పద్మభూషణుడు “నోరి దత్తాత్రేయుడు” గారికి హృదయపూర్వక అభినందనలు.
” కాన్సర్ వైద్యరంగంలో అగ్రగణ్యుడు మన తెలుగువాడు నోరి “
వైద్యో నారాయణో హరిః అన్న మన భారతీయ ఆర్యోక్తికి నిలవెత్తు నిదర్శనం డాక్టర్ నోరి దత్తాత్రేయ గారు. మన ప్రాచీన వైద్యవిద్యకు ధన్వంతరి మూలపురుషుడైతే, మెుట్టమెుదటి శస్త్రచికిత్సను చేసిన వైద్యుడు శుశ్రుతుడు. ఆ శుశ్రుతనికి ఏమాత్రం తీసిపోని విధంగా కాన్సర్ గురించి ప్రపంచమంతా భయపడే తరుణంలో తనదైన వైద్యంతో ప్రపంచ వ్యాప్తంగా ఎందరికో ప్రాణదానం చేసిన దేవుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారు.
దత్తాత్రేయ గారిది కృష్ణాజిల్లా లోని తోట్లవల్లూరు. పుట్టింది మంటాడలో. సత్యనారాయణ, కనకదుర్గమ్మ గార్ల ఆఖరి సంతానం. తండ్రి ఉపాధ్యాయుడు. దత్తాత్రేయ గారి వయసు నాలుగు సంత్సరాలప్పుడు తండ్రి కురుమద్దాలి శ్రీరామ అవధూత పిచ్చెమ్మ ఆశ్రమంలో ప్రవచనాలు చెప్తూ, ప్రమాదవశాత్తు మరణించారు. తనకున్న కొద్దిపాటి పొలాన్ని ఆశ్రమానికే ఇచ్చేసారు.ప్రవచనాలు చెబితే వచ్చే డబ్బు కూడా ఆయన ఆశ్రమానికే ఇచ్చేవారు. ఆయన మరణానంతరం పిల్లల ఉన్నతి కోసం ఆ తల్లి పడని కష్టం లేదు. దత్తాత్రేయ గారి పరీక్ష ఫీజు కట్టడానికి తల్లి గాజులు అమ్మి ఫీజు డబ్బులు ఇచ్చారు.
దత్తాత్రేయ గారు ఉస్మానియాలో అంకాలజీలో పరిశోధనా విద్యార్థిగా ఉన్నప్పుడు, ఓ అంతర్జాతీయ సదస్సుకు అమెరికా నుండి వచ్చిన వైద్యబృందానికి సహాయకుడిగా నియమించారు. ఆ సమయంలో వీరిలోని కొత్త విషయాలు తెలుసుకోవాలన్న జిజ్ఞాసను కనిపెట్టి ఓ పెద్దాయన తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి అమెరికా వచ్చినప్పుడు కలవమన్నారట. చదువు పూర్తయిన తర్వాత ఇండియా , అమెరికాలలో చాలా ఉద్యోగ ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. చివరిగా తనకు విజిట్ంగ్ కార్డ్ ఇచ్చినాయనను వెదుక్కుంటూ స్లోన్ కెటరింగ్ మెమోరియల్ కేన్సర్ సెంటర్ కి వెళితే, అక్కడ కూడా ఫెలోషిప్ ఎంపికలు అయిపోయాయని, ఎవరైనా రాకపోతే సీట్ ఇస్తామన్నారట. మంచి మనసుకు దైవం సహకరిస్తుందనడానికి నిదర్శనంగా వీరికి సీట్ లభించడమే కాకుండా, అంచెలంచెలుగా ఎదిగి తనకు విజిటింగ్ కార్డ్ ఇచ్చిన పెద్దాయన చైర్మన్ పదవినే చేపట్టారు.
ప్రపంచం గుర్తుంచుకునే శాస్త్రవేత్తగా కాన్సర్ వైద్యంలో రోగికి సురక్షితమైన రేడియేషన్ యంత్రాన్ని కనిపెట్టారు. ఈనాడు ప్రపంచమంతటా కాన్సర్ రేడియేషన్ లో ఈ పరికరాన్నే వాడుతున్నారు. కాన్సర్ కి కారణాలను కనుగొనడానికి, అరికట్టడానికి ఎన్నో పరిశోధనలు చేసి ఎందరికో ప్రాణదానం చేసారు. వీరి వైద్యసేవలు ప్రపంచమంతటా విస్తరించాయి. ఎందరో సినీ,రాజకీయ ప్రముఖులకు వీరు తన వైద్య సేవలను అందించారు. లెక్కకు మించిన ధనం సంపాదించడం తన చేతిలోని పనే అయినా, ప్రముఖులు ఇవ్వబోయిన ధనాన్ని సైతం సున్నితంగా తిరస్కరించారు. బసవతారకరామారావు మెమోరియల్ కాన్సర్ ఫౌండేషన్ పాలకవర్గంతో కలిసి పనిచేసారు. అన్నింటికన్నా ముఖ్యమైనది తనింతటివాడు కావడానికి కారణమైన స్లోన్ కెటరింగ్ మెమోరియల్ వ్యవస్థాపకుడికి చర్మ కాన్సర్ వస్తే, తన వైద్యంతో ఆయనను బ్రతికించి ఓ వైద్యునిగా గెలిచారు.
ఇన్నేళ్ళ కేన్సర్ పరిశోధనలకు, వైద్యసేవలకు దక్కాల్సిన అన్ని పురస్కారాలు ఆయనను వరించాయి. పేదరికం ఉన్నత ఆశయానికి అడ్డంకి కాదని డాక్టర్ నోరి దత్తాత్రేయ గారి జీవితం నిరూపిస్తోంది. అత్యున్నత వ్యక్తిత్వం, సేవానిరతి మెండుగా గల వీరి జీవితం యువతకు స్పూర్తిదాయకం. వీరి ఆత్మకథ “ ఒదిగిన కాలం “ లో ఎన్నో విషయాలను పొందుపరిచారు. “ కదిలే కేన్సర్ ఆసుపత్రి “ని నిర్మించి వైద్యసేవలు అందించాలన్న సదాశయం, కేన్సర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అన్న పుస్తకంలో అనేక విషయాలను తెలుగువాళ్ళతో పంచుకోవాలని పుస్తకం రాయడానికి పూనుకున్నారు. వీరి భార్యాకూతురు కూడా డాక్టర్‌లే. కొడుకు లాయర్.
వైద్య శాస్త్రవేత్తగా అమెరికా నుండి స్వదేశానికి తిరిగి వస్తూ అమ్మకు తన మెుదటి జీతంతో బంగారు గాజులు కొని తెచ్చారట. మన తెలుగువాడి ఘనతను యావత్ ప్రపంచమే కీర్తిస్తోంది ఈనాడు. ప్రపంచాన్ని నడిపే కనబడని శక్తిని దైవమని నమ్మే వ్యక్తి, నిలువెత్తు మానవతామూర్తి, శిరిడిసాయి భక్తుడు అయిన డాక్టర్ నోరి దత్తాత్రేయ గారిని కృష్ణా డిస్ట్రిట్ లారి ఓనర్స్ ఫౌండేషన్ తరపున ఈ చిరు సత్కారం చేయడం శ్రీకృష్ణడికి అటుకులిచ్చిన కుచేలుడిలా భావిస్తూ నిండు నూరేళ్ళు సుఖసంతోషాలతో జీవించావని కోరుకుంటూ ఈ సదవకాశానికి మనఃపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.


0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి