నేస్తం,
వాస్తవాలను అంగీకరించాలంటే ఎంతో కొంత ధైర్యాన్ని కూడగట్టుకోవాలి. మనకు నచ్చలేదని చేదునిజాలన్నీ తీపి తాయిలాలు కావు కదా. కాలం మనకు నేర్పే పాఠాల్లో కొన్ని బతుకులు నేర్చుకోవడంలోనే ముగిసిపోతాయి. చాలా తక్కువమంది మాత్రమే అడ్డంకులను అధిగమించి గమ్యాన్ని చేరుకుని విజయకేతనాన్ని ఎగురవేస్తారు. చరిత్ర విజయాలను మాత్రమే గుర్తుంచుకుంటుంది. నువ్వు వందలసార్లు ఓడిపోయినా ఒక్క విజయం నిన్ను నలుగురికి పరిచయం చేస్తుంది. ఓటమి మన జీవితానికి ముగింపు కాదు. మనం అందుకోబోయే విజయానికి తొలిమెట్టు.
మన జీవితమే సమస్యల చెట్టు. పచ్చని కొమ్మలతో కళకళలాడుతూ, క్షణంలోనే ఏం జరుగుతుందో తెలిసే లోపల ఎండిపోయి, మోడువారిన మహావృక్షాలెన్నో మనకు తారసపడుతూనే వుంటాయి. చెట్టు మోడుబారినా ఆ కట్టెలు కూడా దేనికోదానికి పనికొస్తాయి. మానవ శరీరం కూడా మనకు తెలియకుండానే దేనికోదానికి పనికొస్తుంది. అవయువదానం మరికొందరికి జీవితాలను ఇస్తుంది. దేహదానం మనకు తెలియని ఎన్నో రోగాలకు వైద్యుల ప్రయోగాలకు పనికివస్తుంది. ఎందరో మానవతావాదులు ఈనాడు శరీరదానానికి సుముఖంగా వున్నారు, చేస్తున్నారు, చేసారు కూడా.
మనకు కష్టం వచ్చిందని క్రుంగిపోతే జీవితం అక్కడితో ఐపోతుంది. ఆ కష్టం గురించి ఇతరులకు అవగాహన కల్పిస్తే జీవితానికి అంతకన్నా సార్థకత ఏముంటుంది? తప్పులు చేయడం మానవ సహజం. ఆ తప్పుల నుండి మనం నేర్చుకునే మంచి మనకు సరైన మార్గాన్ని చూపిస్తుంది. అది తెలుసుకోవడంలోనే విజ్ఞత, వివేకం బయటబడతాయి. అంతేకానీ ఆ కష్టానికి ఇతరులను బాధ్యులుగా చేసి నిందించడం వలన ప్రయోజనం ఏమి వుండదు. బాధను గెలవడం నిజమైన గెలుపు అని ఎందరికి తెలుసు?
ఒంటరితనం మనకు అమ్మ కడుపులో ప్రాణం పోసుకున్నప్పటి నుండే అలవాటు కదా. మన ప్రయాణం ఎప్పుడూ ఒంటరిదే. మనతో మనకు బంధమే అసలైన సంబంధం. మనతో మనం నిజాయితీగా వున్నామా లేదా అన్నది ప్రశ్న కాకుండా, సమాధానం చెప్పుకోగలిగే స్థాయిలో మనమున్నప్పుడు మనం మరొకరికి సలహాలు, సూచనలు ఇవ్వడం సమంజసం. ఓ చిన్న మాట జీవితాలను నిలబెడుతుంది. అదే చిన్న మాట జీవితాలను కాలరాస్తుంది. ఎదుటివారి స్థాయిని బట్టి కాకుండా మనిషితనానికి విలువనిచ్చిన రోజు మనమూ నిజమైన మనుష్యులుగా నిలబడగలుగుతాం. ఏదేమైనా కాలం అన్నింటికి, అందరికి సమాధానం నేర్పుగా, ఓర్పుగా చెబుతుంది. వేచి చూడటమే మనం చేయాల్సిన పని..!!


0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి