నింగికి నేలకు మధ్యన ఊగిసలాడుతూ
దశా దిశా లేని గమ్యాన్ని చేరాలనే ఆరాటంతో
ఊహల చుక్కానిని తోడుగా చేసుకుని
భవితకు భాష్యానికి చిరునామాగా నిలవాలన్న
ఆరాటాన్ని అంది పుచ్చుకుని పరుగులు పెడుతూ
అపజయాల పానుపు అనునిత్యం స్వాగతిస్తున్నా
రాళ్ళ దెబ్బలకు రాటుదేలి సూదంటు రాయిలా
చురకత్తిగా మారి అక్షరాల అస్త్ర విన్యాసంతో
అణు విస్పోటనానికి వేదికగా నిలిచి
అంతర్యుద్దాల ఆహార్యానికి అద్దం పడుతూ
మనసు మౌనానికి మాటలు నేర్పుతూ
సరి కొత్త సంకలనాల జీవితపు పుటల
బావుటాను ఎగురవేస్తూ
వేదనల నైరాశ్యాల వాదనకు స్వస్తి పలుకుతూ
తన ఉనికిని రాలిపోతున్న వేల చుక్కల లెక్కల్లో చేరనీయక
క్షణ కాలమైనా దిగంతాల వెలుగులను పరిహసిస్తూ
స్వయం ప్రకాశమై నిలవాలన్న తపనను
ఆభరణంగా చేసుకుని ఓ మెరుపై మైమరచి పోవాలన్న
ఊహకు జీవాన్ని నింపుకుంటున్న ఒంటరైన నక్షత్రం....!!
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి