29, జూన్ 2013, శనివారం

అక్రమ తవ్వకం...చూస్తూ ఊరుకున్న అధికారులు....!!

మన చేలో మన్ను మనం తవ్వుకోడానికి లక్షా తొంభై పర్మిషన్లు వాటికోసం వేల వేలు లంచాలు...మన మట్టి మనం
తవ్వుకోడానికి...అదేమని అడిగితే ఆ కేసు ఈ కేసు అని డబ్బులు దండుకోడానికి చూస్తారు. మరి ప్రభుత్వ భూములు చెరువులుగా రాత్రి పగలు తేడా లేకుండా చెరువులుగా తవ్వుతుంటే చూస్తూ ఊరుకోలేక ఫిర్యాదు చేస్తే ఏంటి మీకంత ఇంట్రెస్ట్ అని అడుగుతున్నారు....!! కలక్టర్ గారికి కి చెప్దామని ఫోన్ చేస్తే వారి వరకు ఫోను
వెళ్ళదాయే. మధ్యలోనే అడ్డుకట్టలు....!!
1041 సర్వే నెంబరు ప్రభుత్వ భూమి కోడూరు మండలం పోటుమీద గ్రామం లో నలభై ఎకరాల అసైన్డ్ భూమిని చెరువులుగా ఒక వారం రోజుల నుండి నాలుగైదు ప్రొక్లైనర్లు పెట్టి తవ్వుతుంటే ఎవరు పట్టించుకోవడం లేదు. కంప్లైంట్ చేద్దామని చూస్తే ఇది పరిస్థితి. ఎవరికీ చెప్పాలో మాకే తెలియకుండా పోతుంటే ఏమి తెలియని వారి సంగతి ఇక ఏంటి...??  రేపటితో ఆ తవ్వకాలు పూర్తీ అయిపోవచ్చు కూడా...!! ఆర్ డి ఓ, ఎమ్ ఆర్ ఓ, వి ఆర్ ఓ....ఇలా అందరు ఎవరికీ వారు లక్షలు లక్షలు తిని చూస్తూ ఊరుకుంటుంటే పై అధికారులైన గౌరవనీయులు కలక్టర్ గారు ఏం చేయకుండా ఉంటే సరిపోతుందా....!! పంట పొలాల మధ్యలో రొయ్యలు చేపల చెరువులకు పర్మిషన్లు జి ఓ ప్రకారం ఇచ్చాము అంటే సరిపోతుందేమో....!!
తవ్వుతున్న చెరువు రూట్ :
కోడూరు మండలం పోటుమీద గ్రామం.... నాగాయలంక నుండి బావదేవరపల్లి ఊరిలొ నుండి లోపలికి భావన్నారాయణ స్వామీ గుడి దాటిన తరువాత ఎడమ వైపు సిమ్మెంట్ రోడ్డులో వెళ్తే రెండు రెండున్నర కిలోమీటర్ల దూరంలో 1041 సర్వే నెంబరు ప్రభుత్వ భూమి చెరువులుగా తవ్వబడుతున్నది... !!
ఇది అక్రమ తవ్వకం ఎమ్ ఆర్ ఓ అధ్వర్యంలో జరుగుతున్నది...ఆ పై అధికారులు అందరు ఈనాములు తీసుకున్న వారే....!! చూస్తూ ఊరుకున్న అధికారులు
తదుపరి ఏం చేయాలో.....!!

28, జూన్ 2013, శుక్రవారం

గత జ్ఞాపకంగా మార్చేశావు....!!

ఏరెండినాది నీరింకిపోయి
కన్నీరింకినాది కన్నుల్లోనా తడి లేక...!!

మనసు మువ్వలా ముడుచుకున్నాది
గతం చేసిన గాయపు భయంతో....!!

గువ్వలా ఒదిగిన గుండె గుబులైనాది
నీ తలపులు తట్టి లేపుతుంటే...!!

జ్ఞాపకంలా నువ్వుంటావని ఆశ పడితే
జీవితాన్నే గత జ్ఞాపకంగా మార్చేశావు....!!

26, జూన్ 2013, బుధవారం

ఎలా ఉన్నానని చెప్పను...??

అమ్మా...!! వానలో కాకులు తడిచిపోతున్నాయి పాపం వాటిని లోపలి పిలువు అన్న అప్పటి అమాయకత్వం, హాయిగా అమ్మ చాటు బొమ్మలా ఆడి పాడిన రోజుల ఆ కమ్మదనం ఇంకా నిన్నా మొన్నటిలానే అనిపిస్తోంది...!! పసితనపు స్వచ్చత, ఆనందం, హాయి ఎప్పటికి మళ్ళి దొరకవేమో....!! అందుకే దేవుడు కూడా ఆ ఆనందాన్ని చూడటానికే మనకు పసితనాన్ని వరంగా ఇచ్చాడేమో అనిపిస్తోంది. ఏ బాదరబంది లేని జీవితం అది.
ఏంటో చూస్తూ చూస్తూనే జీవితం కాలంతో పోటి పడి పరుగెత్తి పోతూంది నా ప్రమేయం లేకుండానే...!! ఎన్నో అనుకోని ఊహించని మలుపులు మెలికలు తిరుగుతూ చుట్టుకు పోతుంటే వదిలించుకోడానికి శతవిధాల ప్రయత్నాలు...ఆ యత్నంలో కొన్ని సఫలం మరికొన్ని విఫలం....ఏదైనా మన ప్రయత్నలోపం లేకుండా చూసుకోవడమే....!! ఫలితం అనుభవించడమే ఏదైనా....!! అస్సలు నీకు కోపమే రాదా....!! అని అడిగితే ఏం చెప్పను....?? కోపం, బాధ, సంతోషం అన్ని కలిసిపోయి నేనుగా ఉన్నానని చెప్పాలా....!! మనిషినే కాక మనసుని కూడా ఇబ్బంది పెట్టిన మానవ బంధాలను గురించి చెప్పాలా...!! ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఏది చేయలేని నిస్సహాయత నాదని చెప్పాలా....!! అనుబంధాల పేరుతో జలగల్లా పట్టి పీల్చుకున్న నెత్తుటి చుక్కల్లో.... మోసపోయిన నా గతాన్ని చూడమని చెప్పాలా....!! అవసరానికి పై పై ప్రేమలకు కరిగిపోయిన నా అమాయకత్వాన్ని అడగమని చెప్పాలా...!! ఇలా ఎన్నో గాయాలతో చితికిపోయిన హృదయానికి కొన్ని పన్నీటి జల్లులతో మందు వేస్తూ రేపటి పై మమకారంతో చిరిగిన మనసుకి అతుకులు వేస్తూ చస్తూ బతుకుతున్నానని చెప్పాలా....!! ఎలా ఉన్నానని చెప్పను...??

24, జూన్ 2013, సోమవారం

ఈ చివరి దశలో....!!

వయసుడిగిన నేను ఇప్పుడు లేవలేని స్థితిలో ఉన్నానని నన్ను మా ఇంటిదాన్ని ఈ రోజు బయటికి పోమ్మంటుంటే
ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో తెలియని పరిస్థితి...!! చేతికందిన కొడుకు చేయిదాటిపోతే దిగులు గుబులు దాచుకుని ఉన్న వాళ్ళకో ఆసరా కావాలని తాపత్రయ పడుతుంటే మేము మలిచిన శిల్పమే మమ్ము కాదంటుంటే...!! ఎవరికీ అక్కరలేని ఈ మూడుకాళ్ళ ముసలి జీవితం తట్టుకోగలదా...!! రేపో మాపో అంటున్న మా జీవితాలు మీరు చీ కొడుతున్నా, దులపరిస్తున్నా...భరిస్తున్నాయే కాని కొడుకు గుర్తుగా మిగిలిన రక్త బంధాన్ని చూడకుండా దూరంగా పోగలవా...!! అన్ని చేస్తూ అంత దూరంగా దూర దూరంగా ఉండటమంటే ఎంత కష్టం...!! పగవారికి కూడా ఈ బాధ వద్దు అని కోరుకుంటాము. మీ అవసరాలకి పనికి వచ్చిన మేము ఇప్పుడు మీరు అందలాలెక్కారని మీ హోదాకి సరిపోవడం లేదా...!! లేక మీ ఆనందాలకు అడ్డుగోడగా ఉన్నామని అనుకుంటున్నారా....!!
చదువు సంస్కృతి, సంస్కారం నేర్పాలి, ఉద్యోగం బాధ్యతను గుర్తు చేయాలి కాని బంధాలను తెంచాలనుకోకూడదు. పెద్దలు చెప్పిన ఓ మాట గుర్తు వస్తోంది తాతకు పెట్టిన ముంత తల వేపునే ఉంటుంది మనకు. గత జన్మ ఖర్మ ఫలితాలు కొన్ని అయితే మనం చేతులారా చేసుకునే ఖర్మలు కొన్ని. చేతిలో కాస్తో కూస్తో డబ్బున్న మా పరిస్థితే ఇలా ఉంటె ఏమి లేని వారి గతి ఏమిటో మరి....!! జీవిత చరమాంకంలో ఉన్నా వదల లేని బంధాల పాశాలు పెనవేసుకుని వదలలేక రోజు చస్తూ బతుకుతున్న మాలాంటి వారు ఎందరో ఈ ప్రపంచంలో....!! కొందరికేమో అన్ని ఉన్నా, అందరు ఉన్నా ఏకాకిలా బతకడం ఇష్టం...!! బంధాలను బాధ్యతలను గాలికి వదలి ఏక్ నిరంజన్ అంటూ బతకడం వాళ్ళకిష్టం....!! ఏం చేస్తాం ఎవరి నుదుటి రాత వారిది....!! మా జీవితాలు ఎలా తెలవారిపోనున్నాయో ఈ చివరి దశలో....!!

ఓ వీర జవానుల్లారా...!!

ప్రకృతి విలయానికి తల్లడిల్లిన
ప్రాణాల ప్రాంతమేదో...!!
కులమేదో మతమేదో....!!
జాతేదో రీతేదో తావేదో....!!
భాషేదో భావమేదో....!!
పుట్టినదెక్కడో గిట్టినదెక్కడో....!!
అయినా ఆత్మబంధువులోక్కరే....!!
నా నీ బేధం లేదు
తర తమ తారతమ్యం లేదు
అందరినొకటిగా చేరవేసే గమ్యం దిశగా
నిరంతరం అదే ప్రయత్నంలో
నిన్ను నీవు మరచి ఆపదల్లో అండగా
అలుపెరగక అలసట చెందక
అందరిలో మీరుగా అన్నింటా చేయూతగా
ఆదుకుని ఆసరానిచ్చే మీ ఆలంబనకు
నా అక్షర నీరాజన పాదాభి వందనం
భరత మాత ముద్దు బిడ్డల్లారా
ఓ వీర జవానుల్లారా...!!
మరువదోయి మీ త్యాగనిరతి
భతర జాతి ఉన్నంత వరకు....!!
మనసున్న ప్రతి ఒక్కరు
పలుకుతారు మీకు నివాళి....!!
(ప్రకృతి విలయానికి అసువులు బాసిన ప్రాణాలను,  జీవంతో ఉన్న జీవాలను అత్యంత శ్రమకోర్చి వారి వారి గమ్యాలకు చేర్చడానికి అహర్నిశలు శ్రమిస్తున్న ప్రతి ఒక్కరికి అంకితం )

23, జూన్ 2013, ఆదివారం

చూడలేని ఆ కనులలో ....!!

చూడలేని ఆ కనులలో
వినిపించే మధుర రాగాలు ఎన్నో....!!
వినగలిగే మనసుంటే
మరిపించే  మురిపించే మౌన గానాలెన్నో...!!
తీయని ఆ గొంతు సడిలో
సవ్వడి చేస్తూ సందడి చేసే స్వరాలెన్నొ...!!
మరో రంగుల లోకంలో
సప్త వర్ణాల సుస్వర కలయికలెన్నో....!!
వినగలిగే మనసుంటే చాలు
మనసుతో చూడటానికి కనులెందుకు...!!
( చక్కని స్వరాలతో సుస్వర రాగాలతో అలరిస్తున్న బ్లాక్ ఫ్లవర్స్ ఆఫ్ మ్యూజిక్ పిల్లలకి నా అభినందనలు ఈ కవిత అలా పాడే ప్రతి ఒక్కరికి అంకితం....ప్రోగ్రాం బావుంది కాని పేరు మాత్రం బాధని కలిగిస్తోంది...మనసు కలుక్కుమంటోంది....ఈ టి వి వారు ఒక్కసారి ఆలోచిస్తే బావుంటుంది..) 

అంకెల గారడీలే....!!

నా లెక్కల పుస్తకంలో ఎటు చూసినా
అంకెల గారడీలే....!!
కూడికలు తీసివేతలు ఎన్ని వేసినా
ఎక్కాలు ఎన్ని పైనుండి కిందకు
కిందనుండి పైకి వల్లే వేసినా
గుణకారాల్లోను కుదింపులే
భాగాహారాల్లోను శేషాలే...!!
గజిబిజి గందరగోళంలోలా
ఎక్స్  వై లతో గారడీలు
రేఖలతో అడ్డదిడ్డంగా గీతలు కొన్ని
చతురస్త్ర దీర్ఘ చరురస్త్ర ఇతర ఆకారాల్లో
వృత్త  పరిధిలో ఇమిడి ఇమడని
మనసులతో సరిపెట్టుకుంటూ....
అంక గణితాలతో అంకాలుగా
అర్ధ గణితంతో ఆద్రంగా
ఆటలాడుతూ అలా అలా
అంతు చిక్కని సున్నాలా....!!


22, జూన్ 2013, శనివారం

నీవెవరో తెలియకున్నా....!!

మూసిన రెప్పల మాటున
దాగిన మౌనరాగమో....
కనురెప్పల చాటున
దాగిన కలల కౌముదో....
ఊహల రెక్కల పల్లకిలో
విహరించే విరచిత కవనమో....
కనిపించని మదిలో ఎక్కడో
చోటు చేసుకున్న ప్రియ నేస్తమో....
ఎవరివో తెలియలేదు కాని....
నీ పరిమళపు అనుభూతిలో
కొట్టుకుపోతూనే ఉన్నా....!!
నీ సాంగత్యంలో సాన్నిహిత్యాన్ని
అనుభవిస్తూ ఆస్వాదిస్తూనే ఉన్నా....!!
నీవెవరో తెలియకున్నా....!!

20, జూన్ 2013, గురువారం

ఎంత వరకు సమంజసం...!!

 స్నేహాన్ని స్నేహంగానే ఉండనివ్వండి..నొప్పింపక తానొవ్వక అన్నట్టు ఉంటే ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదు.కొన్ని సార్లు మనం చేసే ఉద్యోగం వల్లనో లేదా ఏదైనా పని వల్లనో అందరితో కలిసి పోవాల్సి వస్తుంది. ఎంత మందితో కలిసి పని చేసినా కొందరే మనకు దగ్గరగా రాగలుగుతారు. అన్ని స్నేహాలు మనసుకు మనిషికి దగ్గరగా రాలేవు. అలా అని ప్రతి పరిచయం స్నేహం కాలేదు....ఎవరికీ ఇబ్బంది లేని పరిచయాలు స్నేహాలు ఎక్కువ రోజులు నిలబడతాయి. అప్పట్లో కలం స్నేహాలు ఉండేవి...ఇప్పుడు ముఖ పుస్తక స్నేహాలు బాగా ప్రాచుర్యం అవుతున్నాయి...ఒక్కోసారి కాస్త ఇబ్బంది పెడుతూ కూడా ఉంటాయి...కాదంటారా....!!
ఎవరికీ వారు...మనని ఎవరు అర్ధం చేసుకోవడం లేదు మంచి స్నేహితులు కావాలి పంచుకోవడానికి అనుకుంటూ వెదుకుతూనే ఉంటారు. దగ్గరలోనే ఉన్న మన ఇంట్లో వారిని గుర్తించలేరు. బయట వారితో ఉన్నంత స్నేహాన్ని, అభిమానాన్ని మన అనుకున్న ఇంటిలోని వారితో ఎంత మంది పంచుకోగలుగుతున్నారు...?? అదేమని అంటే ఇంట్లో వారు అర్ధం చేసుకోరు అని చెప్తారు....అందరూ ఇలానే ఉంటారని కాదు ఖచ్చితంగా కొందరుంటారు...!! మనం ఇవ్వలేనప్పుడు ఎదుటివారి నుంచి ఆశించడం ఎంత వరకు సమంజసం...!!
 మనకి  మనం అనుకుంటాము  " నేను అందరితో బానే ఉంటున్నాను కాని నాతోనే సరిగా ఉండటం లేదు" అని...ఇది ఎంత వరకు నిజం....?? మనం ఎలా ఉంటున్నామో అని మనలా కాకుండా ఒక క్షణం మనతోనే వేరే మనిషిలా ఆలోచిస్తే మన గురించి మనకు తెలుస్తుంది...!! ఎదుటి వారిలో తప్పులు మాత్రమే వెదకడం మాని మంచిని చూడగలిగితే అంతా మంచే కనిపిస్తుంది....మనం చూసే కళ్ళలోనే మంచి చెడు ఉంటుంది....అదే అండి మన ఆలోచనలోనే అంతా ఉంటుంది....చాలా వరకు...!! కాకపొతే కొన్నిట్లో మాత్రం ఊహకందదు....!! అదేనేమో విధి వి చిత్రం అంటే....!!

18, జూన్ 2013, మంగళవారం

ఎటెల్లి పోనుందో...!!

సిత్రాలు చేయకే ఓ చిన్ని మనసా....!!
వి సిత్రమై పోతాదే బతుకునావ...!!
పయనమెటో తెలియక
ఏ దారెటు పోతుందోనని
తిక మక పడి పోతున్నాది....!!
గుబులుగుబులుగున్నాది...!! 
తగిలే దెబ్బలు బాధిస్తున్నా
తప్పని తిప్పలు రెక్కల కష్టం
జానెడు పొట్టకు చాలదాయే....!!
బాదర బంది బరువాయె...!!
గూడు చిన్నబోయే....!!
గుండె  గమ్మునుండే....!!
ఏటో ఎటెల్లి పోనుందో...ఈ బతుకు బండి...!!

దేనికైనా కారణం.....!!

ఓ మనిషిని ఇష్టపడటానికి కాస్తయినా ఆలోచించం....కాని అదే ద్వేషించడానికి మాత్రం ఓ చిన్న కారణం లేదా ఓ
సంఘటనో సరిపోతుంది. ఇష్టపడటానికి పెద్దగా కారణాలు వెదకని మనం ద్వేషించడానికి మాత్రం సవాలక్ష సందులు గొందులు వెదుకుతూనే ఉంటాము అవి మనకు నచ్చే విధంగా దొరికే వరకు....!! ఎందుకంటే చూసే అందరికి మనం వెళ్ళే దారి సరి అయినదే అన్న నమ్మకం కలిగించాలి కదా....!! మన మనస్సాక్షికి మనమేంటో తెలిసి మనతో వాదులాదుతున్నా మన అహం దాన్ని కసిరి కొడుతూ దాని గొంతుని మన చెవిని చేరనీయదు...అందుకేనేమో మనం చేసే ప్రతి పని సరైనదే అనుకుంటూ ఎదుటి వారి బాధని అర్ధం చేసుకోకుండా మన సంతోషమే మనకు చాలు అనుకుంటూ బతికేస్తున్నాము.
ఓ చిన్న ఆలోచనో...సంఘటనో చాలామంది జీవితాలను మార్చేస్తుంది....అది మంచి అయినా కావచ్చు, చెడు అయినా కావచ్చు. కష్టాలు, సుఖాలు అందరికి ఉంటాయి. అయ్యో పాపం అని మనం జాలి పడితే ఆ జాలే మన జీవితాన్ని మనకు కాకుండా చేసేస్తుంది ఒక్కోసారి....తరువాత వెనుదిరిగి చూసుకుంటే మన జీవితం మన చేతిలో ఉండదు. చాలా మందిలో మనిషిలో ఇద్దరుంటారు ఒక్కరినే నమ్మవద్దు. అలా నమ్మితే రేపు మనని చూసుకుని మనమే జాలి పడలేని పరిస్థితి వస్తుంది. అది స్నేహమైనా కావచ్చు...బంధుత్వమైనా కావచ్చు. స్నేహం అనుకోండి వదిలే అవకాశం ఉంటుంది... అదే వెసులుబాటు బంధుత్వంలో కాస్త కష్టం కదా....!! -:) ఆలోచించండి మరి....!!

17, జూన్ 2013, సోమవారం

నిత్య నూతనంగా....!!

ఇది దేవుడు రాసిన బంధమో లేక నేను చుట్టుకున్న అనుబంధమో అర్ధం కావడం లేదు కాని నీతో పెంచుకున్న పాశం తెంచుకుందామంటే ఎక్కడో ఓ మూలన ఉన్న అనురాగం ఆ పని చేయనివ్వడం లేదు. ఇన్ని ఏళ్ళలో ఓ క్షణమైనా నీకోసమే అన్ని వదులుకుని వచ్చిన నా గురించి కేటాయించాలని నీకనిపించక పోవడం నా అదృష్టమో దురదృష్టమో మరి. నీతో మాట్లాడాలంటే నీకు క్షణం తీరిక లేదాయే....నాకు మాత్రం జీవితమంతా నీతో మాట్లాడటానికే చాలదు....ఏమిటో ఈ అర్ధం కాని వ్యత్యాసం మనలో...!! కాసేపు నాతో మాట్లాడితే నువ్వు నాకు తెలిసిపోతానని నీకు భయం కదూ....అయినా నీకు తెలియని విష్యం చెప్పనా...నువ్వు నాకు కొత్తగా తెలియడానికేముంది....నేను తెలియని నువ్వూ  కాదు నువ్వు తెలియని నేను కాదు....!! ఇది నీకు అర్ధం అయ్యేసరికి ఓ జీవితకాలం పడుతుందేమో....!! అప్పటికి నా జీవితం అయిపోతుంది నీకోసం చూసి చూసి....నిరాశతోనే....!! నీకు తెలుసు....నీకోసమే నేనని అయినా ఒప్పుకోలేవు...ఎక్కడ నీలోని అహం దెబ్బతింటుందేమో అని నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ దానిని గెలిపిస్తూ నువ్వు ఓడిపోతున్నావు....!! కానీ అదే గెలుపు అనుకుంటున్నావు....నేను ఓడినా నువ్వు గెలిచినా అది అది మన ఇద్దరిది కలిపి ఒక్కరిదే....!! నిన్ను గెలిపించాలని నేను ఓడిపోతూనే ఉన్నానని నీకు ఈ జన్మకి తెలుస్తుందా...!! నేను కరిగి పోతూనే ఉన్నా నీకు వెలుగు కనిపించాలని పడే తాపత్రయం నీకెప్పటికి తెలుస్తుందో....!! చితికి ముక్కలైన మనసుకి సర్ది చెప్తూ కాసింత సంతోషమనే మందుతో దానిని ఓదార్చుతూ ఎప్పటికప్పుడు నిద్ర పుచ్చుతూనే ఉన్నా.....!! అందమైన అనుబంధం దగ్గరగానే ఉందని ఆశతో....!! గల గల పారే జలపాతాన్ని.... మాటలు మర్చిపోయిన మౌన సరస్సులా చేశావు. నే అల్లుకున్న పూల పొదరింటిని...పరిమళం లేని రెల్లు గదిలా మార్చేశావు....!! గడచిన కాలాన్ని తిరిగివ్వలేని నీకు....
నీతో ముడి పడిన నా జీవితాన్ని నీ జ్ఞాపకాల ఒడిలో....నిదుర పొమ్మని చెప్తూ నువ్వు వెళ్తూ నా నిదురని కూడా  తీసుకు వెళ్తే నేనెలా మరి...?? రెప్ప వేయడం మరచిన కనుపాపలో కూడా నువ్వే కనిపిస్తున్నావని అందరు అనుకుంటున్నారు తెలుసా నీకు...!! కలత నిదుర కలలో నిన్ను చూస్తానని ఆ నిదురలో కలలను కూడా మాయం చేసిన నీ మాయాజాలం నాకెరుకలే....!! నేనే నువ్వయ్యానని నీకు తెలియక పోయినా నాకు తెలుసు....నీ చిత్తరువు నాతోనే ఎప్పటికి సజీవంగా నిత్య నూతనంగా....!!

15, జూన్ 2013, శనివారం

ఏమిటో ఈ చెప్పనలవి కాని అనుబంధం....!!

