నేస్తం,
ముందుగా విశాల హృదయులందరికి నా నమస్కారాలు. మీ ఉన్నతమైన భావాలకు మాకు నోట మాట రాని పరిస్థితి. వాటిని సమర్థించే సహృదయులకు శతకోటి వందనాలు.
మన అభిప్రాయాలు, మన భావాలు మనం రాసుకోవడంలో కాస్త కూడా తప్పులేదు. ఏ మతమూ తప్పుని సమర్ధించదు. అలా అని పరమతాన్ని అవహేళన చేయమని కూడా చెప్పదు. అది మన అమ్మానాన్న మనకు నేర్పిన సంస్కారాన్ని బట్టి వస్తుంది. ఇన్నాళ్లు మనుష్యులకే కులాలు, మతాలు ఉన్నాయన్న భ్రమలో ఉన్నానని నాకిప్పుడే అర్ధమైంది. పిచ్చి పలురకాలన్నట్టు సాహిత్యంలో కూడా ఈ జాడ్యం చాలా బలంగా వేళ్ళూరుకుందని, అది పలువురి అక్షరాల్లో ప్రస్పుటంగా బయటపడుతోంది. పురాణాలు, ఇతిహాసాలు భారతీయ సనాతన ధర్మాలకు ప్రతీకలు. కులం అనేది మనకు పుట్టుకతో వస్తుంది. మనకు నచ్చిన మత ధర్మాన్ని మనం ఆచరించే వెసులుబాటు మనకు ఉంది. ఎవరిష్టపడిన మతం వారికి గొప్పది. మన మతం గొప్పది కాదు, ఎదుటివారి మతం తక్కువది కాదు. ఏ మతమూ మరో మతాన్ని కించపరచమని చెప్పలేదు. కావాలని మతాలను అవహేళన చేస్తూ రాసినంతమాత్రాన మన రాతలకు గొప్పదనం ఆపాదించబడదు. మన సంస్కారం బయటబడుతుందంతే. రాముడు సీతను వదిలేసినా, క్రీస్తు కన్యకు పుట్టిన పరిశుద్ధాత్మయినా ఇలా ఇవన్ని మన నమ్మకాలు. మనం ఒకటి రాస్తే ఎదుటివారు వంద రాయగలరు. మన స్వార్ధం కోసం అక్షరాలకు కులమతాలనాపాదించి మనమెంత హీన స్థితికి దిగజారిపోతున్నామెా తెలియడం లేదు. ఈ వాదాన్ని సమర్థించిన మేథావులందరికీ పాదాభివందనాలు.
"మహిళాదినోత్సవానికి రాముడు వదిలేసిన సీత ప్రభవు వెంటో ప్రవక్త వెంటో వెళ్ళిందని" రాస్తే అవార్డులు, రివార్డులు లెక్కలేనన్ని రావచ్చునేమెా, సన్మానాలతో, సత్కారాలతో హోరెత్తించవచ్చునేమెా కాని మనం ఏంటన్నది ప్రపంచానికి తెలియజెప్తుంది. అది మంచా, చెడా అన్నది మన విజ్ఞత.
5, మార్చి 2019, మంగళవారం
అక్షరాలకంటిన కులమతాలు...!!
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి