6, మార్చి 2019, బుధవారం

"దివిసీమ కవులు - సాహిత్య సేవ"....!!

                  "తెలుగు సాహితీ సేవకుల, పోషకుల నిలయం ఈ దివ్యసీమ దివిసీమ "

    ఎన్నో రకాల పరిశోధనాత్మక గ్రంథాలు వచ్చిన, వస్తున్న నేపథ్యంలో తెలుగు సాహిత్యంలో సాహిత్యపు సేవల గురించి శోధించిన విషయాలను పలువురు పుస్తకాల రూపాల్లో పొందుపరిచారు. తమ పురిటి గడ్డ గురించి, ఆ ప్రాంతానికి సంబంధించిన సాహిత్యకారులు గురించి చరిత్రలో కనుమరుగు కాకుండా తరువాతి తరాలకు అందించాలన్న సదుద్దేశ్యంతో స్వతహాగా పద్య కవి, బాల సాహిత్యంపై మక్కువ గల డాక్టర్ గుడిసేవ విష్ణుప్రసాద్ రచించిన పరిశోధనాత్మక రచన "దివిసీమ కవులు - సాహిత్య సేవ".
        19 భాగాలను మూడు అధ్యాయాలుగా విభజించిన " దివిసీమ కవులు - సాహిత్య నేవ " పుస్తకంలో మొదటగా దివిసీమ భౌగోళిక స్వరూపాన్ని హద్దులు, ఎల్లలతో కళ్ళకు కట్టినట్టుగా తన రచనలో చూపించారు. కృష్ణా జిల్లాకి తన పేరునిచ్చిన కృష్ణమ్మ రెండు పాయలుగా చీలి, సస్యశ్యామలం చేసిన సుసంపన్న భూమి దివిసీమ. సముద్రానికి చేరువగా ఉన్నా, ఆంధ్ర ప్రదేశ్ లో ఒక మూలన ఉన్నా,ఎంతో దివ్య వైభవమైన దివ్య భూమి ఈ దివిసీమ. వైశాల్యంలో చాలా చిన్నదైనప్పటికీ యావద్భారత దేశాన్ని అన్ని రంగాల్లో ప్రభావితం చేసి తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంది దివిసీమ. తెలుగుభాషా వికాసానికి, సాహిత్య వైభవానికి, అనేక జాతీయ, అంతర్జాతీయ ఉద్యమాలకు కేంద్ర బిందువై, సంగీత, సాహిత్యకారులతోను, కవి,గాయక, నటులతోను, పత్రికా సంపాదకులతోను, రచయితలు,శాస్త్రవేత్తలతోను, సినీపరిశ్రమతోను(నటులు, గాయకులు, దర్శకులు... ), స్వాతంత్ర్య సమర యోధులతోను, అడుగడుగునా దేవాలయాలతోను, పద్మ అవార్డులతోను పులకరించిన నేల ఈ దివిసీమ. శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద కావ్యానికి శ్రీకారం చుట్టిన ఆంధ్ర మహావిష్ణువు అని ప్రాంతాన్నే పేరుగా నెలకొన్న ఏకైక దేవస్థానం గల పరమ పవిత్ర స్థలం శ్రీకాకుళమీ దివిసీమలోనిదే. ఇలా చెప్పుకుంటూపోతే దివిసీమలోని ప్రతి ప్రాంతానికి ఒక చరిత ఉంది. ప్రతి ప్రాంతాన్ని, దేవాలయాలను, జమిందారీ సంస్థానాలను, ఆహారపుటలవాట్లను, కట్టుబొట్టులను, ఆచార వ్యవహారాలను, పాడి పంటలను, రవాణా సౌకర్యాలను,సాహితీ సాంస్కృతిక సంస్థలవివరాలను చాలా విపులంగా విశదీకరించారు డాక్టర్ గుడిసేవ విష్ణప్రసాద్.
                    రెండవ అధ్యాయంలో " దివిసీమ కవుల - రచయితల పరిచయం " మొదలుబెట్టి ఆది నుండి ఉన్న తెలుగు సాహిత్యపు ప్రక్రియలలో దివిసీమలోనున్న కవులను, పండితులను పరిచయం చేస్తూ సంస్కృత, తెలుగు కవుల పుట్టు పూర్వోత్తరాలగురించి క్లుప్తంగా వివరించారు. దివిసీమలో సంస్కృత కవుల వివరాలు, అవధానులు, పత్రికాధిపతులు, సంపాదకులు, ఆధ్యాత్మిక కవులు, పరిశోధకులు, జంటకవులు, యక్షగాన కవులు, తెలుగు కవులు, రచయితల పరిచయాలను వారి రచనలను అందించారు. నాట్యగ్రంథాలలో సంస్కృతంలో తెలుగువారు రచించిన మొదటి గ్రంథం "నృత్త రత్నావళి". 1200 దశకంలో దివిసీమలోని తలగడదీవిలో జన్మించిన జాయపసేనాని రచించినదే. తొలి సంస్కృత గ్రంథం శ్రీకృష్ణ కర్ణామృతం లీలాశుకుడు శ్రీకాకుళం నివాసి. తొలి తెలుగు ద్వ్యర్ధి కావ్యం రాఘవ పాండవీయం రాసిన పింగళి సూరన్న శ్రీకృష్ణ దేవరాయల భువన విజయంలోని అష్ట దిగ్గజ కవులలోనొకరు పుట్టిన చిట్టూర్పు ఈ పుణ్యభూమిలోనే.  మాదయగారి మల్లన, తెనాలి రామకృష్ణుడు పుట్టిన అయ్యంకి, గార్లపాడు దివిసీమలోనివే. అపూర్వ శృగారకృతి రాధికా సాంత్వనం రాసిన తొలి కవయిత్రి ముద్దుపళని శ్రీకాకుళం నివాసి. ఇలా చెప్పుకుంటూపోతే చరిత్రకు తెలియని ఎందరో మహానుభావులను వెలికితీసి తన పరిశోధనా గ్రంథంలో పొందుపరచి దివిసీమ సాహితీ వైభవాన్ని ప్రపంచానికందించిన గుడిసేవ విష్ణుప్రసాద్ ధన్యులు.
                    మూడవ అధ్యాయంలో దివిసీమ కవులు - సాహిత్య పరిశీలనలో దివిసీమ వాగ్గేయకారులు, పదకర్తలు, శతక కవులు, తెలుగు కవుల కావ్యాలు, రచయితల గురించి, చివరిలో తనకు తెలిసిన మరికొందరు  రచయితల గురించి చెప్తూ ముగింపుని ఎంత అందంగా తీర్చిదిద్దారంటే మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. డాక్టర్ గుడిసేవ విష్ణుప్రసాద్ దివిసీమ తెలుగు సాహితీ వైభవానికి చేసిన సాహితీ సేవ ఎనలేనిది. ప్రతి చిన్న ఆధారాన్ని సేకరించి భవిష్యత్తరాలకు అందించిన అమూల్య సాహితీ సంపద " దివిసీమ కవులు - సాహిత్య సేవ " .  తొలి తెలుగు మహాసభలు నిర్వహించి, తెలుగు భాషాభివృద్ధికి ఎనలేని సేవ చేసిన ప్రఖ్యాత రాజకీయ నాయకులు కీర్తిశేషులు శ్రీ మండలి వెంకట కృష్ణారావు, వారి కుమారుడు ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభ ఉపసభాపతి డాక్టర్ మండలి బుద్ధప్రసాద్, మరెందరో నాయకులకు జన్మనిచ్చిన ఈ దివిసీమ బిడ్డలమే మేము అయినందుకు గర్వంగా ఉంది. ఒకప్పుడు కక్షలకు, కార్పణ్యాలకు నెలవైన దివిసీమ పుట్టు పూర్వోత్తరాలను, సాహితీ వైభవాలను, కళాకారులను వెలిసితీసి చరిత్రలో నిక్షిప్తం చేసి నేడు చదువుల సీమగా, సకల కళల నిలయంగా పండితపురంగా తన రాత ప్రతితో విశిష్ట స్థానాన్ని అందించిన డాక్టర్ గుడిసేవ విష్ణుప్రసాద్ మాస్టారికి మనఃపూర్వక అభినందనలు.


0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner