10, మార్చి 2019, ఆదివారం

హృద్యమైన ఆవిష్కరణ " హృదయ విపంచి"..!!

సకళ కళా నిలయం మా దివిసీమ. కవులు, ధన్యవాదాలు కళాకారులకు, రాజకీయ, సామాజిక వేత్తలకు, విద్యావేత్తలకు ఇలా మరెందరికో పుట్టినిల్లు మా దివ్య మహిమల దివిసీమ. ఆ దివిసీమ బిడ్డ పద్మజ సబ్బినేని కవిత్వ సంపుటి "హృదయ విపంచి" ఆవిష్కరణ  నాగాయలంకలో అత్యంత వైభవంగా ప్రముఖులచే చేతుల మీదుగా జరిగినది.
సంగీత స్వరాలు ఏడైనా అవి పలికించే రాగాలు అనంతం. మనసుకనిపించిన భావాలను యథాతథంగా అక్షరీరకించి ఆ భావాలకు తగినట్టుగా "హృదయ విపంచి" పేరును ఎన్నుకున్న పద్మజను ప్రతి ఒక్కరు అభినందించారు. అద్భుతమైన సమీక్షను గుమ్మా సాంబశివరావు గారు అందించారు.  జి వి పూర్ణచంద్ గారు పద్మజకు సాహిత్య పరంగా పూర్తి సహకారాన్ని అందిస్తామని సభా ముఖంగా చెప్పడం ముదావహం. ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి డాక్టర్ మండలి బుద్దప్రసాద్ గారు మాట్లాడుతూ చెప్పిన ఎన్నో విషయాలు సభికులను ఆలోచింపజేసాయి. సమాజ హితానికి సాహిత్యమని, సామాజిక మాధ్యమాల ద్వారా మంచి కూడా జరుగుతోందని కొన్ని సంఘటన ద్వారా తెలుస్తోందని చెప్తూ మంచి చెడులు మన సంస్కారాన్ని బట్టి ఉంటాయని, కుల, మత విద్వేషాలు మన రాతల్లో ప్రతిబింబించకూడదని చెప్తూ.. అందరు ఆచరించదగ్గ ఓ చక్కని మాటను చెప్పారు... "మనవాళ్ళని చూసి మనం గర్వ పడాలి, ఇతరులను గౌరవించాలి" ...ఎంత గొప్ప మాటిది. ఘంటసాల వాస్తవ్యులు ప్రస్తుతం దుబాయ్ లో ఉంటూ పలు సేవా కార్యక్రమాల్లో తన వంతుగా సేవ చేస్తూ, ఘంటసాల  చరిత్రను సమీకరించి మార్పులు చేసి ముద్రించిన నిగర్వి వేమూరి రాజేష్ సభకు ప్రత్యేక ఆకర్షణ. గుత్తికొండ సుబ్బారావు గారు, జమదగ్ని గారు,  యనమదల సుబ్బారావు గారు మొదలైన పెద్దలు హృదయ విపంచిలోని కొన్ని కవితను ఉదహరించి పద్మజకు అభినందనలు తెలిపారు. సభ ఆద్యంతమూ అద్భుతంగా జరిగింది.
  సభ దిగ్విజయంగా జగడానికి కారణమైన స్వచ్ఛ నాగాయలంక టీమ్, రస రమ్యంగా సభను జనరంజకంగా నడిపించిన గుడిసేవ విష్ణు ప్రసాద్ గారు, అతిథులను అలరించిన అర్చన నృత్యం, అప్పుడప్పుడు తన మాటలతో సభికులను ఉత్సాహ పరిచిన ప్రముఖుడు పాత్రికేయులు సింహాద్రి కృష్ణ ప్రసాద్, చక్కని ఫోటోలందించిన తమ్ముడు, బాధ్యత గలిగిన పాత్రికేయుడు సుధీర్ గడ్డిపాటి, ఇతర పాత్రికేయులు ఇలా అందరు తమ వంతుగా సహకరించారు. దూరాభారమైనా అభిమానంగా వచ్చిన ఆత్మీయులు సాహిత్య ప్రకాష్, మాడిశెట్టి శ్రీనివాస్, శ్రీ రంగ బాబు గార్లకు ధన్యవాదాలు.
ఇంతకీ అసలు ఈ పుస్తకం ముద్రితం కావడానికి మూలమైన కోనేరు శ్రీలక్ష్మికి కృతజ్ఞతాభినందనలు.
మనసు భావాలను సుసంపన్నమైన, స్వచ్చమైన అక్షరభావాలుగా అందించిన " హృదయ విపంచి " పద్మజ సబ్బినేనికి అభినందన మందారాలు..అక్షర నీరాజనాలు.


0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner