జీవితపు మదిలో మలుపుల సమ్మేళనమే ఈ “మలుపు”
ప్రతి మనిషి జీవితంలోనూ ఎన్నో అనుభవాలు. అవి తీపిచేదుల కలయికలు. అనుభవాలను, అనుబంధాలను అందరు అక్షరీకరించలేరు. అనుభవాలకు అనుబంధాలను జత కూర్చి చక్కని కథలుగా మన ముందుకు “మలుపు” కథల సంపుటిని తీసుకువచ్చారు డాక్టర్ లక్ష్మీ రాఘవ గారు. డాక్టర్ లక్ష్మీ రాఘవ గారి కథలు చదువుతుంటే చాలా వరకు అవి మనకు జరిగిన అనుభవాలో లేక మన చుట్టూ వున్న సమాజంలో మనకు ఎదురుపడిన సంఘటనలో అని అనిపించక మానదు. సరళమైన భాషలో అందరికి సులభంగా అర్థమయ్యే తీరులో ఈ కథలన్నీ వున్నాయి.
జీవితంలో బాధల వెంట సంతోషాలు వుంటాయని తెలిపే కథ “మలుపు”.
“కాలం మారితే” కథ ఈనాటి పరిస్థితులకు అనుగుణంగా మనిషి ఆలోచనా విధానాన్ని తెలిపిన కథ.
టెక్నాలజీ పెరగడం మంచిదో కాదో అంటూ నిర్ణయాన్ని పాఠకులకు వదిలేసిన కథ “జాతకం”.
“అప్పగారి పాపోడు” పల్లెటూరి ఆత్మీయతను మనసుతో చూపించిన కథ.
ఓటమి నేర్పిన సత్యంతో గెలుపు ఎంత తృప్తినిస్తుందో చిన్నపిల్లలతో చెప్పించిన కథ “స్నేహం” చాలా బావుంది.
వస్తువులతో పాటుగా మనిషి శరీరానికి అప్పుడప్పుడు “రిపేరు” అవసరమే.
హృద్యమైన మనసు ఆర్తి, ఆర్తనాదము కలిస్తే “కంటి నీరు” కథ.
“అవసరానికి” ఎవరు మనవాళ్ళో తెలిపిన స్నేహితుల కథ.
“మనుమరాలి ప్రేమ” కథలో అమ్మమ్మ మనసును తెలిపారు.
ఇల్లాలి తెలివి ఇంటికి వెలుగు అని నిరూపించిన కథ “కమల”.
పదిమందికి వరంగా మారిన అంతర్లీన శక్తిని “శబ్దాల శాంతి” లో వినవచ్చు.
“రేపటి ప్రశ్న” కథ మనలోని చాలామంది కథే. ఈనాటి సమాజానికి అవసరమైన కథ.
జీవితంలో ఏది జరిగినా “కర్మానుసారమే” అన్న మాట నిజంగా నిజం.
గురువుల ప్రవర్తన పిల్లలతో ఎలా వుండాలనేది “తల్లి ఆవేదన” కథలో బాగా చెప్పారు.
“మారాల్సిన దృశ్యం” అనుబంధాల బాధ్యతలను సవివరంగా చెప్పిన కథ.
నిజాయితీకి దక్కిన విలువైన గౌరవాన్ని “నిజాయితీ నిడివి” కథలో చూడవచ్చు.
“ప్రాధాన్యత” కథ నిజంగా ప్రాధాన్యతే అమెరికా పిల్లలకు, ఇండియా తల్లిదండ్రులకు.
ఆత్మవిశ్వాసమే “ఆయుధం”గా మారి నలుగురిని ఆదర్శప్రాయమైన జీవితమే “ఆయుధం “ కథ.
ఇలానే మరి కొన్ని కథల సమాహారమే ఈ “మలుపు” కథా సంపుటి.
మానవత్వం అంటే ఏమిటో తెలియజెప్పిన కథ “నిబంధన”.
చివరిగా తమ యాభై ఏళ్ల అనుబంధాన్ని “జ్ఞాపకాల సంతకం”, “Journey of Life” అంటూ చిన్న కవితే అయినా మెుత్తం జీవిత సారాన్ని చెప్పేసారు.
డాక్టర్ లక్ష్మీ రాఘవ గారు తన అనుభవాలను, మన అనుభవాలను ఏర్చికూర్చి ఈ సమాజానికి అవసరమైన విషయాలను, చాలా వరకు సమస్యలకు ముగింపులను కూడా సవ్యదిశగానే చూపించారు. ప్రతి సమస్యకు సాధ్యమైనంత వరకు మంచి పరిష్కారాలను సూచించారు. మనిషి మానసిక భావోద్వేగాలను ప్రతి కథలోనూ హృద్యంగా మలిచారు. 27 కథలతో వెలువడిన “మలుపు” కథా సంపుటి విలువైన పుస్తకం. అందరు తప్పక చదవాల్సిన పుస్తకం. ఇంత మంచి పుస్తకాన్ని అందించిన డాక్టర్ లక్ష్మీ రాఘవ గారికి హృదయపూర్వక అభినందనలు.


0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి