10, ఏప్రిల్ 2015, శుక్రవారం

తెలుగు సాహితీ ముచ్చట్లు ... ఇరువది ఏడవ భాగం....!!

వారం వారం మనం చెప్పుకుంటున్న తెలుగు సాహితీ ముచ్చట్లలో పద కవితా సాహిత్యంలో ప్రముఖులైన
అన్నమయ్య గురించి క్రిందటి వారం తెలుసుకున్నాము... అదే కోవలోనున్న క్షేత్రయ్య, త్యాగరాజు, రామదాసుల గురించిన వివరణలు ఈ వారం చూద్దాం.. పద కవితా పితామహుడు అన్నమయ్య తరువాత చెప్పుకోదగిన పద కవులలో క్షేత్రయ్యది ప్రముఖ స్థానం... క్షేత్రయ్య గురించి చెప్పాలంటే ముందుగా కర్నాటక సంగీతాన్ని చెప్పాలి....

కర్ణాటక సంగీతము (ఆంగ్లం : Carnatic music (సంస్కృతం: Karnāṭaka saṃgītaṃ) భారతీయ శాస్త్రీయ సంగీతంలో ఒక శైలి. హిందుస్తానీ సంగీతం ఉత్తర భారతదేశం లో కానవస్తే ఈ సంగీతం భారత ఉపఖండంలో ముఖ్యంగా ద్రవిడ రాష్ట్రాలు లేదా దక్షిణ భారత రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ మరియు తమిళనాడులో కానవస్తుంది. హిందుస్థానీ సంగీతం పర్షియన్ మరియు ఇస్లామిక్ ప్రభావం వలన తనదైన ప్రత్యేకమైన శైలి సంతరించుకోగా, కర్నాటక సంగీతం మాత్రం సాంప్రదాయ మూలాలను పరిరక్షించుకుంటూ వస్తోంది. కానీ రెండింటిలోనూ సాధారణంగా గాత్ర సంగీతానికే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.
భారతీయ సంప్రదాయంలోని అన్ని కళలలాగే కర్నాటక సంగీతానికి కూడా దేవతలకు సంబంధించిన మూలాలు ఉన్నాయి. ఈ సంగీతాన్ని నాదబ్రహ్మకు చిహ్నంగా భావిస్తారు. ప్రకృతిలోని జంతువుల మరియు పక్షుల స్వరాలను నిశిత పరిశీలన ద్వారా అనుకరించడం ద్వారానే స్వరాలు ఏర్పడ్డాయని హిందూ గ్రంథాలు తెలియజేస్తున్నాయి. వైదిక యజ్ఞాల్లో,ఋగ్వేద సామవేద మంత్రాల్లో ఉచ్చరింపబడే కొన్ని సంగీత స్వరాలు ,భారతీయ శాస్త్రీయ సంగీతానికి పునాదిరాళ్ళ వంటివని చెబుతారు. వీణ గాత్రానికి పక్క వాయిద్యమని, యజుర్వేదంలో చెప్పబడింది. రామాయణ,భారతాల్లో కూడా శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన ప్రస్తావనలు ఉన్నాయి. యాజ్ఞవల్క్య స్మృతి లో చెప్పబడినట్లు, " తాళశృతి పరిజ్ఞానము కలిగిన వీణావాదకుడు నిస్సందేహంగా మోక్షమార్గాన్ని పొందుతాడు."
(వీణావాదన తత్వజ్ఞ: శృతిజాతి విశారద: తాలజ్ఞ2ప్రయాసేన మోక్షమార్గమ్ నియచ్ఛతి).
నేటి కర్ణాటక సంగీతానికి స్వరరాగతాళములే ఆధారములని ,ప్రాచీన గ్రంథాలైన శిలప్పాధికారం మరియు భరతుని నాట్యశాస్త్రంలో వివరించబడింది. 

కర్ణాటక సంగీతంలో అనేకమంది పేరెన్నిక గన్న విద్వాంసులున్నారు. పురందర దాసు (1480-1564) సల్పిన విశేష కృషి వల్ల ఆయన్ను ఈ సంగీతానికి ఆద్యుడిగా భావిస్తారు. ఈ సంగీతంలో ప్రాథమిక అంశాలని ఈయనే సూత్రీకరించాడు. సమకాలికుల్లో త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి లను కర్ణాటక సంగీతానికి త్రిమూర్తులుగా భావిస్తారు. వీరి కంటే ముందు అరుణాచల కవి, అన్నమాచార్య, నారాయణ తీర్థులు, విజయదాసు, రామదాసు, సదాశివ బ్రహ్మేంద్ర, ఊటుకూరి వెంకటకవి, మొదలైన వారు ఇందులో ప్రముఖులు. ఇంకా స్వాతి తిరునాళ్, గోపాలకృష్ణ భారతి, నీలకంఠ శివన్, పట్నం సుబ్రమణి అయ్యర్, మైసూరు వాసుదేవాచారి, ముత్తయ్య భాగవతార్, కోటీశ్వర అయ్యర్, సుబ్రహ్మణ్య భారతీయార్, పాపనాశం శివన్ మొదలైన వారు కూడా ప్రసిద్ధిగాంచారు. వీరి కీర్తనలు ప్రస్తుతం అనేకమంది కళాకారులు వేదికలపై గానం చేస్తుంటారు. ఇది క్లుప్తంగా వివరణ కర్నాటక సంగీతం గురించి....
కర్నాటక సంగీతంలో పేరెన్నికగన్న వాగ్గేయకారులలో క్షేత్రయ్య (1595-1660) ఒకడు. ఈయన అసలు పేరు మొవ్వా వరదయ్య గా భావిస్తున్నారు. అనేక పుణ్యక్షేత్రాలు, దేవాలయాలను సందర్శిస్తూ వాటి గురించిన వివరాలు తెలుసుకుంటూ ఉండటం చేత ఈయనకు క్షేత్రజ్ఞుడనే పేరు వచ్చింది. క్రమేణా అది క్షేత్రయ్య గా మారింది.

జీవిత విశేషాలు

క్షేత్రయ్య జీవితకాలం 1595 - 1660 మధ్యకాలం కావచ్చును. ఇతని అసలుపేరు "వరదయ్య". ఇంటిపేరు "మొవ్వ". క్షేత్రయ్య పదాలలోని "వరద" అనే ముద్ర స్వనామ ముద్రగా భావించి అతని అసలుపేరు 'వరదయ్య'గా నిర్ణయించారు. ఇతని జన్మ స్థలం ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్‌లోని, కృష్ణా జిల్లాలో మొవ్వ గ్రామం. ఆ వూరిలో వెలసిన వేణుగోపాల స్వామి అతని ఇష్టదైవం.

జనబాహుళ్యంలో ఉన్న కథ ప్రకారం చిన్నతనంనుండి వరదయ్యకు గాన అభినయాలంటే మక్కువ. కూచిపూడిలో ఒక ఆచార్యుని వద్ద నాట్యం నేర్చుకొన్నాడు. సహపాఠి అయిన "మోహనాంగి" అనే దేవదాసితో సన్నిహితుడైనాడు. తరువాత మేనమామ కూతురు "రుక్మిణి"ని పెండ్లాడాడు. కాని మోహనాంగి పట్ల అతని మక్కువ తగ్గలేదు. దేవదాసి అయిన మోహనాంగి చాలా వివేకం కలిగిన పండితురాలు. తమ ఆరాధ్య దైవమైన మువ్వగోపాలునిపై నాలుగు పదాలు పాడి తనను మెప్పించగలిగితే తాను వరదయ్య ప్రేమను అంగీకరిస్తానని మోహనాంగి షరతు విధించిందట.

మోహనాంగి పెట్టిన షరతు కోసం వరదయ్య నిరంతరం సాధన చేయసాగాడట. ఆ సాధన కారణంగా ప్రపంచములోని జీవాత్మలన్నీ స్త్రీలని, పరమాత్ముడయిన మువ్వగోపాలుడొక్కడే పురుషుడనే తత్వం వరదయ్యను అలుముకొన్నదట. క్రమంగా ఆ మధురభక్తితో అనేక పాటలు పాడాడు. వాటికి మోహనాంగి నాట్యం చేసిందట.

మరొక కథ: బాల్యంలో విద్యాగంధం లేని వరదయ్య పశువుల కాపరిగా ఉండేవాడు. ఒక యోగి ఇతనికి 'గోపాల మంత్రం' ఉపదేశించాడు. ఆనాటి నుండి అతనికి గొప్ప కవితా శక్తి అలవడింది.

దేశాటనం, సన్మానాలు, గుర్తింపు


క్షేత్రయ్య చిత్రపటం
ఆంధ్ర దేశంలోని తిరుపతి, కడప, శ్రీశైలం మున్నగు క్షేత్రాలలో నెలకొన్న దేవతలపైనే కాక, కంచి, శ్రీరంగం, మధుర, తిరువళ్ళూరులలో వెలసిన స్వామి వార్లపై కూడా క్షేత్రయ్య పదాలు రచించారు. కాని, అన్నిటిని మువ్వ గోపాలునికి అంకితం గావించి ఆ స్వామితో ఆయా దేవతలకు అభేదం కల్పించారు. ఈ దేశాటనం కారణంగానే అతనికి క్షేత్రయ్య అనే నామం స్థిరమైనదనిపిస్తున్నది.
ముందుగా గుంటూరు జిల్లా బెల్లంకొండలో చలువు చక్కరపురీశుని దర్శించాడు (చలువ చక్కెరపురి నిలయుడని మదిలో వలవేసి నిను వలపించలేద?). అనంతరం భద్రాచలం లోని సీతారామచంద్రస్వామిని, పిదప శ్రీశైలం మల్లికార్జునుని, ఆపై హంపి హేమాద్రి నిలయుని దర్శించాడు. క్షేత్రయ్య దర్శించిన ఇతర క్షేత్రాలు - పాలగిరి చెన్నకేశవుడు, ఇనగలూరు ఇనపురి స్వామి, (దేవుని) కడప వెంకటేశ్వర స్వామిని దర్శించాడు. తిరుపతి చేరి వెంకటేశ్వర స్వామి, ఇతర దేవతామూర్తులపై అనేక పదాలు రచించాడు.
పిదప దక్షిణాభిముఖంగా సాగి (దక్షిణ ఆర్కాటు జిల్లా) కోవిల్లూరు మువ్వగోపాల స్వామిని దర్శించాడు. తిరువళ్ళూరు వీర రాఘవస్వామి, వేద నారాయణపురం వేదపురీశుడు, సత్యవేడు సత్యపురవాసుదేవుడు, కరిగిరి స్వామి దేవుళ్ళ దర్శనం చేసుకొన్నాడు. మార్గంలో పండితుల, పాలకుల సత్కారాలందుకొన్నాడు. క్షేత్రయ్యను ఎందరో ప్రభువులు సన్మానించారు. వారిలో మధురనేలిన తిరుమల నాయకుడు, గోల్కొండ నవాబు, తంజావూరు రఘునాధ నాయకుడు, చెంజి కృష్ణప్ప నాయుడు (తుపాకుల రాయుడు) ప్రముఖులు. రఘునాధ నాయకునిపై క్షేత్రయ్య వేయి పదాలు చెప్పాడు.
చిదంబంరం గోవిందస్వామిని "తిల్ల గోవిందస్వామి" అని క్షేత్రయ్య ప్రస్తుతించాడు. చిదంబరం పాలకుడైన కృష్ణప్పనాయకుని సన్మానం అనంతరం క్షేత్రయ్య తంజావూరు వెళ్ళి రఘునాధనాయకుని ఆస్థానంలో కొంతకాలం ఉన్నాడు. అక్కడినుండే శ్రీరంగం, కంచి, రామేశ్వరం వంటి పుణ్యక్షేత్రాలను దర్శించాడు. క్షేత్రయ్య దర్శించిన క్షేత్రాలలోని దైవం గురించి కొన్ని క్షేత్రయ్య పదాలు మనకు లభిస్తున్నాయి.

1646లో తంజావూరు పతనమై గోల్కొండ నవాబు వశమైంది. గోల్కొండ సైన్యాధిపతి మీర్ జుమ్లా సాహిత్యాభిమాని. క్షేత్రయ్యను సగౌరవంగా గోల్కొండ నవాబు సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా వద్దకు తోడ్కొని వెళ్లాడు.ఆ నవాబు ఆస్తానంలో క్షేత్రయ్య పెక్కుకాలం ఉండి 1500 పదాలు వ్రాశాడు.

తిరుగుప్రయాణంలో భద్రాచలం క్రొత్త తాసిల్దార్ కంచెర్ల గోపన్న క్షేత్రయ్యను ఆదరించాడు. అనంతరం క్షేత్రయ్య తన స్వగ్రామం మొవ్వకు తిరిగివచ్చాడు. తాను వివిధ పాలకులవద్ద కూర్చిన పదాలగురించ ఈ క్షేత్రయ్య పదం ద్వారా మనకు తెలుస్తుంది.

దేవగాంధారి రాగం - ఆది తాళం
పల్లవి:
వేడుకతో నడచుకొన్న - విటరాయడే
అనుపల్లవి:
ఏడుమూడు తరములుగా - ఇందు నెలకొన్న కాణాచట!
కూడుకొని మువ్వ గోపాలుడే నా విభుడు ||వేడుక||
చరణాలు:
మధుర తిరుమలేంద్రుడు - మంచి బహుమానమొసగి
యెదుట కూర్చుండమని - ఎన్నికలిమ్మనెనే
యిదిగో రెండువేల పదములు - ఇపుడెంచుకొమ్మనగా?
చదురు మీదనే యున్న సామికి - సంతోషమింతింత గాదె? ||వేడుక||

అలుకమీరి తంజావూరి అచ్యుత విజయరాఘవుడు
వెలయ మనుజుల వెంబడి - వేగమె పొడగాంచి
చలువ చప్పరమున నుండగ - చక్కగ వేయి పదముల
పలుకరించుకోగానే బహుమానమిచ్చేనావేళ ||వేడుక||

బలవంతుడయిన గోలకొండ - పాదుషా బహుమానమిచ్చి
తులసిమూర్తితో వాదు తలచే నావేళ
వెలయు మువ్వ గోపాలుడు - వెయ్యిన్నూరు పదములు
నలువది దినములలో - నన్ను గలసి వినిపించెనే ||వేడుక||

క్షేత్రయ్య పద విశిష్టత

మాట, పాటలను స్వతంత్రంగా రచించగలిగినవారినే వాగ్గేయకారులు లేదా బయకారులు అన్నారు.
భక్తుడు తనను నాయికగా భావించి భగవంతుని పొందుకోసం చెందే ఆరాటమే మధుర భక్తి. ఇలాంటి మధుర భక్తి ప్రబలంగా ఉన్న 17 వ శతాబ్దం లో క్షేత్రయ్య జీవించాడు. పదకవితలకు ఆద్యుడిగా క్షేత్రయ్యను భావిస్తున్నారు. ఆయన పదకవితలు నేటికీ సాంప్రదాయ నృత్యరీతులకు వెన్నెముకగా నిలిచి ఉన్నాయి. ఆయన 4,500 కు పైగా పదాలు రచించాడు అని "వేడుకతో నడుచుకొన్న విటరాయుడే" అనే పదం వలన తెలుస్తున్నది. వాటిలో 1,500 పదాల వరకు గోల్కొండ నవాబు అబ్దుల్లా కుతుబ్ షా కు అంకితమిచ్చాడు. ఈనాడు మనకు 330 పదాలు మాత్రమే లభిస్తున్నాయి.

క్షేత్రయ్య పదాలలో లలితమైన తెలుగుతనంతో పాటు చక్కని అలంకారాలు మరియు జాతీయాలు ఎక్కువగా కనిపిస్తాయి. సంగీతానికి, సాహిత్యానికి సరైన ప్రాధాన్యము యిచ్చిన పదకర్తగా ఆధునికులు క్షేత్రయ్యను మిక్కిలి ప్రశంసించారు.
డాక్టర్ మంగళగిరి ప్రమీలాదేవి తన రచనలో క్షేత్రయ్య పదాలకు ఈ విశిష్టతలు ఉన్నాయని వివరించింది.
  • భావ విస్తృతికి అనువైన రాగ ప్రస్తారం.
  • క్షేత్రయ్య పదాలకు సంగతులు పాడే అలవాటున్నది.
  • ఈతని పదాలు రాగ భావ పరిపూరితాలు. రాగాలను భావానుగుణంగా ప్రయోగించడం తెలిసిన సంగీతజ్ఞుడు క్షేత్రయ్య. ఈయన తన పదాలలో షుమారు 40 రాగాలను ఉపయోగించాడు. త్రిపుట తాళంలో ఎక్కువ పదాలు పాడాడు.
  • క్షేత్రయ్య పదాలు ఎక్కువగా అభినయం కోసం ఉద్దేశింపబడినవి. వీనిలో నృత్తానికి అవకాశం తక్కువ.దృశ్య యోగ్యాలైన శబ్దాలను ఎన్నింటినో చక్కగా వాడాడు.మూర్తి వర్ణన కూడా చాలా చక్కగా చేశాడు.
  • ఒక్కమాటలో చెప్పాలంటే క్షేత్రయ్య పదం దృశ్య శ్రవణ సమసంబంధి! కళాహృదయ చైతన్య గ్రంధి! సంగీత సాహిత్య అభినయాలకు సముచిత ప్రాధాన్యత ఉన్న పదకవితలను రచించి క్షేత్రయ్య తరువాతివారికెందరికో మార్గదర్శకుడైనాడు.

క్షేత్రయ్య పదాల లక్షణాల గురించి డా. దివాకర్ల వేంకటావధాని ఇలా వ్రాశాడు
  • తెలుగులో గేయములను ఆరు విధాలుగా విభజింపవచ్చును - కృతులు, కీర్తనలు, తత్వములు, పదములు, జావళీలు, పాటలు. వీటిలో పదములు, జావళీలు అభినయానుకూలములు. అందునా పదములు రాగతాళవిలంబముతో కూడియుండును.
  • క్షేత్రయ్య వట్టి పదకర్తయే కాదు. అలంకారశాస్త్రములో ప్రావీణ్యత సంపాదించి క్రొత్త పుంతలు త్రొక్కినాడు.
  • పదములలో గొప్ప సంగీత కళాపాటవమును ప్రవేశపెట్టినవారిలో అగ్రగణ్యుడు క్షేత్రయ్య... అదివరకెవ్వరు రాగమునకిట్టి అందచందములు కూర్చలేదు. తరువాతి వాగ్గేయకారులకును, సంగీతకారులకును క్షేత్రయ్య మార్గదర్శియైనాడు.
  • కాలప్రభావముననుసరించి అతడు తన పదములలో శృంగారమునకే అధిక ప్రాధాన్యతనిచ్చినాడు.
  • మనమెట్టి నాయికానాయకుల గురించి తెలుసుకోవాలన్నా గాని క్షేత్రయ్య పదాలలో చక్కని ఉదాహరణం లభిస్తుంది.
  • భావ ప్రకటనమున క్షేత్రయ్య మిక్కిలి ప్రౌఢుడు. అతని పదములన్నియును వినివారి హృదయములకత్తుకొనే భావములకు ఉనికిపట్టు.
  • ఆనాటి పలుకుబడులెన్నో అతని పదాలలో గోచరిస్తాయి. అతడు మారు మూల పదములు, జాతీయములు ఎక్కువగా వాడాడు. శబ్దరత్నాకరంలో అతని పదాలను విరివిగా ఉదాహరించారు.
  • క్షేత్రయ్య పదములు అభినయానుకూల్యమైనవి.
ఉదాహరణలు ఆనంద భైరవి రాగం - ఆదితాళం
పల్లవి:
శ్రీపతి సుతు బారికి నే-నోపలేక నిను వేడితే
కోపాలా? మువ్వ గోపాలా?

అనుపల్లవి:
ఏ ప్రొద్దు దానింటిలోనే-కాపైయుండి నీ సరస స
ల్లాపాలా? మువ్వ గోపాలా?

చరణాలు:
పైపూత మాటలు నేర్ప-జూపుదాని రతిపై నింత
తీపేలా? మువ్వ గోపాలా?

చూపుల నన్యుల దేరి-చూడని నాతో క
లాపాలా? మువ్వ గోపాలా?

నా పొందెల్ల దానికబ్బి-యే పొందును లేక యుసురనుటే
నా పాలా? మువ్వ గోపాలా?



ఇంతసేపు మోహమేమిరా ? ఇందరికంటే - నింతి చక్కనిదేమిరా ?
సుంతసేపు దాని - జూడకుండలేవు
అంతరంగము దెలుప - వదియేల మువ్వగోపాలా ! ||ఇంత||

నీకెదురుగ వచ్చునా ? నెనరూరగా - నిండు కౌగిట జేర్చునా ?
ఆకుమడుపు లిచ్చునా ? తన చెలిమి
కైన వాడని మెచ్చునా ? తమి హెచ్చునా ?

ఏకచిత్తమున మీరిద్దరు - నింపు సొంపుగ నున్న ముచ్చట
నాకు వినవిన వేడుకయ్యిరా ! యిపుడానతీరా ! ||ఇంత||

మోవి పానకమిచ్చునా ? కొసరి కొసరి - ముద్దులాడనిచ్చునా ?
తావి పువ్వుల దెచ్చునా ? తన సొగసుకు
తగినవాడని మెచ్చునా ? మనసిచ్చునా ?
దేవరే మొగడు గావలెనని - భావజుని పూజ లొనరించిన
యా వనిత పేరేమి సెలవీరా ? సిగ్గేలరా ? ||ఇంత||

సంతోషముగ నాడునా ? తంబుర మీట - సంచు పాట పాడునా ?
వింత రతుల గూడునా ? ఆ సమయమున
విడవకుమని వేడునా ? కొనియాడునా ?
సంతతము న న్నేలుకొని యా - కాంతపై వలచినపుడె యిక
కొంత యున్నదో మువ్వగోపాల ? గోరడ మేలా ? ||ఇంత||
అందమైన పదాల కూర్పులో నిష్ణాతులైన క్షేత్రయ్య పద కీర్తనలు కొన్ని పైన ఉదాహరణలలో చూసాము.... ఈనాటికి ప్రజలకు చిరపరిచితంగా సంగీత సాహిత్యాలకు ఓ చిరునామాగా మిగిలిపోయిన ఈ వాగ్గేయకారుడు మన తెలుగువాడని చెప్పుకోవడం మనకు ఎంతో ఆనందకరమైన విషయం... ఇప్పటికే వ్యాసం చాలా పెద్దది అవడం వలన మిగిలిన వాగ్గేయకారుల గురించి వచ్చే వారం తెలుసుకుందాం...

ఇలా చెప్పుకుంటు పోతుంటే అంతు లేని మహా సాగరం ఈ సాహితీ సంద్రం... ఇక ఈ వారానికి ముగిస్తూ వచ్చే వారం మరి కొన్ని సాహితీ ముచ్చట్లతో మళ్ళి కలుద్దాం....

సేకరణ : వికీపీడియా నుండి 
వచ్చే వారం మరికొన్ని ముచ్చట్లతో.....

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner