26, జులై 2026, ఆదివారం

పాట


 

21, జులై 2026, మంగళవారం

ధన్యవాదాలు

 నా గురించి మంత్రి ప్రగడ మార్కండేయులు గారు రాసిన పాటకు బిక్కి కృష్ణ గారి ఆత్మీయ స్పందనకు మనఃపూర్వక ధన్యవాదాలు..


మీ పాటలు చాలా బాగున్నాయి సార్.. ముఖ్యంగా యనమదలమంజుగారిపై రాసిన పాట.. పదాల పోహళింపు.. మీ అద్భుత గేయరచనా సంవిధానానికి... లోతైన మంజుగారి వ్యక్తిత్వ అభివ్యక్తికి నిదర్శనంగా నిలుస్తుంది. వ్యక్తిగతంగా ఆమె నాకు బాగా తెలుసు. మంచి కవయిత్రి. వ్యాసకర్త. స్నేహశీలి. కల్మషం ఎరుగని విదుషీమణి. కపటం తెలియని సృజనశీలి.నా కవితా సంపుటిపై ఆమె గతంలో ఒక గొప్ప విశ్లేషణా వ్యాసం కూడా రాసారు. ఆమె మనోధైర్యం, సున్నితత్వం, ముక్కుసూటిదనం, ప్రేమతత్వం, భాషా, కవిత్వ, విశ్లేషణా.. పటుత్వాలను.. అద్భుతమైన పదబంధాలతో.. మంచి సంగీత సాహిత్య కల్పనా చతుర వచనాలతో .. గేయాన్ని శిల్పీకరించారు. ఆమె జీవితం ధన్యం. ఇంతకన్నా గొప్పగా మంజుగారి గొప్పతనం, ఔన్నత్యం, రచనాదృక్పథం, భావుకత్వం, నిర్మలమైన వ్యక్తిత్వంపై... ఏ గొప్ప గేయ రచయితా... ఇంతలా కదిలించేలా రాయలేరు. ప్రోత్సాహం, ఉత్సాహం, సంతోషం అందించలేరు. మాకు చాలా ఆత్మీయులైన మంజుగారిపై గొప్ప పాట రాసిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రతి అక్షరం,ప్రతిపదం, గేయపాదం.. మంజుగారి వ్యక్తిత్వపరిమళ విలసితం.ఆమె భావుకతా తటిల్లతల మెరుపుల విభ్రాజితం.. మధుర భావాలరసాప్లావితం. రసౌచిత్యం.. అభినందనలు.


18, జులై 2026, శనివారం

జీవన మంజూష 07/26

 నేస్తం,

          ఏ బంధమయినా దృఢంగా వుండాలంటే, ఈ రోజుల్లో ముఖ్యంగా కావాల్సింది నమ్మకం కాదు. మనిషి తన జీవితంలో కోల్పోయింది, కోల్పోతున్నది ఈ నమ్మకాన్నే. అమ్మతనాన్ని కూడా అమ్మకానికి పెడుతున్న రోజులు కదా! అందుకే ఏ తనాన్నయినా అమ్మడానికి సిద్ధంగా వున్నారు ఈనాటి మనుష్యులు. అలాగే అమ్మేవారుంటే కొనేవారికేం కొదవ అన్నట్టుంది మన సమాజం కూడా. సమాజమేముంది ప్రపంచమే అలా మారిపోయింది. మనిషి ఆలోచనలు వింత పోకడలు పోతుంటే దానికి తగినట్లుగానే మనిషి మేధావితనమూ సహకరిస్తోంది. కాని మనిషిగా మనమేం కోల్పోతున్నామో మనకే తెలియనంతగా ఆధునికీకరణ మాయలో పడిపోయాం. 

           మనం సంతోషాన్ని పంచుకోవడానికి మన తాహత్తుకు తగ్గ వారిని అతిథులుగా ఆహ్వానించడం మన సంస్కారంగా చూపించుకుంటున్నాము. అయినవారు, ఆత్మీయులు మనకు, మన హోదాకు తగ్గవారే అవుతున్నారు ఆ సమయంలో. అదే మనకు ఆపదో, కష్టమో వచ్చినప్పుడు ఈ తాహత్తు గుర్తురాదు. ఎందుకంటే ఆ సంస్కారులు ముఖం చాటేస్తారు కనుక. ఆ సమయంలో మనకు మనలో మరుగున పడిపోయిన ఎక్కడెక్కడి చుట్టరికాలు, రక్త సంబంధాలు భలే గుర్తొస్తాయంటే నమ్మండి. దూరాన్ని మనమే పెంచి పోషించి ఇలాంటి అవసర సమయాల్లో దగ్గరతనం దగ్గరగా రావాలని కోరుకోవడం సమంజసం కాదు కదా. మనం ఇచ్చిందే మనకి తిరిగి వస్తుంది. ఈ విషయం అందరం గుర్తు పెట్టుకోవాలి.

            మనలో చాలామందిలో ఈర్ష్య, అసూయలు ఎంత బలంగా నాటుపోయాయో చూస్తుంటే నిజంగా మనం మానవ సంబంధాల గురించి గొప్పగా చెప్పుకునే సమాజంలోనే బ్రతుకుతున్నామా అని ఒకింత అయోమయంలో వున్నట్టుగా అనిపిస్తోంది. మన గొప్పలు చెప్పుకోవడానికి ఇతరులను హీనం చేసి చూపనక్కర్లేదు కదా! అది మనకు మంచి చేస్తుంది అనుకుంటే అంతకన్నా పొరపాటు మరొకటి వుండదు. ఏదోక గొప్పదనం అందరిలో వుంటుంది. గుర్తించే గొప్ప మనసు మాత్రం కొందరికే వుంటుంది. ఆ కొందరిలో మనమున్నామా లేదా అన్నది మన మనసుకు తెలియాలి.

              కీర్తిశేషులయ్యాక కీర్తించడం మనకు పరిపాటి అయిపోయింది. ఈ మాట అందరికీ వర్తించదు. కొందరికి మాత్రమే. “పోయినోళ్ళందరు మంచోళ్ళూ కాదు, అలా అని బతికున్నోళ్ళందరూ పాపులు కాదు”. మనిషి చనిపోయాక కాని మనకు ఆ మనిషి గొప్పదనం తెలియకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఒక వ్యక్తి చేసిన విలువైన పనులకు ఆ వ్యక్తి సేవలను గుర్తించి వారు జీవించి వున్నప్పుడే వారికి తగిన గుర్తింపు ఇస్తే, అది మనం వారికి ఇచ్చే గౌరవం అవుతుంది. ముందు మనల్ని మనం సంస్కరించుకుంటే తర్వాత ఇతరుల సంస్కారం గురించి మాటలు, రాతలు వంటివి చేయవచ్చు. 

             

               నూరు పుస్తకాల “నవ మల్లెతీగ”తో నా అనుబంధం కూడా దాదాపుగా “నూరు పుస్తకాల నవ మల్లెతీగ పదిహేను పుస్తకాల నా అక్షర ప్రయాణం” వెరసి లెక్కకు మూడు శీర్షికలకు తక్కువగా. నూరు “జీవన మంజూష” లతో నా పయనం నవ మల్లెతీగతో కొనసాగుతోంది. నెల నెలా నవ మల్లెతీగ నిత్య నూతనంగా రూపుదిద్దుకోవడానికి నిరంతరం శ్రమిస్తూ, అవసరమైతే పుస్తకం కోసం “దొంగని” కూడా అవుతానన్న “కలిమిశ్రీ” గారి సాహితీ తపస్సుకు ఏ విఘ్నాలు కలగకుండా “నవ మల్లెతీగ” సాహితీ మిత్రుల చేతుల్లో కలకాలం కళకళలాడాలని కోరుకుంటూ..నూరవ పత్రికకు హృదయపూర్వక శుభాకాంక్షలు.



              

            


             

             


16, జులై 2026, గురువారం

ఓ చిన్నమాట..!!

        నాకు గుర్తున్నంత వరకు ఈటివి “పాడుతా తీయగా” గత ఐదారు సిరీస్ ల నుండి సెమీ ఫైనల్ కి రాకుండా ఎలిమినేట్ అయ్యేవారికి ఈ ఎపిసోడ్ లో ఎలిమినేషన్ లేదు. నెక్స్ట్ ఎపిసోడ్ లో నలుగురు ఎలిమినేట్ అవుతారు అంటూ మరో ఛాన్స్ ఇస్తూ..ఎలిమినేట్ అయ్యేవారికే సిరీస్ ఛాంపియన్ రావడం ఎవరైనా గమనించారా..!!

13, జులై 2026, సోమవారం

రెక్కలు

 1. దీర్ఘదృష్టి

బావుంది 

హ్రస్వదృష్టే

అనడం లేదు


దూరానిదెప్పుడూ

దగ్గరతనమే..!!

2.  కట్టె

కాలాలి

కట్టెలు 

కావాలి


కాపీనం

కాయానికి..!!

3.  తరుగు

బంగారానికే కాదు

బంధాలకు

పాకింది


విలువల

తూకమే..!!

4.   Attachment

Detachment 

Heart and

Soul 


Unconditional 

Love..!!

5.  విసుక్కోవడం

పరిపాటి 

వీడిపోవడం

స్వయంకృతం


సంయమనం

సరైనది..!!

6.  కొన్ని 

పరిచయాలు

ఆత్మీయ

అనుబంధాలు


దూరాల

కొలమానం అక్కర్లేదు..!!


7.  నమ్మకం

బలమైనది

నిజాయితీ 

విలువైనది


కోల్పోతోంది

మనిషితనం..!!

8.  తింటే

తిన్నామంటారు

తినకపోతే

తినలేదంటారు


రెండు నాల్కల

ధోరణి..!!

9.  బుద్ధుడిది

బోధివృక్షం

రుద్రుడిది

రుద్రభూమి 


సిద్ధాంతం 

ఎవరిది వారిదే..!!

9.  మాట 

పొదుపు

నోరు

అదుపు


క్రమశిక్షణా

రాహిత్యం..!!

10.  చెప్పే స్థాయి

కొందరిది

చెప్పించుకునే స్థితి

మరికొందరిది


మనిషికి

కాలానికి సంఘర్షణ..!!

11.  గుర్తింపు 

కావాలి

ఆధిపత్యపు

చరిత్ర


లిఖించేయడమే

తరువాయి..!!

12.  రాతల్లో

బ్రహ్మరథాలు

వడ్డించేది

మనవాడే 


పుస్తకానికో

పురస్కారం..!!

13.  ఆరుపదుల ప్రేమ

ఉప్పొంగి పోతోంది

తినడమే తెలిసిన

బతుకులు కొన్ని


ఒక్క దీపమైనా

ఎరుగని స్మృతి శకలాలు..!!

14.  చాతకానప్పుడు

ఊరుకోవాలి

నెపం 

వేయకూడదు


అన్నీ బావుంటే 

మన ప్రతిభే..!!

15.  అతుకులూడిన

అనుబంధాలు

మెతుకుల లెక్కల

బతుకులు


కొడిగట్టిన

దీపం..!!

16.  అన్నీ

శేషాలే

అవశేషాల

లెక్కలు తేలక


జీవితం

యంత్రాల యాంత్రికతలో..!!

17.  ఆశ

అధఃపాతాళం

కోరిక

కొసమెరుపు


ఏ రాతలో

ఏముందో..!!

18.  గాలి

ఎవరో

ఘనాపాటి

ఎవరో


మనస్సాక్షికి

తెలుసు..!!

19.  కత్తిరింపులు

తెలియకూడదు

పలకరింపులు

సున్నితంగా వుండాలి 


వాటంలో

నేర్పు..!!

20.  కొత్తగా తెలియాల్సినది 

ఏముంది?

పరిచయం

పాతదే కదా!


ఋణానుబంధం

ఎప్పటిదో..!!

21.  కోరికల

ప్రవాహం

ఆలోచనలకు

అడ్డేముంది


మది

పున్నమి సంద్రం..!!

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner