నేస్తం,
రెప్పపాటు ఈ జీవితానికి ఇంత కాపీనం ఎందుకో? రేపో మాపో పోయే వయసులో కూడా “జీవకారుణ్యం” లేకపోతే పోనీ..కనీసం కుక్క కున్న విశ్వాసంలో 1% అయినా మనిషి బతుకుతున్న మనిషికి వుండాలి కదా! మన చుట్టూ వున్న, మనది కానిది కూడా మనం ఆక్రమించుకున్న పరిసరాలు శుభ్రంగా వుంచుకోవడంలో తప్పేం లేదు, కాని మన మనసు ఎంత పరిశుభ్రంగా, స్వచ్ఛంగా వుందో! లేదో! అన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా!
నగరాల్లో వుంటూ గొప్ప నాగరీకులమని మనమనుకుంటే సరిపోదు. పొద్దుపొద్దున్నే నాలుగు కిలోమీటర్లు వాకింగ్లు, సైకిలింగ్లు చేసేస్తూ..పనిలో పనిగా అప్పుడప్పుడూ గుళ్ళు గోపురాలు దర్శించేస్తే మన పనైపోదు. మనమెత్తిన మానవజన్మకు కాస్తయినా మానవత్వపు సువాసనలు, భూతదయ వుంటే మన జన్మకు సార్థకత లభించినట్లే. చల్లగాలికి, పిల్లగాలికి కుర్చీలు వేసుకుని నలుగురు కూర్చుని ప్రపంచ రాజకీయాలు మాట్లాడటం కాదు చేయాల్సింది. మనిషితనాన్ని మర్చిపోకుండా బతకడం అసలైన గొప్పదనం.
రామాయణ, మహా భారతాలు చదవడం వలన పుణ్యం, పురుషార్థం రాదు. వచనాలు వినడం, చెప్పడం కాదు వాచకం, ఆచరణా కూడా మనలో వుండాలి. వాటిలోని మంచి చెడులు గ్రహించి మన జీవితంలో ఆచరిస్తే ఏమైనా ఉపయోగం. ఈమధ్య కాలంలో కొత్తగా మెుదలైన ట్రెండ్ కాశీ రామేశ్వరాలు, అరుణాచలాలు, అంగ ప్రదక్షిణలు చేసేసి బోలెడు పుణ్యాన్ని మూటగట్టేసుకుందామంటే సరిపోతుందా! ఆకలితో వున్న జీవికి నాలుగు మెతుకులు పెట్టడానికి మన చేతులు సహకరించవు, పైగా ఎవరైనా పెడుతున్నా చూసి సహించలేని బతుకులు మనవి. మనమూ చేయము, ఎదుటివారినీ చేయనీయము ఇది మన నైజం. ఇదే మన నడవడి.
ఆధునిక నాగరికత ఇప్పటి తరాలదైతే, అనుబంధాల తరాలు అప్పటివైనా ఇప్పటికీ మనమే అనాగరికులుగా మిగిలిపోతున్నాం. మిగతావన్నీ పక్కనబెట్టినా కనీసం ఇసుమంత జాలి, దయ లేని బతుకులైపోయాయి ఈనాటి అంతస్తుల సంప్రదాయాలు. ఎంగిలి చేతితో కాకిని విదిలించలేము కానీ చాగంటి, గరికపాటి వగైరా వాళ్ల ప్రవచనాలు మాత్రం బీరుబోకుండా టైమ్ టు టైమ్ వినేస్తాము. సూక్తిసుధలు వల్లెవేస్తూ, ఫేస్ బుక్, ఇన్స్టా, వాట్సప్ లలో ప్రచారాలు చేసేస్తే మన పనైపోయినట్లు కాదు.
బాధ్యతా రాహిత్యాన్ని ఇప్పటి తరాలకు దూరం చేస్తూ, మనమూ మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ నలుగురికి ఆదర్శవంతంగా కాకపోయినా మనవరకు మనం సంతృప్తిగా బతికితే అదే గొప్ప విషయం..!!


0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి