29, జులై 2018, ఆదివారం

అర్ధం కాని లెక్కలు..!!

అరువు తెచ్చుకున్న నవ్వులన్నీ
వెలవెలబోతూ వలసబోతున్నాయి

బాధ్యతల బరువుతో బంధాలన్నీ
భారంగా బతుకుబండిని లాగుతున్నాయి

నిన్నల్లో కోల్పోయిన నిధులన్నీ
రేపటికి జ్ఞాపకాలుగా మారుతున్నాయి

వదలక వెంటబడుతున్న వెతలన్నీ
ఆదరించే ఓదార్పుకై వెదుకుతున్నాయి

ఆకారం లేని అర్ధనగ్నపు గీతలన్నీ
ఉనికి కోసం పాకులాడుతున్నాయి

అనులోమ విలోమపాతాలన్నీ
అర్ధం కాని లెక్కలుగానే మిగిలిపోతున్నాయి...!!


నా నేస్తం అక్షరం...!!

నేస్తం,
      ఈమధ్యన కబుర్లు చెప్పి చాలా కాలమైంది కదూ. అక్షరాలతో నాకున్న అనుబంధం ఎంతమంది అభిమానాన్ని అందించిందో తల్చుకుంటే చాలా సంతోషమనిపిస్తుంది. రాజశేఖర్ అన్నయ్య, రాజకుమారి గారు అభిమానంగా పిలిచి చేసిన ఆత్మీయ సత్కారానికి, మరికొందరు అభిమానంగా అందించిన ఆత్మీయతకు మనసు సంతోషంతో పొంగిపోయింది. అంతమంది గొప్పవారి సరసన నాకు స్థానం కల్పించిన రాజశేఖర్ అన్నయ్యకు నా కృతజ్ఞతలు. కొండలరావు అన్నయ్య పాడిన మధుర గీతాలు, హాస్యోక్తులు, భవ్య పాడిన పాటలు, ద్విగళ గాయకులు కుడుపూడి శ్రీధర్ గారు పాడిన పాత కొత్త పాటలు అందరిని అలరించాయి. చక్కని విందు భోజనంతో హాయిగా సాగిన ఆత్మీయ కలయిక అందరికి ఓ చక్కని జ్ఞాపకంగా మిగిలిపోయింది. కొందరు పిల్లలు చేసిన ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. వారి నేపధ్యం తెలిసి చాలా బాధనిపించినా, వారి మనోధైర్యానికి అందరి ప్రశంసలు లభించాయి. అందరు ఉండి, అన్ని ఉండి మనలో చాలామంది ఏదో లేదని బాధ పడిపోతూ ఉంటాం. అలాంటి వారికీ ఈ పిల్లలను చూస్తే కాస్తయినా జ్ఞానోదయమౌతుంది. మీ మాట సాయం చాలు ఏ పనైనా చేయగలమని చెప్పిన వారి పెద్ద మనసుకు, వారి సంస్థ వ్యవస్థాపకులు చనిపోతే చదువుకునే పిల్లలు చదువు మానేసి, ఉద్యోగం చేసేవాళ్ళు అది మానేసి తమ తోటి పిల్లలకు అండగా నిలబడడం, ఆ సంస్థను తమ సొంత ఇంటిలా భావిస్తూ, ఆ పిల్లలను తోడబుట్టినవారిగా చూసుకుంటున్న వారి దొడ్డ మనసు ముందు రక్త సంబంధాలను కూడా దూరం చేసుకుంటున్న మన అహంకారపు తలపొగరు, ఆసరా ఇవ్వని మన చేతగానితనం ఇంకా ఎన్నో ముసుగులు వేసుకున్న మన మనసులు చాలా చిన్నవి. 
     ఈ ప్రపంచంలో డబ్బులతో కొనలేనివి చాలా ఉన్నాయని తెలుసుకోలేని మూర్ఖులు మనలోనే చాలామంది ఉన్నారు. అనుబంధాలను అహంకారంతో దూరం చేసుకుంటూ ఎలిగాకుల్లా మిగిలిపోతూ, వారిని వారే వెలి వేసుకుంటున్నారు. లాజిక్కులు, లా పాయింట్లు ఆడుగుతున్నామని భ్రమ పడుతూ అదే తమ గొప్పదనమని మురిసిపోతున్నారు. మీరు ఒక లాజిక్ మాట్లాడితే ఎదుటివారు పది లాజిక్కులు మాట్లాడగలరు. వయసు మీదబడినా అణగని అహంకారం మీ వ్యక్తిత్వమని మురిసిపోతుంటే నవ్వాలో, ఏడవాలో తెలియని పరిస్థితి. కనీసం కాస్తయినా ఇంగిత జ్ఞానం లేకుండా ఇలాంటి వాళ్ళందరూ భావి భారత పౌరులను తీర్చిదిద్దేస్తున్నారు మరి. ఇది ఇప్పటి మన తలరాత.
     నా నేస్తం అక్షరం. నా ఆలోచనలు, అభిప్రాయాలు, నా భావాలు ఇలా నాకనిపించింది ప్రతిదీ రాయాలనిపించినప్పుడు మాత్రమే రాస్తాను. భావుకతను భావుకతలా చూడండి. వ్యక్తిగతమని రంగులు పులమకండి. మీకోసమేనని కానీ, నా వ్యక్తిగతమని కానీ భావించవద్దు. నా గోడ మీద నాకనిపించింది రాసుకునే స్వేచ్ఛ నాకుందని భావిస్తున్నాను. ప్రతిదానికీ కోడిగుడ్డు మీద ఈకలు పీకవద్దని నా మనవి. నా రాతలు నచ్చనివారు నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చు. చాటింగులు, చట్టుబండలు అంటూ నన్ను విసిగించవద్దు. ఎదుటివాళ్ళ విషయాల్లోకి తల దూర్చకుండా  మన పని మనం చేసుకుంటే అందరికి మంచిది. అర్ధం చేసుకుంటాని భావిస్తూ... 

27, జులై 2018, శుక్రవారం

ముగింపు...!!

చెదిరిపోయిన నవ్వులన్నీ
శాశ్వత వీడ్కోలు
తీసుకుంటున్నాయి

రాలిపోయిన కలలన్నీ
గాలివాటుకి కొట్టుకుపోయి
చెల్లాచెదురౌతున్నాయి

బయటపడని దుఃఖాలన్నీ
లోలోనే మనసుని
అతలాకుతలం చేస్తున్నాయి

వేకువెరుగని రాతిరులన్నీ
చీకటి దుప్పటిలో
సేదదీరుతున్నాయి

అందని అదృష్టాలన్నీ
మళ్ళి మళ్ళి రాలేమంటూ
అలక పానుపునెక్కుతున్నాయి

ముగింపు లేని జీవితాలన్నీ
వాస్తవాలకు భ్రమలకు మధ్యన
నలిగిపోతూనే అంతమైపోతున్నాయి...!!

24, జులై 2018, మంగళవారం

అలనాటి పాట మధురం...!!

 
         తెలుగు సినీ వినీలాకాశంలో పాత కొత్త పాటల్లో కొన్ని ఆణిముత్యాలైతే మరికొన్ని కర్ణకఠోరమైనవి.
సాంఘికమైనా పౌరాణికమైనా పాత తరం పాటల్లో చిత్రానికి తగ్గట్టుగా సన్నివేశానికి అనుకూలంగా అర్ధవంతమైన పాటలు చక్కని సంగీతంతో జత పడి ఉండేవి. ఇప్పటికి ఆ పాత మధురాలు మనలను వీడిపోలేదంటే  అప్పటి పాటల్లో సంగీతం కానీ, సాహిత్యం కానీ మనసులకు దగ్గరగా ఉండేది. ఇప్పటి పాటల్లో ఎక్కువగా సంగీతమే సాహిత్యాన్ని వినబడనీయకుండా చేస్తోంది.
            అప్పటి పాటల్లో ఏ సినిమా తీసుకున్నా..  ఓ పాతాళభైరవి, మాయాబజార్, జగదేక వీరుని కథ వంటి పౌరాణిక చిత్రాలు, డాక్టర్ చక్రవర్తి, కులగోత్రాలు, గుండమ్మ కథ వంటి సాంఘీక చిత్రాలోని పాటలు సంగీతం కానివ్వండి ఇప్పటికి అజరామరమే అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.  కారణం కథ, కథనం, సన్నివేశాలకు తగ్గట్టుగా పాటల్లో సాహిత్యం కానీ సంగీతం కానీ ఉండేది.

             ఇక మధ్య తరంలో వచ్చిన సినిమా పాటల్లో రాను రాను కాస్త సంగీతం పాలు ఎక్కువగా ఉండటం మొదలైంది. అల్లూరి సీతారామరాజు, భక్త కన్నప్ప, సిరివెన్నెల, నిరీక్షణ, దేవాలయం వంటి ఎన్నో సినిమాల్లో అర్ధవంతమైన సంగీత సాహిత్యాలతో కూడిన పాటలు మనకు వినసొంపుగా ఉండేవి. కొన్ని సంగీత ప్రధానమైన సినిమాలు, శంకరాభరణం, సప్త పది, సాగర సంగమం, స్వాతిముత్యం లాంటి సినిమా పాటలు పాటల ప్రియులకు చక్కని సంగీతంతో పాటు మంచి సాహిత్యంతో కూడిన పాటలను అందించాయి.

           ఇప్పుడు చాలా వరకు పాటలు అర్ధమే కాకుండా టెక్నాలజి అందుబాటులోకి వచ్చి బీట్స్ వినిపించడమే తప్ప పాటలోని సాహిత్యం కనుమరుగై పోతోంది. చాలా పాటలు వివాదాస్పదమౌతున్నాయి. తెలుగు పాటల సాహిత్యంలో ఒకరిని కించపరిచే సంస్కారం ఎక్కువైపోతోంది. ఇలాంటి సాహిత్యాన్ని సినిమాకు పాటలుగా అడిగి  రాయించుకునే దర్శకులదా, ఏదో రకంగా పేరు కోసం అసభ్యకరమైన పదాలతో రాసే పాటల రచయితలదా, అర్ధంలేని సంగీత వాయిద్యాలతో ఊదరగొట్టే సంగీత దర్శకులదా లేక ఇలాంటి సంస్కృతికి తెర తీసి ఆదరిస్తున్న ప్రేక్షకులదా... తప్పు ఎవరిది..?


23, జులై 2018, సోమవారం

వెలుతురు బాకు సమీక్ష...!!

                          సుతిమెత్తగా గుచ్చే సున్నిత బాకు ఈ వెళుతూ బాకు

      సామాజిక అంశాలపై తనదైన శైలిలో చక్కని కథలను రాస్తూ రాయికి నోరొస్తే, కుల వృక్షం అనే రెండు కథల పుస్తకాలను వెలువరించి వెలుతురు బాకు అనే కవితా సంపుటిని అందిస్తున్న పరిచయమక్కర్లేని వనజ వనమాలి బ్లాగర్ తాతినేని వనజ వెలుతురు బాకు కవితా సంపుటి గురించి నాలుగు మాటలు...
      మొదటి కవిత ద్వారాల మాటలో ఇంట్లో ఓ ఆడది అవసరాలకు మాత్రమే ఉండాలనుకునే శతాబ్దాల చరితకు ముగింపు రుధిర ద్వారాల మాటను, దశమ ద్వారమా మాట అంటూ ఎంత నిక్కచ్చితంగా చెప్పారో ఆ వేదనాభరిత హృదయాన్ని మనం ఆ అక్షరాల్లో చూడవచ్చు. కల కల్లలై కవితలో రైతు ఎదురుచూపులను, వెనుకెలుగుతో కవితలో ఒంటరితనపు మది అంతరంగాన్ని, వస్త్రాపహరణమొక సంస్కృతి అంటూ ఇంటా బయటా స్త్రీలపై జరుగుతున్న అరాచకాలను, జాతి, మత, కుల వివక్షలకు తావీయక అధికారులు చేస్తున్న అన్యాయాలను అద్దంలో చూపించారు. వారు వారే కవితలో పర స్త్రీలలో అమ్మ అనాటమి చూడలేని ఎన్నటికీ, ఎప్పటికి మారని వారి వికృత అభిరుచిని ఎండగట్టారు. హాస్టల్ గది కవితలో చదువుల బందిఖానాలో పడి మగ్గుతున్న పిల్లల ఆవేదనను,  అక్షయ శిఖరంలో అమ్ముడౌతున్న అక్షరం ఆక్రోశాన్ని, రహస్య రచయితల(ఘోస్ట్ రైటర్స్) అక్షరపు అమ్మకాలను, అక్షయ అక్షర తూణీరంలో లసంత విక్రమ తుంగే మరణానికి చింతిస్తూ వెలువడిన భావావేశాన్ని, ఆంధీ కవితలో తోలి వలపు ప్రేమ పరిమళపు జ్ఞాపకాన్ని, చిరునామాలో ఎవరేమనుకున్నా తానేమిటో చెప్పిన భావుకత్వాన్ని, దుఃఖం కావాలనిపిస్తుందిలో మనల్ని మనం సేదదీర్చుకోవడానికి కాస్త దుఃఖం కావాలనిపిస్తుందంటారు ప్రేమగా. దేహాన్ని కప్పండి కవితలో కాసుల కోసం సినిమాయాజాలం చేస్తున్న అంగాంగ ప్రదర్శనను, దానికి కారణమైన కళాకారుల కుటుంబ గతులను సవివరంగా చూపించారు. నాకో మనిషి కావాలిలో అనుభూతులను, అవసరాలను పంచుకోవడానికి మనిషి ఆకాశంలో చందమామయినప్పుడు ఇలా మాటై, మనసై అక్షరంలో చేరానంటారు. నిశ్శబ్ద సంగీతంలో జీవిత సంగీతాన్ని, నదీ వియోగ గీతంలో మనసు నది అంతరించి పోతున్న జీవ నదులలు, తరిగిపోతున్న జీతపు విలువలకు అన్వయిస్తూ ఆలపిస్తున్న అంతర్లీన గీతాన్ని వినిపించారు. ఈ కవితా సంపుటి పేరైన వెలుతురూ బాకు కవితలో మానసిక చీకట్లను రూపుమాపడానికి రహస్య ఖార్ఖానాలో తయారు చేసుకున్న వెలుతుబాకుతో  దండయాత్ర చేద్దామంటారు. సాయం చేయడానికి చేతులు కావాలిలో పరాయి దేశాలు పట్టిపోయిన మన వారసత్వాలకు బలై పోతున్న ఎన్నో మనసుల మానసిక సంఘర్షణ ఈ కవిత తేటతెల్లం చేస్తుంది. మట్టి, మనసు ఒకటేనంటారు సౌందర్య పిపాస కవితలో. హాలికుడా కవితలో హరితం కాలేని రైతు బతుకు ఉరికొయ్యకు వేలాడుతోందని వేదనగా వందనాలంటారు. ఎవరి కోసం ఆగని కాలంతో కలసి కలం కవితలో పగురులు తీస్తారు. పులిస్వారీలో ప్రేమని ఓ ద్రవంగా చెప్తూ వయసుకి వణుకు వచ్చినా , మనసుకి జ్వరం వస్తూనే ఉంటుందంటూ ఆ అయోమయంలో ప్రయాణ ప్రమాదం, ప్రమాద ప్రయాణానికి తేడా తెలియడం లేదంటారు. ఎవరన్నారు రాయడం లేదని, అక్షరాత్మ ఆశ్లేషం, డైరీలో కొన్ని పేజీలు, నీటిపై ప్రయాణం, మామ కబుర్లు, మనలేని మనం, హృదయాన్ని ఊరడిల్లనీయీ వంటి కవితల్లో సున్నితత్వంతోపాటు తన మనసు అంతరాళంలో తచ్చాడే భావాలను, వేదనలను వినిపిస్తారు. నాగలి విధ్వంసం, నువ్వు  వదిలేసిన కాడితో కవితల్లో ఓ ఇంటి రైతు మరణాన్ని, ఆ తరువాత ఆ ఇంటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు ఓ కొత్త దృక్కోణంలో.