ఎందుకలా పదే పదే
నా వెన్నంటి నాతోనే ఉంటావు....??
ఏ పని చేస్తున్నా... 
చటుక్కున గుర్తుకొస్తావు...!!
మరపురాని జ్ఞాపకంగా
మిగిలిపోతావనుకుంటే....!!
మరచిపోలేని గాయమై
మదిలో ఉండిపోతున్నావు...!!
నను వీడి పోతావనుకుంటే
జన్మంతా నాతోనే అంటున్నావు....!!
చేయని బాసలు చేతిలో రాయలేదు
చెప్పని ఊసులు మనసు దాటినా... 
పెదవి దాటనే లేదు...!!
అయినా ....
ఏమిటో ఈ చెప్పనలవి కాని అనుబంధం....!!
నీకేమైనా తెలుసా...!!

14, జూన్ 2013, శుక్రవారం

దాసోహమంటున్నంత వరకు....!!

చుట్టూ పంట పొలాలు మద్యలో రొయ్యల చెరువు.....అదేమని అడిగితే నాకు పర్మిషన్ ఉంది ఏం చేసుకుంటారో చేసుకోండి అన్న మాటలు. అధికారం డబ్బు చేతిలో ఉంటే ఏదైనా చేయగలమన్న అహంకారం...!! చేసి చూపించారు...అందరు కుమ్ముక్కై....!! బహిరంగంగా సవాల్ విసిరి మరి చెప్పారు మేము ఉండగా మీరేం చేయలేరు అని అదే చేసి చూపించారు. కలక్టర్ గారికి ఫిర్యాదు చేస్తే ఆయన పంపిన కళ్ళున్న ఎమ్ ఆర్వో , ఆర్ డి ఓ చుట్టూ పంట పొలాలు పాడై పోతున్నా మద్యలో ఉన్న రొయ్యల చెరువు పద్దతిగా అన్ని రూల్స్ పాటిస్తూ జి ఓ ప్రకారమే ఉందని మళ్ళి మరి కొన్నేళ్ళకు పర్మిషన్ జారి చేశారు...పంట పొలాల మద్యలో రొయ్యల చేపల చెరువులకు పర్మిషన్ ఇమ్మని ఏ న్యాయం చెప్పిందో...చెప్పించిందో చూశారుగా....!!
అధికారులు ధనానికి దాసోహమంటున్నంత వరకు....అధి నాయకులు మన చేతిలో ఉన్నంత వరకు ఏ తీర్పైనా మనకనుకూలమే...!! ఏ జి ఓ ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు...మన చేతిలో పనే....!! ఇవి అన్ని తెలిసినా గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు మనం నాయకులను నమ్మకా తప్పదు వారి చేతిలో మోసపోకా తప్పదు. నాయకులు ఓట్ల కోసం ఎన్నో మాటల వాగ్దానాలు చేస్తూ ఉంటారు...వారి పని అయినంక మన పని కోసం వెళ్తే చక్కని మాటలు తేనే పూసినట్లు చెప్తూ ఇదిగో ఇప్పుడే మీ పని అయిపొయింది అంటారు కాని ఎన్ని రోజులు సంవత్సరాలు గడిచినా ఎక్కడి గొంగళి ఆక్కడే ఉంటుంది...చిన్నదైనా సరే మనకు చాతనైన పని మనం చేసుకోవడం ఉత్తమం...కనీసం ఆత్మాభిమానమైనా మిగులుతుంది. 

13, జూన్ 2013, గురువారం

ప్రతి ఒక్కరు.....!!

"అన్ని పనులు ఒక్కరు చేయలేరు కాని ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేయగలరు." ఇది నాకు బాగా నచ్చిన మాట. ఒక స్కూల్ లో చూశాను...నిజమే కదూ అన్ని పనులు చేయలేము కాని తప్పకుండా ఏదో ఒక పని మాత్రం చేయగలం అది మంచి అయినా చెడు అయినా సరే....ఒకరిని ఏడిపించడం కాని, నవ్వించడం కాని, లేదా మనం ఆ రెంటిలో ఏదో ఒకటి చేయడం కాని ఇలా ఏదోఒకటి చేస్తూనే ఉంటాము నిద్ర లేచిన ప్రతి క్షణం నుంచి....!! పుట్టిన మరుక్షణమే మొదలు మన పని ఏడుపుతో....అలా అలా మొదలై మరొకరిని ఏడిపిస్తూ దానిలోనే ఆనందాన్ని వెదుక్కుంటారు కొందరు. మరికొందరేమో ఇతరుల సంతోషం కోసమే బతుకుతారు...తన కోసం ఆరాటపడే వారిని ఏడిపిస్తూ....అదే జీవితమనుకుంటూ....!! నేను నాది అన్న అహంతో గిరి గీసుకుని నా అన్నఅందరిని దూరం చేసుకుంటూ అదే గొప్ప ప్రపంచం అన్న భ్రమలో మరికొందరు....!! మరికొందరేమో నేను బావుంటే చాలు దానికోసమే....ఏదైనా చేస్తాను అంటూ బంధాలు బాధ్యతలు గాలికి వదిలేసి తన స్వార్ధం కోసమే ఏ పనైనా చేస్తారు.....పొట్ట నింపుకోడానికి అవస్థలు కొందరివైతే....పోగేసుకునే వాళ్ళు మరికొందరు....!! చూశారా ఇలా చెప్పుకుంటూ పొతే మనలోనే ఎన్ని రకాలో.....!!
ప్రేమ...ఆప్యాయతా నటించకండి....వాస్తవంగా మీరేంటో మీలానే ఉండండి చాలు. లేనిపోని ముసుగులు వేసుకోవద్దు...ముసుగు జారిపోతుంది ఏదో ఒకరోజు....!! అప్పుడు మీకు మీరే నచ్చరు తరచి చూసుకుంటే...!! కొద్దిగానైనా జీవితంలో నటనను మర్చిపోయి నిజాయితీ గా జీవిద్దాం..!! దానిలోని ఆనందాన్ని ఆస్వాదిద్దాం...!!

10, జూన్ 2013, సోమవారం

మానవత్వమా....!! సమానత్వమా .....!!

ఎందుకీ కులాల కుమ్ములాటలు....??
మతాల మారణహొమాలు....??
కులం కూడు బెట్టునా...??
మతం మరణమాపునా....??

ఎందుకీ వర్గ పోరాటాలు...??
కుల మత విభేదాలు....??
మానవత్వం కోసమా....??
సమానత్వం కోసమా....??

నేను గొప్ప...!!
నా సామాజిక వర్గం గొప్పంటూ...
మాటలు  కోటలు దాటిస్తూ
ఒళ్ళు విరుచుకు తిరిగే వారే కాని....
మానవత్వం చిరునామా తెలియని వారే ఎక్కువ....!!
ఇక  సమానత్వమెక్కడ....?? సమతెక్కడ...??

వసుదైక కుటుంబానికర్ధాలు మార్చి
రాజకీయపు రాక్షస క్రీడలు
విషపు కోరలు చాస్తూ ఉంటే....
హాలాహలాన్నే అమృతమని నమ్ముతూ
కుల మతాల కుమ్ములాటల్లో
అశువులు బాస్తున్న అమాయకులెందరో....!!

వద్దు వద్దు వర్గ వర్న విభేదాలు
విభజన పోరాటాలు...
ఎన్నో సంసృతుల కలబోత....

సమతల మమతల నెలవైన భరతావని
సర్వమత సమ్మేళనం...!!
సకల  జనుల సన్నిహితం...!!
అందరిది ఒకటే మతం ఒకటే జాతి
అదే అదే మానవత్వం....!!
అదే అదే భరతజాతి....!!

9, జూన్ 2013, ఆదివారం

బ్లాక్ ఫ్లవర్ ఆఫ్ మ్యూజిక్......!!

చాలా రోజుల తరువాత ఈ టి వి లో బ్లాక్ ప్రోగ్రాం చూశాక ఈ టపా రాయకుండా ఉండలేక పోతున్నాను....ముందు బ్లాక్ పేరు చూసి బాగా కోపం వచ్చింది. లోపం పిల్లలలో కాని వారి మనసుకు కాదు...అదీను చూసే మన లోపమే కాని చూడలేని వారిలో ఎంత గొప్ప మనసుందో....!! మనం చూడలేని ఎన్నో అందమైన లోకాలు వారు చూడగలరు మనసుతో....!! మరి మనకుందా ఆ మనసు..??
మనం  చూడగలిగే రంగులను వర్న విభాగాలుగా చేసి ఆనందిస్తున్నాము. చూడలేని ఆ కనులకు అన్ని వర్నాలు ఒక్కటే. బ్లాక్ ఫ్లవర్ ఆఫ్ మ్యూజిక్ అంటున్నారు కాని అది నాకు నచ్చలేదు. సప్త వర్నాలను సప్త స్వరాలుగా మార్చి ఆ చిన్నారులు ఆలపిస్తుంటే చూడటానికి కనులెందుకు.....వినే మనసుంటే చాలు అనిపించింది. పాడుతా తీయగా అని.....ఆ ప్రోగ్రాం కి పెట్టి బ్లాక్ అని ఈ ప్రోగ్రాం కి పెట్టడం ఎందుకో బాధగా అనిపించింది...కాస్త మనసుతో ఆలోచించి ఉంటె బావుండేది పేరు పెట్టె ముందు. మనసుతో చూడగలిగే వినగలిగే ఆ చిన్నారులు అన్ని ఉన్న మనలాంటి వారి కన్నా చాలా గొప్పవారు. వారి గొప్ప మనసుకు నా వందనం.

8, జూన్ 2013, శనివారం

నీకెలా తెలుసు బంగారూ....!!

కలలోని కధలో నీవెవ్వరో....!!
కనుల ఎదుట నీవున్నా....
కనిపెట్టలేని నేనెవ్వరో....!!

అస్పష్టమైన నీ రూపాన్ని
కరిగిపోయిన కలలో కాంచి
స్పష్టంగా గీయాలన్న నా యత్నం....!!

అమ్మదనపు హక్కుతో
నాలో చేరిన నువ్వు
నా ప్రతి రూపంగా నాలో నీ
ఆకారాన్ని పొందే ప్రయత్నంలో....!!

నీ స్పర్శ సుతి మెత్తగా తగిలి
నాలో నువ్వున్నావని గుర్తించిన వేళ...!!
నాలోని మమకారమో...
నీలొని మాయాజాలమో...
నాకే తెలియకుండా నా తలపులన్ని నీతోనే...!!

ఆకృతి లేని నీకు అర్ధం కాదనుకున్న
నా మనసు భాష నీకు తెలిసిందో...!! ఏమో ...!!
నీ కదలికల అలజడితో...
భాష తెలియని బంధంతో
పాశాన్ని పెనవేసుకున్నావు నాతో...!!

ఎప్పుడెప్పుడు నిను చూస్తానా...!!
కలలోని ఊసులు నిజంగా నీతో చెప్పాలని...
నాలో జీవమైన నీ సజీవ చిత్రాన్ని 
చూసుకోవాలని పడే తాపత్రయం....!!


నా గీతల్లో ఉంది నువ్వే అని
నా ఎదురుగా ఉన్న నీ చిత్తరువు చెప్తున్నా....
నా ప్రతిరూపమైన అపురూపమైన
నీ ఆగమనం కోసం ఆత్రంగా
ఎదురు చూస్తున్న అమ్మని
నేనే అని నీకెలా తెలుసు బంగారూ....!!

7, జూన్ 2013, శుక్రవారం

సడి సేయక చక్కంగా రావోయి....!!

ఏటి గట్టున ఎదురు సూసేను
పొదల మాటునా తొంగి సూసాను
పొద్దు గూకే ఏల అయినాది
గూటికే రాలేదాయే....!!
నీ జాడ లేక గూడు చిన్నబోయినాది
గుండె గుబులైనాది...!!
యాడ నీ తావో ఎరికైతానేదు...!!
ఊసులెన్నొ సెప్పినావు
బాసలెన్నో సేసినావు
జాడ సెప్పక సల్లంగ జారుకున్నావు....!!
కన్నుల్లోనా నిన్ను కాసేను
రెప్ప పడనీయనేదు నీ రూపు....!!
సడి సేయక చక్కంగా రావోయి....!!
సుక్కల్లోనా సెందురుడా....!! 

6, జూన్ 2013, గురువారం

చిటపట చినుకుల వాన.....!!

తొలకరి చినుకు పుడమిని తడిమితే.....!!
తొలి తొలి పలుకుల తీయదనం
అమ్మకు తెలిసిన చందమే....!!
చిరు చిరు జల్లుల చిత్తడి పుత్తడి
బుడి బుడి నడకల సవ్వడి ఆనందమే....!!
జోరువానల హోరుగాలి
పరుగులెత్తే పరువాల నయగారమే...!!
సప్త స్వరాల స్వరూపమే
సప్త వర్ణాల హరివిల్లు....!!
వడగళ్ళ వాతలు పిడుగుపాటులు
బతుకు నేర్పే పాఠాలు....!!
వాయుగుండాల వాయువేగం
చక్రాల సుడుగుండాలు....
అనుకోని అవాంతరాలే....
జీవిత కాలగమనంలో....!!
చిటపట చినుకుల వాన.....
చెప్పావు బతుకు పయనాన్ని....!!

5, జూన్ 2013, బుధవారం

నీలో నువ్వే నవ్వుకుంటున్నావా....!!

మమకారమే మాయ చేసిందో....
అభిమానమే అడ్డు పడిందో.... 
గాయమైన గుప్పెడు గుండె గూటిలో
కొట్టుమిట్టాడుతున్న నా ప్రాణం
తట్టుకోలేక పోతోంది...!!

నీ చుట్టు....పెనవేసుకుని
పెంచుకున్న పాశం తుంచుకోలేక....!!
దూరమై పోదామంటే
వదలలేని బంధమై పోయావు...!!
వదలి పోదామంటే
ఎక్కడికి వదలి వెళ్ళలేని
బాధ్యతగా నా ముందున్నావు....!!

విధాత రాసిన రాతని చూస్తూ....
విధి ఆడే వింత(వీధి) నాటకాన్ని
వినోదంగా చూస్తూ....
నా నిస్సహాయతను చూసి 
నీలో నువ్వే నవ్వుకుంటున్నావా....!!

ఏడిపిస్తూ....అంతలోనే నవ్విస్తూ... 
కవ్విస్తూ....కనుసన్నలలోనే మురిపిస్తూ
విషాదమై విలయాన్ని సృస్టిస్తావు
మమేకమై మధుర జ్ఞాపకంగాను నిలిచిపోతావు
అన్ని అనుబంధాలకు నెలవైన ఓ ప్రేమా....!!
అందుకేనేమో నువ్వంటే అంత ప్రేమ అందరికీ....!!
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner