15, మార్చి 2019, శుక్రవారం

జీవన "మంజూ"ష (ఫిబ్రవరి )...!!

నేస్తం,

          మనిషి మనుగడకు జీవనాధారం భాష. ఆ భాషకు మూలం అక్షరం. ఆది యుగానికి ముందే లిపి ఉన్నదని భాషా మూలాలు చెప్తున్నాయి. మాతృభాష మీద మమకారం నానాటికి తగ్గుతూ, అవసరాలకు తగ్గట్టుగా భాషలను మనకు ఆపాదించేసుకుంటున్న రోజులు ఇవి. పుస్తకాలను చదవడం నామోషీగా అనుకుంటూ, రాతలను, రాసే వారిని చిన్నచూపు చూస్తున్న నేటి అభ్యుదయవాదులు ఎందరో. తమ రాతలను ఓ పుస్తకంగా అచ్చులో చూసుకోవాలన్న కోరిక అందరికి ఉండటం సహజమే అయినా రాయడానికి ఎన్ని వ్యయ ప్రయాసలు రచయిత అనుభవిస్తాడో, ఆ రాతలు పుస్తకంగా రూపు దిద్దుకోవడానికి అంతకన్నా ఎక్కువగా ఇబ్బందులకు లోనుకావడం చాలా బాధాకరం. పుస్తకం చేతికి వచ్చాక దానిని ఆవిష్కరించడానికి ఓ పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తోంది ఈనాడు. పుస్తకం ఖర్చు కన్నా కూడా ఆవిష్కరణ ఖర్చు మోయలేని భారమౌతోంది. పీఠాధిపతులను మించి సాహితీ పెద్దలు కొందరు ఉంటున్నారు. వక్తలను వేదికపైకి ఆహ్వానించడంతో మొదలు, ఆహ్వాన పత్రికలో పేర్లు వేయడం దగ్గర నుంచి ప్రతి దానికి లెక్కలు వేసే సాహితీ పెద్దలు ఉపన్యాసాలు మాత్రం ఎడతెరిపిలేకుండా చెప్తారు కాని, కనీసం ఒకింత నీతిగా చెప్పే నాలుగు మాటల్లో ఒకటయినా పాటించి ఇతరులకు చెప్పాలనుకోరు. ఒకరేమో నా పేరు ముందు ఉండాలంటూ తమ బిరుదుల ప్రత్యేకత చాటి చెప్పాలనుకుంటే, మరొకరేమో నా  పేరు ముందు గౌరవం పెట్టలేదు వేరే వారికి పెట్టారంటారు. మనకి ఇష్టమైన వారిని పిలవడానికి కూడా మనకు అధికారం ఉండదు. బయట అందరు ఆత్మీయులే కానీ ఒకరిని చూసి ఒకరు ఓర్వలేనితనమే ఇక్కడ కూడా. ప్రతిసారి తామే ఉండాలన్న అహం ఎక్కువ. పోనీ పిలిచామే అనుకోండి వచ్చి నాలుగు పొగడ్తలు పొగిడేసి తరువాత కనీసం వారిని సాధారణ రచయితలుగా కూడా గుర్తించరు సదరు పెద్ద మనుష్యులు. అందరు వీరిని మాత్రం పెద్ద పీట వేసి గౌరవించాలని తాపత్రయ పడిపోతుంటారు. మరి కొందరేమో పుస్తకాలకే విలువ లేదు, వాటి ఆవిష్కరణలకు వస్తే సమయం వృధా తప్ప మాకేంటి లాభం అంటారు. మరో హాస్యాస్పద విషమేమిటంటే ఇలా అన్న పెద్దలకే పుస్తక ప్రదర్శన నిర్వహణలు ప్రభుత్వం అప్పగించడం. పదవులు కట్టబెట్టడం. సాహితీ పిపాసకులు సభలు, సమావేశాలు నిర్వహిస్తారు కాని వచ్చిన వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేయడం, అటు ప్రభుత్వం నుండి నిధులు రాబట్టుకోవడం వంటి సాహితీ కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వ పురస్కారాలకు అర్హులౌతున్నారు. తెలంగాణ, ఆంధ్రాలలో ఎక్కడ చూసినా ఆ నలుగురే ఉంటారు ఏ సాహితీ కార్యక్రమాలకైనా, పురస్కారాలకైనా. ఈ సాహితీ కృత్యాల గురించి ఇలా చెప్పుకుంటూ పొతే చాట భారతమే అవుతుంది. 
మంచి సాహిత్యం బతకాలంటే భజన సాహిత్యం నశించి భాషా సాహిత్యానికి, అసలైన ప్రతిభకు కాస్త చేయూత ప్రభుత్వ, సాహితీ సంస్థల తోడ్పాటు ఎంతో అవసరం ఇప్పటి రోజుల్లో. నాలుగు మంచి పుస్తకాలు వస్తే నాలుగు కాలాలు భాష బతుకుతుంది. 
ఇప్పటికి ఈ ముచ్చట్లకుసశేషం.... 

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner