29, జులై 2018, ఆదివారం

నా నేస్తం అక్షరం...!!

నేస్తం,
      ఈమధ్యన కబుర్లు చెప్పి చాలా కాలమైంది కదూ. అక్షరాలతో నాకున్న అనుబంధం ఎంతమంది అభిమానాన్ని అందించిందో తల్చుకుంటే చాలా సంతోషమనిపిస్తుంది. రాజశేఖర్ అన్నయ్య, రాజకుమారి గారు అభిమానంగా పిలిచి చేసిన ఆత్మీయ సత్కారానికి, మరికొందరు అభిమానంగా అందించిన ఆత్మీయతకు మనసు సంతోషంతో పొంగిపోయింది. అంతమంది గొప్పవారి సరసన నాకు స్థానం కల్పించిన రాజశేఖర్ అన్నయ్యకు నా కృతజ్ఞతలు. కొండలరావు అన్నయ్య పాడిన మధుర గీతాలు, హాస్యోక్తులు, భవ్య పాడిన పాటలు, ద్విగళ గాయకులు కుడుపూడి శ్రీధర్ గారు పాడిన పాత కొత్త పాటలు అందరిని అలరించాయి. చక్కని విందు భోజనంతో హాయిగా సాగిన ఆత్మీయ కలయిక అందరికి ఓ చక్కని జ్ఞాపకంగా మిగిలిపోయింది. కొందరు పిల్లలు చేసిన ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. వారి నేపధ్యం తెలిసి చాలా బాధనిపించినా, వారి మనోధైర్యానికి అందరి ప్రశంసలు లభించాయి. అందరు ఉండి, అన్ని ఉండి మనలో చాలామంది ఏదో లేదని బాధ పడిపోతూ ఉంటాం. అలాంటి వారికీ ఈ పిల్లలను చూస్తే కాస్తయినా జ్ఞానోదయమౌతుంది. మీ మాట సాయం చాలు ఏ పనైనా చేయగలమని చెప్పిన వారి పెద్ద మనసుకు, వారి సంస్థ వ్యవస్థాపకులు చనిపోతే చదువుకునే పిల్లలు చదువు మానేసి, ఉద్యోగం చేసేవాళ్ళు అది మానేసి తమ తోటి పిల్లలకు అండగా నిలబడడం, ఆ సంస్థను తమ సొంత ఇంటిలా భావిస్తూ, ఆ పిల్లలను తోడబుట్టినవారిగా చూసుకుంటున్న వారి దొడ్డ మనసు ముందు రక్త సంబంధాలను కూడా దూరం చేసుకుంటున్న మన అహంకారపు తలపొగరు, ఆసరా ఇవ్వని మన చేతగానితనం ఇంకా ఎన్నో ముసుగులు వేసుకున్న మన మనసులు చాలా చిన్నవి. 
     ఈ ప్రపంచంలో డబ్బులతో కొనలేనివి చాలా ఉన్నాయని తెలుసుకోలేని మూర్ఖులు మనలోనే చాలామంది ఉన్నారు. అనుబంధాలను అహంకారంతో దూరం చేసుకుంటూ ఎలిగాకుల్లా మిగిలిపోతూ, వారిని వారే వెలి వేసుకుంటున్నారు. లాజిక్కులు, లా పాయింట్లు ఆడుగుతున్నామని భ్రమ పడుతూ అదే తమ గొప్పదనమని మురిసిపోతున్నారు. మీరు ఒక లాజిక్ మాట్లాడితే ఎదుటివారు పది లాజిక్కులు మాట్లాడగలరు. వయసు మీదబడినా అణగని అహంకారం మీ వ్యక్తిత్వమని మురిసిపోతుంటే నవ్వాలో, ఏడవాలో తెలియని పరిస్థితి. కనీసం కాస్తయినా ఇంగిత జ్ఞానం లేకుండా ఇలాంటి వాళ్ళందరూ భావి భారత పౌరులను తీర్చిదిద్దేస్తున్నారు మరి. ఇది ఇప్పటి మన తలరాత.
     నా నేస్తం అక్షరం. నా ఆలోచనలు, అభిప్రాయాలు, నా భావాలు ఇలా నాకనిపించింది ప్రతిదీ రాయాలనిపించినప్పుడు మాత్రమే రాస్తాను. భావుకతను భావుకతలా చూడండి. వ్యక్తిగతమని రంగులు పులమకండి. మీకోసమేనని కానీ, నా వ్యక్తిగతమని కానీ భావించవద్దు. నా గోడ మీద నాకనిపించింది రాసుకునే స్వేచ్ఛ నాకుందని భావిస్తున్నాను. ప్రతిదానికీ కోడిగుడ్డు మీద ఈకలు పీకవద్దని నా మనవి. నా రాతలు నచ్చనివారు నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చు. చాటింగులు, చట్టుబండలు అంటూ నన్ను విసిగించవద్దు. ఎదుటివాళ్ళ విషయాల్లోకి తల దూర్చకుండా  మన పని మనం చేసుకుంటే అందరికి మంచిది. అర్ధం చేసుకుంటాని భావిస్తూ... 

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner