30, ఏప్రిల్ 2012, సోమవారం
చెప్పుకోవడానికి....!!
శ్రీరాముని ధనుస్సు గుచ్చుకుని మండూకం మౌనంగా వుంటే కాసేపటికి చూసిన రాముడు అడిగాడంట కనీసం చెప్పలేదు అని....దానికి మండూకం రామా!! బాధ కలిగితే శ్రీరామా..!! నాకీఇబ్బంది వచ్చింది దాని నుంచి రక్షించు అని నిన్ను శరణు కోరతాము కాని బాధే నీ మూలంగా అయితే ఎవరికీ చెప్పుకోను అని అడిగిందంట...రాముడు దేవుడు కనుక మండూకం వెన్ను నిమిరి స్వాంతన కలిగించి ఆ నిమిరిన గుర్తులను దానికి బహుమతిగా ఇచ్చాడు....
మండూకాన్ని మర్చిపోయి ఉడుత అని రాసాను....మహేష్ గారు సరిదిద్దారు ధన్యవాదాలు....
మనమే మనకి ఒక సమస్యగా మారుతుంటే ఎవరికీ చెప్పుకోవాలి...??? లేదా మన అనుకున్న వారే మనలను సమస్యల వలయంలో తోసేస్తూ వుంటే....!!!
వర్గము
కబుర్లు
28, ఏప్రిల్ 2012, శనివారం
ఎదురుగా నీవుంటే....!!
మంచు ముత్యాల మేలిముసుగు పరదాల చాటునుంచి
దోబూచులాడుతూ తొంగిచూసే తొలిపొద్దు.....
కనిపించి కనిపించని సయ్యాటలాడే వేళ...
రేయి అందాలను సూరీడుకప్పగించి...
జాబిలమ్మ సెలవు తీసుకునే సమయాన...
ఎందరున్నా ఎవరూలేని ఏకాంతంలో...
నీ సాన్నిహిత్యపు అనుభూతిలో
ఓలలాడే వేళ...సుదూర తీరాలలో....
నీ పిలుపు వినిపించిన తన్మయ తాదాత్మ్యంలో...
ఒక్కసారిగా...ఉలికి పడి కనులు తెరిచి
చుస్తే ఎదురుగా నీ రూపం సాక్షాత్కారమే..!!
వర్గము
కవితలు
26, ఏప్రిల్ 2012, గురువారం
దూరం తెలియని గమ్యం..!!
దూరం దూరం తీరం తెలియని గమ్యం
పయనం పయనం అంతే లేని ప్రయాణం
భారం భారం మోయలేని బతుకు బండి బరువు
కోపం కోపం చేతకానితనంతో చిరాకుపరాకు
చేయలేక చేవలేక గెలుపంటే తెలియనితనం
ఎదుటివాడి....
ఓటమిలో మనల్ని వెదుక్కునే క్రమంలో
పతనానికి చిరునామా మనదే...!!
విజయానికి చేరువై గెలుపు పిలుపు
తలుపు తడుతుందేమోనని భయం..!!
చేతగాని తనాన్ని ఒప్పుకోలేక
రుసరుసలతో....విసవిసలతో...
అదే జీవితమనే భ్రమలో.....చక్రభ్రమణంలో...
పరిభ్రమించే చేతగాని వాళ్లకు
గెలుపు సింహాసనం జీవితంలో అందని ద్రాక్ష పుల్లనే...!!
పయనం పయనం అంతే లేని ప్రయాణం
భారం భారం మోయలేని బతుకు బండి బరువు
కోపం కోపం చేతకానితనంతో చిరాకుపరాకు
చేయలేక చేవలేక గెలుపంటే తెలియనితనం
ఎదుటివాడి....
ఓటమిలో మనల్ని వెదుక్కునే క్రమంలో
పతనానికి చిరునామా మనదే...!!
విజయానికి చేరువై గెలుపు పిలుపు
తలుపు తడుతుందేమోనని భయం..!!
చేతగాని తనాన్ని ఒప్పుకోలేక
రుసరుసలతో....విసవిసలతో...
అదే జీవితమనే భ్రమలో.....చక్రభ్రమణంలో...
పరిభ్రమించే చేతగాని వాళ్లకు
గెలుపు సింహాసనం జీవితంలో అందని ద్రాక్ష పుల్లనే...!!
వర్గము
కవితలు
24, ఏప్రిల్ 2012, మంగళవారం
ఎందుకోయి...!!
ఏమి నేరం చేసానని..??
ఎందుకోయి మౌన యుద్ధం....
మాటల దూరం...
మనసుల మద్య అలజడుల అగాధం...
కలతల వెతలలో...కన్నీటి సాక్షిగా...
సేదదీరే క్షణాల కోసం పరితపించే ప్రాణం...
ప్రేమపాశం వదలనంటుంటే....పోయే ఊపిరి ఆగనంటుంటే...
కదలని కాలం భారమైపోతుంటే...శ్వాస ఆగే చివరిక్షణం...
చిన్ని ఆశతో ఎదురు చూసే....గుండెచప్పుడు వినిపించలేదా..
ఎందుకోయి అంత అలుక...
చేజార్చుకోకు దొరికిన ఆలంబన..
మరలిరాదు మారుతున్న కాలం...
మనసు పగలక ముందే భద్రంగా దాచుకో...
మేలిముత్యాల మంచుతునకని...!!
వర్గము
కవితలు
20, ఏప్రిల్ 2012, శుక్రవారం
రేపటి తరాలకు.....అందించండి...!!
బంధాలు బంధుత్వాలు అన్ని మొక్కుబడి జీవితాలైపొయాయి... బాధలో వుంటే వీలైతే వెళ్లి పలకరించడం వెళ్ళడానికి వీలుకాకపోతే ఓ ఫోన్ కాల్ తో సరిపెట్టడం పరిపాటి ఐపోయింది...అస్సలు అదే చాలా ఎక్కువగా పలకరిచేసామని ఫీల్ ఐపోతున్నాము....
బాధలో వున్న వాళ్ళు కోరుకునేది చిన్న ఓదార్పు, నాలుగు చల్లని స్వాంతన వచనాలు అదేనండి మాటలు.....అవే కరువై పోతున్నాయి ఇప్పటి కాలంలో....తనకంటూ అందరూ ఉన్నారు అన్న ఒక్క ఉహతో కొండంత బలం వస్తుంది....మనం డబ్బులు ఖర్చు పెట్టనక్కర లేదు కాస్త ధైర్యాన్నివ్వగలిగితే చాలు....అదే కొన్ని కోట్ల విలువ.....
దూరమైపోతున్న ప్రేమాభిమానాల్ని కాస్త బతికించండి ..... రేపటి తరాలకు కూడా కొద్దిగా వాటి రుచి కొద్దిగా మిగలనివ్వండి.....!!
వర్గము
కబుర్లు
15, ఏప్రిల్ 2012, ఆదివారం
మీరు అవ్వండి....!!
తియ్యని మాటల మాటున దాగిన తీయదనం
సాగర మధనంలో జనించిన హాలాహలం
ఓ అబద్దం లో ఆనందం....!!
ఓ చేదు నిజం లో గరళం ...!!
చివరగా దొరికిన అమృతం కోసం
దేవ దానవుల పోరాటం..
ఈ నాటి సత్యాసత్యాల సయ్యాట...!!
ఆనాటి దైవ జూదం ఈ నాటి నాయకుల మేటి ఆట...
అది తెలియని మన బతుకులతో రాజకీయ విన్యాసం...!!
ఆ వైకుంఠపాళిలో గెలుపు ధననాయకులదే ఎప్పుడూ..!!
అధోగతి సామాన్యునిదే...!! మోయలేని భారం మనకు ....!!
దాయలేని ధన భాండాగారం వారి సొంతం...!!
అందుకే అవ్వండి అందరూ మేటి రాజకీయ నాయకులు....!!
వర్గము
కవితలు
10, ఏప్రిల్ 2012, మంగళవారం
కొంతమంది వైద్యులు....!!
వైద్యో నారాయణో హరి అన్నారు మన పెద్దలు... పెద్దల మాటలు సద్ది మూటలు....కాని ఈనాటి వైద్యులలో ఆ తపన, భావన లేదు....వైద్యం చేస్తున్నాము అంటే చేస్తున్నాము... మనకు డబ్బులు వస్తున్నాయా లేదా అనే కాని రోగి మానసిక స్థితి గురించి ఏమి పట్టించుకోరు. కార్పోరేట్ స్కూల్స్, కాలేజ్ లానే ఆసుపత్రులు కూడా వెలిసాయి మన ఖర్మకి. దీనికి తోడు ఆరోగ్యమిత్రాలు, ఆరోగ్యశ్రీలు వచ్చి మరి అధ్వాన్నమై పోయింది...జరిగే మంచి కాస్త అయితే చెడు ఎక్కువ అయింది. రోగికి మనో ధైర్యాన్ని, నిబ్బరాన్ని కలిగించాల్సిన వైద్యులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం , విసుక్కోవడం చూస్తుంటే బాధగా అనిపిస్తోంది. ప్రాణాలు పోసే దేవుళ్ళు అని మనం వెళ్తే మాటలతో, చేతలతో నరకం చూపించి నూరేళ్ళు బతికేవాళ్ళని కూడా అప్పటికప్పుడు చంపేస్తున్నారు. వైద్యం సరిగా చేయడం రాని వారు రోగులను మాటలతో కుళ్ళబొడుస్తూ న్నరకం చూపిస్తున్నారు. అన్ని తెలిసిన వాళ్ళకే ఇలా చేస్తుంటే ఏమితెలియని వారి సంగతి ఆ పరమాత్మకెరుక. వైద్య వృత్తి ఎంతో ఉన్నతమైనది. మన నడవడి , మాట తీరు ఆ వృత్తికి వన్నె తేవాలి కాని మచ్చగా మారకూడదు. ఓర్పు సహనం లేనివారు దయచేసి ఆ వృత్తిలోనికి వెళ్ళకండి ....మీ దగ్గరకు వచ్చ్సిన రోగులను దయతో ఆదరించండి, మీ మాటలతో స్వాంతన కలిగించండి కాని చంపకండి. ఇది నా విన్నపం వైద్య వృత్తిలో వున్న అందరికి....
వర్గము
కబుర్లు
7, ఏప్రిల్ 2012, శనివారం
నువ్వు లేని నా ప్రపంచం...!!
బంగరు తల్లి....!!
ఈ లోకంలోకి రాలేని నీది అదృష్టమో... !! రానివ్వలేక పోయిన మాది దురదృష్టమో...!! ఏమో మరి ఏది తెలియని ఈ ఆట..!! నువ్వు వస్తావేమో అని ఆశగా చూసాను కాని మళ్ళి ఆ క్షణంలోనే భయం..!! అందుకే నువ్వు కాకుండా వుంటే....ఈ లోకంలోకి రాకుండా వుంటే..ఆడపిల్లగా పుట్టకుండా వుంటే..ఏ కష్టము తెలియకుండా హాయిగా వుంటావన్న చిన్న ఆశతో...ఎంతో ఇష్టమైన నిన్ను ఆమ్మాయి గా కాకుంటే అనుకుంటే...!! అందుకేనేమో ఆ దేవుడు కుడా నిన్ను ఆడపిల్లగా పుట్టించలేదు నా మొర విని..!! అలా అనుకోవడంలో నా స్వార్ధం కూడా వుంది అది కూడా నువ్వు కష్టపడకూడదన్న ఆలోచన... నీ నుంచి నన్ను దూరం చేసింది...నువ్వు లేని లోటు తీరనిదే కాని భరించక తప్పదు...!! నీతోనే చుట్టుకున్న నా ఆనందం...నా చిన్ని ప్రపంచం నువ్వు లేక బోసిపోయింది..!! నీ కోసం ప్రతి క్షణం పరితపిస్తూనే వుంటుంది నా మనసు ఈ జన్మకి...!! నా ఆలోచన తప్పేనేమో నన్ను క్షమించు బంగరు తల్లి...!!
వర్గము
కబుర్లు
5, ఏప్రిల్ 2012, గురువారం
3, ఏప్రిల్ 2012, మంగళవారం
నందనానందం....!!
అబినందనలు చెప్పరూ.....!!
నా కవితకు బహుమతి వచ్చింది.... నిజంగానే వచ్చింది..!!
కావాలంటే ఈ లింక్ చూసుకోండి....
వర్గము
కబుర్లు
2, ఏప్రిల్ 2012, సోమవారం
రక్షక భటులా..!! ధన భక్షకులా..!!
మన పోలీసు అధికారుల హవా, డబ్బుల కోసం పడే తపన చూస్తుంటే మానవతా విలువలు ఎటు పోతున్నాయో అని భయంగా వుంది. రాజకీయ హత్యలు, కొట్లాటల హత్యలు, ప్రైవేట్ హత్యలు, సెటిల్మెంట్లు ....ఇవి మన పోలీసు అధికారుల ఉద్యోగం. ఎక్కడో ఎవరో చచ్చిపోతే సంబంధం లేని వ్యక్తులను ముసలి ముతకా ఆడవాళ్ళు అని కూడా చూడకుండా అర్ధరాత్రి ఇళ్ళ మీదకి వెళ్లి స్టేషనుకి రమ్మని భయపెట్టి, నయానో భయానో వీలైనంత వరకు డబ్బులు దండుకునే రక్షకభట అధికారులను అడ్డుకోవడానికి ముందుకు వచ్చే వ్యక్తో...వ్యవస్థో ...రావాలి...!!
మనకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే మనకో సమస్యగా మారుతుంటే ఇక ఎవరితో మొరపెట్టుకోవాలో తెలియని పరిస్థితి ఈనాటి సామాన్యునిది. కేసులు రాయకుండా మధ్యవర్తిత్వానికి ఇంత... జైల్లో కొట్టకుండా ఉండటానికి ఇంత...ఇలా ప్రతి పనికి రేటు పెట్టిన ఘనత మన పోలీసుబాబులదే.... !!
వర్గము
కబుర్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)