ఈమద్యన పలకరింపుల భావాలు దూరమయ్యాయి మన మధ్యన ఎందుకనో... అంతరాలు, ఆంతర్యాలు ఒకటైనా పెంచుకున్న బంధం ఒక్కోసారి ఇలానే దూరంగా ఉండి పోతుంది కాబోలు పంచుకునే మౌనాలు మాటలు నేర్చితే... నిశ్చలమో, నిస్తేజమో అర్ధం కాని అయోమయం వెన్నాడుతోంది మదిని... అవిశ్రాంతంగా పని చేసే మెదడు విస్పోటనం చెందితే కలిగే వేదన ఒక్కసారిగా చుట్టుముట్టినట్టుగా అనిపిస్తోంది.... గంభీరంగా కనిపించే సాగర లోపలి స్థావరం ఎన్ని సుడిగుండాలను దాచుకుందో, ఎన్ని అగ్ని పర్వతాలను చల్లబరచడానికి నిరంతరం యత్నిస్తూ... అన్ని తనలోనే దాచుకుంటూ ... చూపరులకు తీరాన్ని అందంగా అలల సవ్వడితో సందడి చేస్తోందో నీకు తెలుసు కదా... ఏంటో ఎప్పుడు సముద్రం దగ్గరకే పోతుంది నా ఆలోచన... ఎందుకో మరి అంత ఇష్టం ఈ అనంత సాగరమంటే... ఏది మనం ఇచ్చినా మళ్ళి ఒడ్డుకే చేరవేయడం, ఎన్ని నదుల ప్రవాహాలనైనా తనలో ఒద్దికగా ఇముద్చుకొవడం, ఎప్పుడో తప్ప తనలోని బడబానలాన్ని చూపని సముద్రం ఎందుకో ఎప్పుడూ నచ్చేస్తుంది నాకు...నాకు దానికి దగ్గర పోలికలున్నాయనేమో మరి... అంతే తెలియని సాగరము, కనిపించని మది అలజడి, రెండు సారూప్యంగా అనిపిస్తాయి... చిరునవ్వు చాటున దాగిన కాలిపోయిన స్వప్నాలను చూస్తూ కన్నీటితో చెలిమి చేస్తున్నా తడి ఆరిపోయిన కళ్ళకు తెలిసిన నిర్జీవ రూపాన్ని బయట పడనీయని మనోనేత్రాన్ని, మానసిక స్థైర్యాన్ని అందించే నీ చెలిమికి సాక్ష్యంగా ఇలా ఉండిపోతూ....
నీ
నెచ్చెలి
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి