29, సెప్టెంబర్ 2015, మంగళవారం

ఏక్ తారలు ...!!

1. ఏకాంతానికి సాయమైనందుకేమో_కాంత శోకానికి నెలవిచ్చింది 
2. ప్రేమ సంకెళ్ళలో బందీలే ఇరువురూ_గెలుపోటములు ఎవరివైనా
3. అనుమానం నాకన్నా ముందే పుట్టిందని తెలిసి_ఏ'కాంతం'తో పరిహాసాలా
4. జీవిత ఖైదీలుగా_ఈ జన్మకి ప్రేమ సంకెళ్లకు

28, సెప్టెంబర్ 2015, సోమవారం

మాకు ఏ న్యాయ స్థానాలు అవసరం లేదు....!!

మన జాతి రత్నం భగత్ సింగ్ పుట్టినరోజు ఈరోజు... ఎందఱో అమరుల త్యాగ ఫలితం నేడు మనం అనుభవిస్తున్న
స్వాతంత్ర్యం... ప్రజాస్వామ్యం అని, లౌకిక రాజ్యమని మనం మురిసి పోతున్న ఈ భరతావనిలో ఓటు హక్కుకు ఉన్న విలువ ఏమిటి..? మనం ఎన్నుకున్న నాయకులు వారి వారి స్వప్రయోజనాల కోసం గెలిచిన తరువాత పార్టీలు మారుతుంటే, పలాయనవాదులౌతుంటే ఓటు వేసిన పాపానికి తలను దించుకోవాల్సిన పరిస్థితి మనకు వస్తుంటే దానికి పరిష్కారం ఎక్కడ..? పేరుకు మాత్రమే ప్రజాస్వామ్యమా... తప్పును అడ్డుకునే హక్కు ఓటు వేసినవాడికి లేక పోవడం ఎంత దురదృష్టకరం... అత్యున్నత న్యాయ స్థానం కూడా కర్ర విరగకుండా పాము చావకుండా తన చాతుర్యాన్ని చూపిస్తుంటే ఓటు వేసినందుకు శిక్షగా కనీస న్యాయానికి నోచుకోని సామాన్య జనం సంగతి ఏమిటి..? ఒక పార్టీలో గెలిచి వేరొక పార్టీలోనికి వెళ్ళే కనీస నైతిక విలువలు పాటించని నాయకులు మనకు అవసరమా.. వీళ్ళనా మనం ఓట్లు వేసి గెలిపించేది... గెలుపుకు ముందు గుర్తు రాని పార్టీ గెలిచిన తరువాత గుర్తుకు వస్తుంది... కాని ఓటు వేసి గెలిపించిన సామాన్యుడు గుర్తు ఉండడు... కనీసం ఎందుకు అని అడిగే కనీస హక్కు కూడా లేనప్పుడు ఈ ఎన్నికలెందుకు... మాకి కంటితుడుపు ఒట్లేందుకు...? జనం ఓట్లతో గెలిచి మీ ఇష్టానికి మీరు ప్రవర్తిస్తే మిమ్మల్ని  గెలిపించిన జనానికి ప్రతినిధిగా మీకు సభలో కూర్చునే హక్కు ఎక్కడిది..?
      పార్టీలు మారే ప్రతి ఒక్క నాయకుడు ఎన్నికలకు ముందే ఎందుకు పార్టీ మారరు..? గెలిచాక మీరు మారాలి అనుకుంటే ఎన్నికల ఖర్చు మొత్తం కట్టి మీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి అప్పుడు మీరు కావాలనుకున్న పార్టీ లోనికి మారి మళ్ళి ఎన్నికలు పెట్టించుకుని అప్పుడు మీ గెలుపు చూసుకోండి... మాకు అభ్యంతరం ఉండదు ఇలా చేస్తే మీరు ఎన్ని సార్లు పార్టీలు మారినా... పేరు కోసం డబ్బు కోసం పార్టీలు పెట్టి మీకు కావాల్సినంతా దండుకుని పదవి కోసం పార్టీలను వేరే పార్టీలలో విలీనాలు చేయడం, నీతి వాక్యాలు వల్లించడం చూస్తుంటే చూసే వాళ్లకి వినే వాళ్ళకి ఎలా ఉందో కానీ నాకైతే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది...
     ఆ ఏం ఉందిలే ఈ పిచ్చి జనం నాలుగు రోజులు పొతే అన్ని మర్చిపోతారు ... మళ్ళి ఎప్పుడో 5 ఏళ్ళకు ఎన్నికల్లో మనం ఏ పార్టీనో వీళ్ళకు గుర్తుంటుందా ఏంటి ... అప్పటికి మనకే గుర్తుండి చావదు మనం ఏ పార్టీనో... రోజుకో పార్టీ మారుస్తూనే ఉంటామాయే అప్పుడు నాలుగు డబ్బులు ఓ మందు సీసా పడేస్తే వాళ్ళే వేసేస్తారు ఓటు అనుకుంటే సరి పోదు... మీరు అనుకునే ఆ సామాన్యుడే సాయుధమైన ఓటుని ఆయుధంగా చేసి మీ నడతకు తగిన బుద్ది చెప్తాడు... మాకు ఏ న్యాయ స్థానాలు అవసరం లేదు ఒకసారి మోసపోతాం కాని ప్రతి సారి మోసపోము.. ఈ పార్టీల ఫిరాయింపులను మేమే అడ్డుకుంటాం... జాగ్రత్త ..!!

26, సెప్టెంబర్ 2015, శనివారం

నాదేం లేదు దీనిలో అధ్యక్షా...!!

    ఎవరో రావాలి.. ఏదో చేయాలి  అని ఎదురు చూస్తూ మన తప్పులకు ఎన్నో అన్నెం పున్నెం ఎరుగని అభాగ్య జీవులను బలి చేస్తూ దానికి రాజకీయ రంగులను పులుముతూ ఎవరో అన్నట్టు శవాలతో రాజకీయాలు చేసే స్థాయికి ఈరోజు మనం దిగజారి పోతున్నాం.. మనం అనుకుంటాం ఆఁ ఏం పోయింది మనం వేసేది ఒక్క కాగితమే కదా ఏం అవుతుందిలే అని.. కాని అలా పేరుకు పోయిన చెత్తే ప్రాణాలతో చెలగాటమాడుతుంది..
   సమస్య మనదైనప్పుడు పరిష్కారం మనమే చూసుకోవాలి... ఎప్పుడో ఆ కాలంలో యద్దనపూడి గారు చెప్పినట్టు ఈ దేశం మాకేమిచ్చింది అని కాకుండా మనం దేశానికి ఏమి ఇవ్వలేక పోయినా పర్లేదు మనమైన సమాజానికి మన వంతుగా ఏం చేస్తున్నాం అని ఓ క్షణం ఆలోచిస్తే... అసలు సమాజం వరకు ఎందుకండీ మన ఇంట్లో వరకు మనం చూసుకుంటే చాలదూ... ఏదో కాస్త సమాజాన్ని అప్పుడు చూడొచ్చు... చిన్న చిన్న సమస్యలను మనమే పెద్దవిగా చేసేస్తూ దానికి వేరేవరినో బాధ్యులను చేసి న్యాయం కావాలి అంటే ఏ దేవుడు న్యాయం చేస్తాడు.. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఎవరికి వారు కనీసం కొన్ని నియమాలు ఆ దేశ పౌరులుగా ఉన్నందుకు పాటిస్తారు... మనం ఓటు వేయడానికి డబ్బు తీసుకుంటుంటే వాళ్ళు అదే ఓటు వేయడానికి డబ్బు కడతారు చూసారా చిన్న తేడా వాళ్లకి మనకి మధ్య...
    ఈ ప్రత్యేక హోదాలు, ధర్నాలు వీటి వల్ల మనకు కొత్తగా ఒరిగేదేం లేదు... వాటికి ఖర్చు పెట్టే డబ్బుతో కాస్త సమాజానికి ఉపయోగ పడే పనులు చేస్తే జనాలు పది కాలాలు గుర్తుంచుకుంటారు...మాట మాట్లాడితే సింగపూర్, జర్మనీలు తిరగకుండా ఆ డబ్బు కొద్దిగా రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగిస్తే మరోసారి గెలవడానికి పనికివస్తుంది...
ఇదండీ నేడు మన పరిస్థితి.. అందుకే నేను చెప్పొచ్చేదేటంటే " ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా... నిజం మరచి నిదురపోకుమా" అని మన పెద్దోళ్ళు చెప్పిన మాటే ఓ పాలి గుర్తుచేసాను అంతే... నాదేం లేదు దీనిలో అధ్యక్షా...!!

25, సెప్టెంబర్ 2015, శుక్రవారం

మణి మాలికలు...!!

1. విజేతనై నిలవాలనుంది
ఓటమిని ఎదిరించి
2. విజేతనై నిలవాలనుంది
వీడలేని మన చెలిమి సాక్ష్యంగా
3. విజేతనై నిలవాలనుంది
ఓడిన మదిని నీ జ్ఞాపకాల చెలిమితో ఓదార్చుతూ

19, సెప్టెంబర్ 2015, శనివారం

వాస్తవాధీన రేఖలు...!!

          జీవితమే ఒక పాఠశాల...ఎంత నేర్చుకున్నా ఇంకా మిగిలిపోతూనే ఉంటాయి పాఠాలు... అందుకేనేమో ఆది అంత్య గురువు జీవితమే అవుతోంది... పరిచయాలు, అనుభూతులు, అనుబంధాలు, అభిమానాలు, ప్రేమలు, ఇష్టాలు, కోపాలు, ఆవేశాలు, రోషాలు, అహంకారాలు, ఆత్మాభిమానాలు.... ఇలా ఇంకా ఎన్నో ఎన్నెన్నో కలగలిపిన జ్ఞాపకాలు మనతో కడవరకు ...
           నిజాన్ని నిర్భయంగా చెప్పలేని జీవితాలు.. చెప్పినా ఒప్పుకోలేని వాస్తవాధీన రేఖలు... అబద్దంలో బతికేస్తూ అదే నిజమని భ్రమ పడుతూ సరి పెట్టుకుంటూ లేదా సరి పుచ్చుకుంటూ జీవితాన్ని వెళ్ళదీస్తున్న సత్యాన్ని మరచిన సమాజ జీవులు.. జీవశ్చవాలు అనాలేమో..చేజార్చుకున్న క్షణాలు మరలి రావని తెలిసినా మళ్ళి మళ్ళి జారవిడుచుకుంటూనే కోల్పోయిన జ్ఞాపకాలను నిద్రపుచ్చే ప్రయత్నంలో సఫలీకృతులెందరు అన్నది కాలం తేల్చాల్సిన లెక్కలు...
            మన తప్పులను మర్చిపోయి ఎదుటివారి తప్పులను బూతద్దంలో చూసే సంస్కృతిని బాగా ఒంట పట్టించుకున్న అహం మనది.. మనకు లేని మంచి లక్షణాన్ని కాస్త కూడా ఎదుటివారిలో చూడలేని గొప్పదనం మనది...మనకి మనమే సత్య హరిశ్చంద్రులం అనుకుంటూ నిజం మనకి తెలిసినా దాన్ని నిద్ర పుచ్చుతుంటాం... అది లేచి గొంతు విప్పితే మన దగ్గర సమాధానం ఉండదు కనుక... 
            ఏవిటో నటించేస్తూ బతికేస్తున్నాం... మన కన్నా అందరు గొప్ప నటులే అనుకుంటూ...నిజాయితీగా బతికే నాలుగు క్షణాలు మరణానికి ముందేనేమో... లేదా నటించి నటించి అప్పుడు కూడా నటనలోనే జీవించేస్తామేమో... నటించలేమంటూ పారిపోయిన అక్షరాలను పట్టి తెచ్చి ఇక్కడ కూర్చోపెట్టడానికి నా తల ప్రాణం తోకకొచ్చిందంటే నమ్మండి...!!

మణి మాలికలు....!!

1. గమ్యానికి గమ్యమే
అగమ్య గోచరమయిందట ఎలా చెప్మా...!!
2. గమనానికి గమ్యం అవసరమే
అమ్మ నుండి తప్పిపోయిన పాపాయికి ఆలంబనలా...!!
3. గగనానికి చేరువైన గమ్యం
గతి తప్పిన నా జీవన గమనానికి సాక్ష్యంగా..!!

ఏక్ తారలు...!!

1. చీకటికి చోటిచ్చిన సూర్యుడు_జాబిలి రాకకు వెన్నెల పరుస్తూ
2. నిరీక్షణలో తీక్షణ ఎక్కువై_తలపులకు పంచేస్తూ చల్లబడే విరహం
3. వసంతానికెప్పుడు విరహమే_చల్లదనంలో తాపాన్ని రగిలిస్తూ
4. వెన్నెలకు వన్నెలద్దుతూ_జాబిలితో రాయబారం
5. వన మయూరి విహారానికి_వసంత యామిని స్వాగతాలు

17, సెప్టెంబర్ 2015, గురువారం

ఏక్ తారలు...!!

1. వీడని బంధమే మనది_ముల్లోకాల సాక్షిగా
2. తారాచంద్రుల సమక్షంలో_కలయికకే కొత్త అర్ధాలు చెప్తూ
3. మృత్యువుదే ఓటమి_మరణంలో సైతం మనలను విడదీయ లేక
4. నీ నవ్వుల్లోని సిగ్గుల దొంతర్లను దొంగిలించింనందుకేమో_జాబిలికి ఆ వన్నెలు
5. అక్షరాల్లో ఒలికిన భావాలు ఒల్లకుంటాయా_చుట్టమై చేరి చుట్టుముట్టేయవూ
6. సూదంటురాయిలా చురుక్కుమంటున్నాయి_మౌనమైన నీ మది భావనలు
7. నీకు మనసిచ్చా_నైరాశ్యానికి సెలవింక
8. కాలంతో క్షణాల పోటి_సెలవుకు నెలవు లేకుండా నిరంతరం నీ ధ్యానంలో
9. ఆలోచనలు శూన్యానికి చుట్టమైపోయాయి_మనసు (సం)ఘర్షణకు తావులేకుండా
10. మనసూ మారకద్రవ్యమే_ప్రేమను కొలిచే సాధనంగా మారి
11.  అష్ట సఖులు మన చెలిమిలో_ఇష్ట సఖులై ఇష్టంగా

14, సెప్టెంబర్ 2015, సోమవారం

ఓ చిరునవ్వు....!!

ఎనకిటికేనాడో మనకన్నా సీనియరును...  మళ్లీ పరీక్ష పోయిందని పలకరించిన పాపానికి, ఏమి తెలియని ఆ అమాయకత్వానికి ప్రేమ అని పేరు పెట్టి చామంతులు విసిరిన ఆ క్షణాలు గుర్తు వస్తే ఓ చిరునవ్వు రాకుండా ఉంటుందా చెప్పండి -:)... తరువాత వాళ్ళకు క్లాసు తీసుకోవడం అన్నది వేరే సంగతి అనుకోండి...
జ్ఞాపకం గుర్తు వస్తే మోనాలిసా నవ్వులా ఉండాలి కాని గాయమై వేదించ కూడదు... నిరంకుశత్వానికి చిరునామాగా మిగిలే ఏ సంఘటనా ఓ చక్కని జ్ఞాపకం కాలేదు.. ఇష్టం, ప్రేమ రెండు వైపులా ఉండాలి.. అంతే కాని బలవంతంగా తీసుకునేది ప్రేమ కాదు... " ఎక్కడ ఉన్నా ఏమైనా నీ సుఖమే నే కోరుతున్నా" అన్న త్యాగం ఉండాలండి ప్రేమలో ఉన్న ఇష్టానికి... అవునంటారా... కాదంటారా...!!

13, సెప్టెంబర్ 2015, ఆదివారం

ఏక్ తారలు....!!

1. వెన్నెల వగలు పోతోంది_చిరునవ్వుల నయగారాలకు
2. వాలు చూపులకు వల విసిరింది_పదాల భావాలకు బందీగా మారి
3. ఏక్ తార ఒకటైనా_భావాల వర్షమే నిరంతరం
4. వలలు వేస్తున్నా_వలపై వచ్చి వాలతావని
5. వేణువుకు జన్మనివ్వడానికి_వెదురు పురిటి నెప్పుల రాగాలు
6. అక్షరాలకెంత ఆనందమో_భావాలలో ఒదుగుతున్నందుకు
7. సూదంటు రాయిలా నీ ఆకర్షణ_సుతిమెత్తగా తాకినందుకేమో
8. ఏకాంతానికి సెలవంది_ఏక్ తారగా నా మదిని దోచిన భావాల ఝురి
9. ఏక్ తార_ఎదను పరిచే అక్షర సితారగా
10. ఆ పలకరింపే_దూరానికి దగ్గరకు ఉన్న తేడా తెలుపుతూ

9, సెప్టెంబర్ 2015, బుధవారం

ఏక్ తారలు...!!

1. తారలెన్నయినా_ఏక్ తారలదే తారాపధం
2. ఏక్ తారలతో వైద్యం_నవ్వుల సందళ్ళు నట్టింట
3. వందనాలకు వంగని వైనం_ఆత్మీయతకు తలొగ్గుతూ
4. కవ్వింతలే తారలన్నీ_కలల వాకిళ్ళకు తలుపులు తెరుస్తూ 
5. ఏక్ తారలో గీతా సారాన్ని చూపాలనేమో_అష్టమిన అవతరించింది
6.వలపుల వల్లరులే_తారల సింగారాల నయగారాల్లో
7. అల్లరి పరవళ్ళ ఆటలు_ ఆనందాల సరి జోడిగా ఏక్ తారా సందడిలో
8. పదిలపరచుకున్నాను అనుబంధాన్ని_పది జన్మలకు తోడుగా
9. జ్ఞాపకాల తడి తడిమింది_స్నేహానికి చేరువగా చేయి అందిస్తూ
10. అమాయకత్వంలో ఆహ్లాదం_విడువలేని పసితనపు ఛాయలు
11. నయగారాల నెలవులు_నాలుగేళ్ల సంబరాల ఏక్ తారల అందాలు
12. స్వరాలు ఏడైనా_'సు'స్వరాల సంగమం ఏక్ తారల పుట్టిల్లు
13. ఏక్ తారగా పుట్టినా_ఎల్లలు లేని తారా పధాలు ఈ ఏక్ తారలు
14. వాణీ వీణా నాదాలు_ఆస్వాదించే మనసుల పద సితారలు
15. అక్షరాలే ఆభరణాలు_భావాలకు మెరుగులు అద్దుతూ
16. ఊహల వాస్తవమే_ఏక్ తారా అందాల ఆకృతి
17. పసిడి మొహం చాటేసింది_ఏక్ తారల మేని మెరుపుకు వెరచి
18. ఎందరెదిగినా_తల్లి వేరు ఒక్కటే ఏక్ తారగా

5, సెప్టెంబర్ 2015, శనివారం

ఈ జీవితం మొదలయింది....!!

ఖాళీ ఐపోయింది ఎక్కడో
మెదడు పొరల్లోనో, మనసు అరల్లోనో
మొదలైన శూన్యం ఆగలేనంటూ
భావాలను తాకినందుకేనేమో...
అక్షరాలు అస్త్ర సన్యాసం స్వీకరిస్తూ
జ్ఞాపకాలను దారి మళ్లిస్తూ
అనంతానికి చేరువగా చేరిన కలలు
చీకటికి చోటిచ్చి వెలుగుపూలను వెలివేసి
 కాలానికి సంకెళ్ళు వేస్తూ...
నిశబ్దానికి మాటలు నేర్పాలని
ఏకాంతానికి మనసును ఒప్పచెప్తూ
ఒంటరితనానికి రాజీనామా చేసే
ప్రయత్నానికి చెలిమి సవ్వడిని
పరిచయించే అడుగుల తడబాటును
నింపడానికి ఈ జీవితం మొదలయింది....!!

గురుపూజాదినోత్సవ శుభాకాంక్షలు...

జీవితంలో తొలి గురువు అమ్మతో మొదలై నడతను నేర్పిన నాన్న, చదువుతో పాటుగా లోకజ్ఞానాన్ని నేర్పిన ఎందఱో గురువులకు నా వందనాలు... డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణమూర్తి గారి పుట్టినరోజును గుర్తు చేసుకుంటూ ...
అందరికి గురుపూజాదినోత్సవ శుభాకాంక్షలు...

2, సెప్టెంబర్ 2015, బుధవారం

అందరు సత్య హరిశ్చంద్రులే....!!

నేస్తం,
            పలకరింతలు లేకుండా విషయానికి వస్తున్నా.... నాకెందుకో నేను నాకే నచ్చడం లేదు ఈమధ్యన... ఎక్కడో విన్నట్టు గుర్తు... " తనని తాను ఇష్టపడలేని వాడు ఎదుటివారిని కూడా ఇష్టపడలేడు " అని... నిజమేనేమో కదా ఈ మాట... మనం మాత్రం దాచుకోవాలి ... ఇతరులవి అన్ని మనకు తెలియాలి అనుకోవడం ఎంత వరకు సమంజసం..? అందరు మనలాంటి వాళ్ళే కదా... మరి ఎందుకు ఈ ముసుగు వేసుకోవడమో అర్ధం కావడం లేదు ... అందరికి సమస్యలు ఉంటాయి... అందరం చేసేది జీవిత యుద్దమే తప్పదు ఈ బతుకు పోరాటం... కనీసం మనతో మనం కూడా నిజాయితీగా ఉండలేనప్పుడు ఈ బ్రతుకుకే అర్ధం లేదు... వేసుకున్న ముసుగు ఎప్పుడో ఒకసారి జారిపోతుంది.. అప్పుడైనా వాస్తవాన్ని మనం చూడక తప్పదు...
ఆడ మగ మధ్య స్నేహం తప్పు కాదు.. పరిధులు దాటనంత వరకు ఏదైనా బావుంటుంది... ఈ విజాతి దృవాల ఆకర్షణలో పడటానికి, ఎవరి మీదో జాలి పడి, లేదా మాయ మాటల్లో పడి జీవితాలు అధోగతి పాలు  కాకుండా చూసుకుంటే అందరికి మంచిది... మన అన్న వాళ్ళ బాగోగులు పట్టించుకునే క్షణం తీరికైతే ఉండదు కాని పై పై ప్రేమల బాగోగులు మాత్రం ఎంత బాగా కనుక్కుంటామో....మనకి అందరు తెలియాలి కాని మన గురించి ఎవరికీ తెలియ కూడదు అని మన స్నేహాన్ని సైతం దాచేయాలంటే ... మనకున్న స్నేహితులని బట్టే మనం ఏంటో తెలుస్తుంది అని భయమేమో... సమస్య మనదైనప్పుడు  మనమే బాధ్యత తీసుకోవాలి కాని మరొకరి జీవితాన్ని సమస్య లోనికి నెట్టడం సరి కాదు.... నాలుగు కల్ల బొల్లి కబుర్లు చెప్పి నలుగురి జాలిని సంపాదించి బతికేద్దాం అంటే ఎలా కుదురుతుంది... " ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు " అన్నట్టు బయట పెట్టక మానరు.... లేదా బయట పడక మానదు.... అప్పటి వరకు అందరు సత్య హరిశ్చంద్రులే....అందరితో సరే కనీసం మీతో మీరు నటించకుండా ఉండటానికి ప్రయత్నించండి... ఇవి అన్ని చూస్తూ నేను అలా అయిపోతానేమో అన్న భయంతో నాకు నాకు నేను నచ్చడం లేదేమో నేస్తం....!!

ఆంధ్ర రాష్ట్రానికి ఆపన్న హస్తం...!!

విభజనల కష్టాల్లో, నిధుల లేమితో అల్లాడుతున్న ఆంధ్ర రాష్ట్రానికి ఆపన్న హస్తాన్ని అందిస్తున్న మిషన్ అమరావతిలో భాగంగా... శ్రీ పల్లె రఘునాధ్ రెడ్డిని, శ్రీ పరకాల ప్రభాకర్ గారిని కలిసిన ఎమ్ ఎన్ ఆర్ గుప్త గారు
ముఖ్య మంత్రి ఎన్ ఆర్ ఐ లకు ఇచ్చిన పిలుపుకు స్పందించి  2002 లో విజన్  2020 ఫర్ డెవెలప్మెంట్ ఆఫ్ ట్రాన్స్ పోర్టేషన్ సెక్టార్లో సూచనలు అందించి రవాణ శాఖ, మౌలిక సదుపాయాలు, సహజ వనరుల ఉపయోగంతో పలు అభివృద్ధికి బాటలు వేసిన అప్పటి సూచనలకు...అనుసంధానంగా ఇప్పటి అమరావతి రాజధాని నిర్మాణానికి చేయూత, ఆర్ధిక వనరులను అందించడానికి ప్రత్యేక ప్రతిపాదనతో ముందుకు వచ్చి గుప్త గారు మరిన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకు, అభివృద్దికి విదేశాల నుంచి చాలా శ్రమలకు ఓర్చి పలుమార్లురాష్ట్ర నాయకులను, ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు గారిని కలవడానికి రావడం చాలా సంతోషకరమైన విషయం.... అద్భుతమైన ప్రాజెక్ట్ మానేజ్మెంట్ నైపుణ్యంతో విదేశాల్లో పలు అవార్డులు అందుకున్న మన తెలుగు వారైన గుప్త గారి సేవలు వినియోగించుకుని ఆంధ్ర రాజధాని నిర్మాణమే కాకుండా ... రహదారుల నిర్మాణంలోను, సహజ వనరులను ఉపయోగించడంతో ఆర్ధిక ఒనరులు పెంచుకోవడానికి , రాష్ట్రాన్ని సాంకేతిక పరంగా ముందుకు తీసుకు  వెళ్ళడానికి వినియోగించుకోవడానికి మన నాయకులు సంసిద్దత తెలియపరచాలని కోరుకుందాం...!!

1, సెప్టెంబర్ 2015, మంగళవారం

చదువుల కోసం అందించిన చేయూత...!!

గత ఎనిమిది ఏళ్ళుగా మా ఉప్పల రాజ్యలక్ష్మి చారిటబుల్ ట్రష్ట్ చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ సంవత్సరం చదువుల కోసం అందించిన చేయూత.....
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner