16, జులై 2018, సోమవారం

యద్దనపూడి రచనలు స్త్రీ కోణం...!!

        యద్దనపూడి సులోచనారాణి గారి రచనల్లో మనకు ఎక్కువగా కనిపించేవి కుటుంబ సంబంధాలు, ఆప్యాయతలు, ప్రేమలు, అభిమానాలు, సున్నితత్వం, మధ్య తరగతి జీవితాలు, ఆత్మాభిమానాలు, అహంకారాలు ఇలా అన్ని గుణాలను మిళితం చేసి మనకు జీవితపు రంగులను హంగులను చూపించారు. కుటుంబంలో స్త్రీ పాత్రను అన్ని కోణాల్లోనూ తన నవలా నాయికల్లో చూపించారు.
       యద్దనపూడి సులోచనారాణి గారి నవలలు తీసుకుంటే సెక్రెటరీనవలలో మధ్యతరగతి అమ్మాయి ఉద్యోగం చేయడంలో గల అవసరాలు, ఇంటి బాధ్యతలను పంచుకోవడం, యజమానికి, తన క్రింద  చేసే వాళ్ళకి మధ్యన సంబంధ బాంధవ్యాలు ఎలా ఉంటాయన్నది, ఆ అంతస్తుల తారతమ్యాలు, బేధాభిప్రాయాలు, మధ్య తరగతి ఆడపిల్ల ఆత్మాభిమానం ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఆ కాలంలో సినిమాగా కూడా ఎంతటి ఘానా విజయాన్ని సాధించిందో మన అందరికి తెలిసిన విషయమే. నా చిన్నతనంలో నేను చదివిన మొదటి సీరియల్ ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణలో పసితనపు అరమరికలు లేని స్నేహాలు, అలకలు, కోపాలు, ప్రేమలు ఎలా ఉంటాయో, వయసులో అవి ఎలా పరిణితి చెంది కుటుంబ విలువలకు, పెద్దరికాలకు తలను వంచుతాయో చివరికి ముగింపు ఎలా ఉంటుందన్నది యద్దనపూడి గారికి మాత్రమే తెలిసిన మెళుకువ. అందుకే అది సినిమాగా ఎందరి మనస్సులో నిలిచిపోయిందో మన అందరికి తెలుసు. మరో సినిమాగా మారిన నవల అగ్నిపూలు. దీనిలో ఉన్నత కుటుంబంలో స్త్రీ తన కుటుంబాన్ని ఎలా  తీర్చిదిద్దుకుంటుందో, భర్తను సమస్యలు చుట్టుముడితే ఎలా కాపాడుకుంటుందో, అప్పట్లోనే అమెరికాలోని పిల్లల అలవాట్లు, వ్యక్తిత్వాలు ఎలా ఉంటాయన్నది చాలా బాగా చూపించారు. గిరిజా కళ్యాణం మరో నవల. ఇది సినిమాగా  వచ్చింది. దీనిలో మధ్యతరగతి ఆడపిల్లగా ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కోవాలో, బాధ్యతలను నెరవేర్చడం కోసం ఎలా ఆరాటపడుతుందో తెలుస్తుంది.
       మీనారెండు భాగాలుగా వచ్చి సినిమాగా కూడా ఎంతటి విజయం అందుకుందో మరోసారి చెప్పనవసరం లేదు. కీర్తి కిరీటాలు, జీవన తరంగాలు, ఆరాధన ఇలా ఏ నవల తీసుకున్నా మన చుట్టూ ఉన్న కుటుంబాలు, ప్రేమలు, అభిమానాలు, ఆత్మీయతలు, కోపాలు, తాపాలు అన్ని కలిసిన జీవితాల సంతోషాలను, బాధలను వినిపించారు. ఆడపిల్ల ఆత్మగౌరవానికి పెద్దపీట వేశారు. యద్దనపూడి సులోచనారాణి గారి ప్రతి అక్షరంలో ఆడపిల్ల వ్యక్తిత్వం ఎలా ఉండాలన్నది కనిపిస్తుంది. అందరి కలలకు తన అక్షరాలతో ప్రాణం పోసిన అక్షరరాణి ఈ కలల రారాణి యద్దనపూడి సులోచనారాణి అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అందరి మనసులను తన అక్షరాలతో ఊహాప్రపంచంలోనికి పయనింపజేసిన ఈ నవలారాణి మే 21న దివికేగినా తెలుగు నవలా సాహిత్యంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుని మన అందరికి తన అక్షరామృతాన్ని అందించడం మన తెలుగువారు చేసుకున్న అదృష్టం. 

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner