్తగా కాన్సర్ వైద్యంలో రోగికి సురక్షితమైన రేడియేషన్ యంత్రాన్ని కనిపెట్టారు. ఈనాడు ప్రపంచమంతటా కాన్సర్ రేడియేషన్ లో ఈ పరికరాన్నే వాడుతున్నారు. కాన్సర్ కి కారణాలను కనుగొనడానికి, అరికట్టడానికి ఎన్నో పరిశోధనలు చేసి ఎందరికో ప్రాణదానం చేసారు. వీరి వైద్యసేవలు ప్రపంచమంతటా విస్తరించాయి. ఎందరో సినీ,రాజకీయ ప్రముఖులకు వీరు తన వైద్య సేవలను అందించారు. లెక్కకు మించిన ధనం సంపాదించడం తన చేతిలోని పనే అయినా, ప్రముఖులు ఇవ్వబోయిన ధనాన్ని సైతం సున్నితంగా తిరస్కరించారు. బసవతారకరామారావు మెమోరియల్ కాన్సర్ ఫౌండేషన్ పాలకవర్గంతో కలిసి పనిచేసారు. అన్నింటికన్నా ముఖ్యమైనది తనింతటివాడు కావడానికి కారణమైన స్లోన్ కెటరింగ్ మెమోరియల్ వ్యవస్థాపకుడికి చర్మ కాన్సర్ వస్తే, తన వైద్యంతో ఆయనను బ్రతికించి ఓ వైద్యునిగా గెలిచారు.
ఇన్నేళ్ళ కేన్సర్ పరిశోధనలకు, వైద్యసేవలకు దక్కాల్సిన అన్ని పురస్కారాలు ఆయనను వరించాయి. పేదరికం ఉన్నత ఆశయానికి అడ్డంకి కాదని డాక్టర్ నోరి దత్తాత్రేయ గారి జీవితం నిరూపిస్తోంది. అత్యున్నత వ్యక్తిత్వం, సేవానిరతి మెండుగా గల వీరి జీవితం యువతకు స్పూర్తిదాయకం. వీరి ఆత్మకథ “ ఒదిగిన కాలం “ లో ఎన్నో విషయాలను పొందుపరిచారు. “ కదిలే కేన్సర్ ఆసుపత్రి “ని నిర్మించి వైద్యసేవలు అందించాలన్న సదాశయం, కేన్సర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అన్న పుస్తకంలో అనేక విషయాలను తెలుగువాళ్ళతో పంచుకోవాలని పుస్తకం రాయడానికి పూనుకున్నారు. వీరి భార్యాకూతురు కూడా డాక్టర్‌లే. కొడుకు లాయర్.
వైద్య శాస్త్రవేత్తగా అమెరికా నుండి స్వదేశానికి తిరిగి వస్తూ అమ్మకు తన మెుదటి జీతంతో బంగారు గాజులు కొని తెచ్చారట. మన తెలుగువాడి ఘనతను యావత్ ప్రపంచమే కీర్తిస్తోంది ఈనాడు. ప్రపంచాన్ని నడిపే కనబడని శక్తిని దైవమని నమ్మే వ్యక్తి, నిలువెత్తు మానవతామూర్తి, శిరిడిసాయి భక్తుడు అయిన డాక్టర్ నోరి దత్తాత్రేయ గారిని కృష్ణా డిస్ట్రిట్ లారి ఓనర్స్ ఫౌండేషన్ తరపున ఈ చిరు సత్కారం చేయడం శ్రీకృష్ణడికి అటుకులిచ్చిన కుచేలుడిలా భావిస్తూ నిండు నూరేళ్ళు సుఖసంతోషాలతో జీవించాలని కోరుకుంటూ ఈ సదవకాశానికి మనఃపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
సినిమాని సినిమాలా చూడాలి. డబ్బుల కోసమో, మరోదాని కోసమో రివ్యూలు రాయడం “అతడు” అప్పటి నుండి చూస్తూనే వున్నాము. నిజాయితీగా రాసే రివ్యూలకు విలువ వుంటుంది. ఒక నటుడిలో అన్ని కోణాలను ఆవిష్కరించడం చాలా కష్టం. ఆ కష్టానికి తగిన ప్రతిఫలం ఆశించేది అభిమానుల నుండి ఆదరణ. “మన “డార్లింగ్” కి ఆ ఆదరణ మెండుగా వుంది. సరదాగా చూడాల్సిన సినిమా “రాజాసాబ్”.
నేస్తం,
సమస్యకు భయపడుతుంటే, అది మనల్ని ఎక్కువగా భయపెడుతుంది. ఒక్కసారి సమస్య నుండి పారిపోవాలన్న ఆలోచనను వదిలి, దానికి ఎదుర్కోవడానికి సిద్ధపడితే ఎంతటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుంది. కారణాలు లేని భయాలు మన జీవితాలను అతలాకుతలం చేస్తాయి. మన అసహనాన్ని ఇతరుల మీద చూపించడం కూడా ఓ పెద్ద మానసిక సమస్యే. సమస్య ముందుగా మనిషి బలహీనతపై దాడి చేస్తుంది. మానసిక స్థితి బలంగా వుంటే, సమస్య భయపెట్టదు. పరిష్కారం చూపెడుతుంది.
ఈరోజుల్లో ఎవరి జీవితాలు వారివి. ఎవరి సమస్యలు వారికున్నాయి. గడిచిన కాలాన్ని మనకు జ్ఞానం అందించిన గురువుగా భావిస్తే, తరువాతి జీవితాన్ని చాలావరకు సంతోషంగా గడపగలం. ఓటమి నుండి నేర్చుకున్న పాఠాలు మనిషిని మానసిక బలవంతుడిగా చేస్తాయి. ఓటమి మనకు మనవారెవరో, పరాయివారెవరో కూడా చూపిస్తుంది. ఓటమి మనకు ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. గెలుపు మనల్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. కాలక్రమంలో మరొకరి గెలుపు మనల్ని ప్రపంచం మర్చిపోయేలా చేస్తుంది. మన గెలుపు ప్రపంచానికి గుర్తుండి పోవాలంటే ఆ గెలుపు అనితరసాధ్యం కావాలి.
నలుగురికి మంచి చేసే అవకాశం మనకు భగవంతుడు ఇచ్చినప్పుడు, దానిని సద్వినియోగం చేసుకోవాలి. అలా కాకుండా మనం మాత్రమే ఎదగాలనుకుంటే, పర్యవసానం తెలిసినా దానిని గుర్తించనట్లుగా నటించడం మన మానసిక బలహీనత. మనం ఒకరికి మంచి చేయకపోయినా పర్లేదు కాని చెడు చేయకుండా వుండటమే మంచి చేసిన దానికన్నా గొప్ప విషయం. సామాజిక మాధ్యమాలు విరివిగా అందుబాటులో వున్న ఈనాడు ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా క్షణాల్లో అందరికి తెలిసిపోతోంది. మన పక్కనే హృదయవిదారక సంఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నా వాటికి మన స్పందన ఏమి వుండదు. కాని ప్రపంచంలో ఏ మూలనో జరిగిన సంఘటనకు మాత్రం అతిగా స్పందించేసి, మనం గొప్ప మానవతావాదులమని చాటుకుంటుంటాం.
రోడ్డు మీద మనిషి చావుబతుల్లో వుంటే మనకెందుకని పక్క నుండి వెళ్లిపోయే మనకు సూక్తిముక్తావళి చెప్పే నైతికత వుందంటారా! కనీసం ఎంగిలి చేత్తో కాకిని కూడా విదిలించని మన మనస్తత్వానికి మనం ఏ మందు వేసుకోవాలో ముందు తెలుసుకోవాలి. ముందుగా మన ఇంటి, చుట్టుపక్కల సమస్యలకు స్పందించి, తరువాత ప్రపంచాన్ని గురించి ఆలోచిద్దాం. ఏమంటారు మరి?
మౌనంగా వుంటే ఎన్నో ఆలోచనలు వస్తాయి అందరికి....నాకు నా ఆలోచనలను అందరితో పంచుకోవాలని అనిపించి ఇది మొదలు పెట్టాను....మీ సలహాలు సూచనలు నాకందిస్తారని అనుకుంటూ....
చిన్నప్పటి నుంచి ఏదో చేయాలని వుండేది, అది కవితైనా, కధైనా వ్యాసమైనా, జీవితమైనా ఏదో ఒకటి... కనీసం ఒక్కరికి మనం మంచి చేయగలిగితే చాలు అనిపించేది. అమెరికాలో వున్నప్పుడు రోజు న్యూస్ పేపర్స్ లో అప్పుడే పుట్టిన పిల్లలని వదిలేసిన లేదా చంపేసిన సంఘటనలు ఎన్నో చదివి చాలా బాధ అనిపించేది....అలాంటి మానసిక సంఘర్షణల కి ఎన్నిటికో... ఒక రూపం నేను మొదలు పెట్టిన "URLC ట్రస్ట్"...ముందు ముందు మీ అందరి సహకారాన్ని సహాయాన్ని ఆశిస్తూ....నాలో వున్న నన్ను మీ ముందు ఉంచే ఈ చిరు యత్నమే.......