అంతేగా.., పూల కథ, బరువు మేఘం, దింపేయగా రాలేవా, ఏమడిగాను నిన్ను, ఎప్పుడో ఒకప్పుడు, అతిధి వంటి కవితలు కళాత్మకంగా సుకుమారంగా ఓ మగువ మనసుని ఆవిష్కరిస్తాయి. అవయవ దానం కవిత మహిళలపై జరుగుతున్న దాడులకు తన నిరసన గళాన్ని విన్నూత్నంగా చాలా నిక్కచ్చిగా వినిపించడం అభినందనీయం. చెక్కేసిన వాక్యం కవితలో లైఫ్ ఈజ్ బ్లండెడ్ విత్ కిచెన్ అంటూ వంటింటికి అంకితమైపోయిన స్త్రీ జీవితం ఎప్పటికి మారని నిర్వచనమని, ఎప్పుడో చెక్కేసిన వాక్యమని అంటారు. రమ్మంటే రాదు, రాలుటాకు స్వగతం, అలవాటుగా, హాంగోవర్, అమ్మ మనసులో ఓ మాట, అమ్మ చేతి గాజులు, నా కెరుకగాని ప్రేమభాష, జీవితకథ, జారిపోయినరోజు, జీవితాన్వేషణ మొదలైన కవితల్లో ప్రేమ రాహిత్యం, అమ్మ మనసు, స్త్రీ సున్నిత హృదయం మనకు కనిపిస్తాయి. దేహక్రిడాలో తెగిన సగం, గోడలు, గాయం - వేల సందర్భాలు, నా ఏకాంతంలో నేను, నిరీక్షణ, నేను సరస్సుని, శపిస్తున్నా, ఒక మౌనం వెనుక, కన్నీటికి స్వేచ్ఛ, వంటి కవితలు ఆత్మీయత కోసం ఓ స్త్రీ మది పడే తపన కనిపిస్తుంది. తాళం చెవి, ఉనికి, ఇంటిపేరు, ఖాళీ సంచి, అయామ్ ఆల్వేజ్ ఏ లూజర్,ఆధునిక మహిళ వంటి కవితల్లో భావావేశం తీవ్రత తనకి ఏం కావాలో, ఎలా కావాలో చెప్పడంలో ఎవరి చెప్పని విధంగా చెప్పడంలో అద్భుత ప్రతిభ గోచరిస్తుంది. ప్యాసా దిల్, రూపకశ్రేణి, ఆకాశాన సగం మనం వంటి కవితల్లో సమానత్వాన్ని కాంక్షిస్తారు. మూడో మనిషి, రాత్రి ఓ అంతరంగ రహస్యం, నాల్గింట మగనాలి, నీడసత్యం - శివం -  సుందరం వంటి తనని తాను వ్యక్తపరుచుకోవంలో ఓ నిజాయితీతో కూడిన నిబద్దత ప్రతి కవితలోని కనిపిస్తుంది. తిరిగొచ్చిన ఇంద్రధనుస్సు కవిత హాయిగా మనలని ఓ పిల్లతెమ్మెర తాకినట్లు ఉంటుంది. పునీత కవితలో గాయాల అంతర్వేదన గాయపడిన స్త్రీకి కొత్త కాదని వేరొకరు గీసిన గీతని మార్చేసి సరికొత్త గీతాగానంగా చరిత్రలో నిలిచిపొమ్మంటారు. బిచ్చటపు ఎద కవిత ప్రేమ రాహిత్యంలో కొట్టుకుపోతున్న జీవితాలకు విశ్వ రహస్యమైన ప్రేమను అరువుగా ఇమ్మని విశ్వాత్మను అర్ధించడం ఈ కవితా సంపుటికి అందమైన ముగింపుగా మారింది.
     మన సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, అకృత్యాలను, వింత పోకడలను, స్త్రీ సమస్యలను, రైతు సమస్యలను, సామాజిక లోటుపాట్లను ఇలా ప్రతి కోణాన్ని పరిశీలించి విభిన్న భావావేశంతో తనదైన శైలిలో నిజాయితీ నిండిన మనసుతో సున్నితంగా కొన్ని అంశాలను, కోపంగా మరికొన్నిటిని, ఆవేశంగా కొన్ని అక్షర భావాలను బాకులుగా మార్చి వెన్నెలను కూడా మండే అగ్ని కణాలుగా వర్షింపజేయడం ఒక్క వనజ తాతినేనికే చెల్లింది. చక్కని సామజిక, నైతిక అంశాలతో కూడిన ఈ " వెలుతురు బాకు " కవితా సంపుటి అందరిని అలరిస్తుంది అనడంలో ఎట్టి సందేహమూ లేదు. చక్కని, చిక్కని కవిత్వాన్ని అందించిన వనజ తాతినేని శుభాభినందనలు.

21, జులై 2018, శనివారం

ఎంత దూరమెా...!!

అనుబంధాలను అల్లరిపాలు చేసి
ఆత్మీయతను అణగదొక్కేస్తూ
అడ్డదిడ్డపు అడుగుల ఆసరాతో
అహంకారంతో బతికేస్తూ

కోరివచ్చిన బంధాలను
కాలరాయడానికి ప్రయత్నిస్తూ
కన్నబిడ్డల కన్నీళ్ళకు కారణమౌతూ
రక్త సంబంధాల రాతలు చెరిపేస్తూ

రాజకీయపు రాక్షసక్రీడను
వేలిముద్రల భాగోతాన్ని
ముసుగు వేసుకున్న మృగత్వాన్ని
నయవంచనల నటనత్వాన్ని దాచేస్తూ

ఘరానాగా బతికేస్తున్నామన్న
భ్రమలో పడిన ఊసరవెల్లుల
వంకరబుద్దిని బయటపెట్టే రోజు
ఎంత దూరమెా తెలియకుంది...!!

16, జులై 2018, సోమవారం

యద్దనపూడి రచనలు స్త్రీ కోణం...!!

        యద్దనపూడి సులోచనారాణి గారి రచనల్లో మనకు ఎక్కువగా కనిపించేవి కుటుంబ సంబంధాలు, ఆప్యాయతలు, ప్రేమలు, అభిమానాలు, సున్నితత్వం, మధ్య తరగతి జీవితాలు, ఆత్మాభిమానాలు, అహంకారాలు ఇలా అన్ని గుణాలను మిళితం చేసి మనకు జీవితపు రంగులను హంగులను చూపించారు. కుటుంబంలో స్త్రీ పాత్రను అన్ని కోణాల్లోనూ తన నవలా నాయికల్లో చూపించారు.
       యద్దనపూడి సులోచనారాణి గారి నవలలు తీసుకుంటే సెక్రెటరీనవలలో మధ్యతరగతి అమ్మాయి ఉద్యోగం చేయడంలో గల అవసరాలు, ఇంటి బాధ్యతలను పంచుకోవడం, యజమానికి, తన క్రింద  చేసే వాళ్ళకి మధ్యన సంబంధ బాంధవ్యాలు ఎలా ఉంటాయన్నది, ఆ అంతస్తుల తారతమ్యాలు, బేధాభిప్రాయాలు, మధ్య తరగతి ఆడపిల్ల ఆత్మాభిమానం ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఆ కాలంలో సినిమాగా కూడా ఎంతటి ఘానా విజయాన్ని సాధించిందో మన అందరికి తెలిసిన విషయమే. నా చిన్నతనంలో నేను చదివిన మొదటి సీరియల్ ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణలో పసితనపు అరమరికలు లేని స్నేహాలు, అలకలు, కోపాలు, ప్రేమలు ఎలా ఉంటాయో, వయసులో అవి ఎలా పరిణితి చెంది కుటుంబ విలువలకు, పెద్దరికాలకు తలను వంచుతాయో చివరికి ముగింపు ఎలా ఉంటుందన్నది యద్దనపూడి గారికి మాత్రమే తెలిసిన మెళుకువ. అందుకే అది సినిమాగా ఎందరి మనస్సులో నిలిచిపోయిందో మన అందరికి తెలుసు. మరో సినిమాగా మారిన నవల అగ్నిపూలు. దీనిలో ఉన్నత కుటుంబంలో స్త్రీ తన కుటుంబాన్ని ఎలా  తీర్చిదిద్దుకుంటుందో, భర్తను సమస్యలు చుట్టుముడితే ఎలా కాపాడుకుంటుందో, అప్పట్లోనే అమెరికాలోని పిల్లల అలవాట్లు, వ్యక్తిత్వాలు ఎలా ఉంటాయన్నది చాలా బాగా చూపించారు. గిరిజా కళ్యాణం మరో నవల. ఇది సినిమాగా  వచ్చింది. దీనిలో మధ్యతరగతి ఆడపిల్లగా ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కోవాలో, బాధ్యతలను నెరవేర్చడం కోసం ఎలా ఆరాటపడుతుందో తెలుస్తుంది.
       మీనారెండు భాగాలుగా వచ్చి సినిమాగా కూడా ఎంతటి విజయం అందుకుందో మరోసారి చెప్పనవసరం లేదు. కీర్తి కిరీటాలు, జీవన తరంగాలు, ఆరాధన ఇలా ఏ నవల తీసుకున్నా మన చుట్టూ ఉన్న కుటుంబాలు, ప్రేమలు, అభిమానాలు, ఆత్మీయతలు, కోపాలు, తాపాలు అన్ని కలిసిన జీవితాల సంతోషాలను, బాధలను వినిపించారు. ఆడపిల్ల ఆత్మగౌరవానికి పెద్దపీట వేశారు. యద్దనపూడి సులోచనారాణి గారి ప్రతి అక్షరంలో ఆడపిల్ల వ్యక్తిత్వం ఎలా ఉండాలన్నది కనిపిస్తుంది. అందరి కలలకు తన అక్షరాలతో ప్రాణం పోసిన అక్షరరాణి ఈ కలల రారాణి యద్దనపూడి సులోచనారాణి అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అందరి మనసులను తన అక్షరాలతో ఊహాప్రపంచంలోనికి పయనింపజేసిన ఈ నవలారాణి మే 21న దివికేగినా తెలుగు నవలా సాహిత్యంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుని మన అందరికి తన అక్షరామృతాన్ని అందించడం మన తెలుగువారు చేసుకున్న అదృష్టం. 

11, జులై 2018, బుధవారం

ద్విపదలు...!!

1.  నా జీవితమే నువ్వు
జీవనదిలా మారి నా అక్షరాల్లో నిరంతరం ప్రవహిస్తూ....!!

2.  నా ఆస్వాదనలే నీవు
విడివడని భావాలకు జత చేరిన అక్షరాలుగా మారతూ..!!

3.  వలచి వచ్చిందో చెలిమి
వలసపోయే జ్ఞాపకాలను వెంటేసుకుని...!!

4.  మనసుని పరికిస్తున్న క్షణాలివి
మౌనానికి మాటల అలంకారాలద్దేస్తూ...!!

5.  కథ ముగిసింది
కల జీవితమని తెలిసే సరికి...!!

6.  మనసును మాలిమి చేసుకున్న జ్ఞాపకం
కాలానికి చిక్కని పరిమళపు గుభాళింపుతో..!!

7.  కల్లలేగా చెంతనుంది
కలలన్నీ వీగిపోయాక...!!

8.   అమ్మ బడిలో నేర్చుకున్నందుకేమెా
అక్షరానికింత ఆప్యాయత నేనంటే...!!

9.   వెన్నెలంతా నవ్వుల్లో ఒలికింది
కవితాక్షరాలన్ని మది సిరాలో ముంచి రాయాలని అనుకుంటే...!!

10.  బంధమై చేరినందుకేమెా
బాధ్యతగా మిగిలిపోయాను...!!

11.  గతజన్మ పరిమళమనుకుంటా
జన్మలోనూ వదలక వెన్నాడుతోంది...!!

12.  మెాహం సమ్మెాహనమైంది
స్నేహ పరిమళమై చెంత చేరుతుంటే...!!

13.  మదిగమకాలు స్వరాలు ఆలపిస్తూ వెంటబడుతోంది
నిశ్శబ్ధ రాగాన్ని పరిచయం చేయడానికేమెా....!!

14.   ఏకాంతం చేరువయ్యింది ఎందుకో
నీ తలపులనందించాలని కాబోలు..!!

15.  కాలమే నాతో ఉండిపోయింది
నిన్ను విడలేని బంధమై....!!

16.   జీవితాన్ని గెలవాలనుకుంటున్నా
ఓడిన మనసుకు ఓదార్పుగా నిలుస్తూ....!!

17.  కవిత్వంలోని జ్ఞాపకమే నీవు
అక్షరాలన్నింటా  భావమై ప్రవహిస్తూ ....!!

18.  తనంతే ఓ జ్ఞాపకం
మదిలో చెదరని మనసాక్షరం...!!

19.  చీకటితోనే సహజీవనం
నీవు లేవన్న భావనకు తావీయక...!!

20.   వశమయ్యింది కాలం
గెలుపోటముల క్షణాలకు...!!

21.   రాగమెుప్పని భావాలైనాయి
అక్షరాలు జతగూడకేమెా...!!

22.   అరవైయ్యారు కళల అవపోశనం
రాధామాధవ రమ్య చరితం....!!

23.   ఆవహించిన చైతన్యమిప్పుడు
నాలోని స్వరం నీదై పలికితే...!!

24.  కలలన్ని తెలిసినదానవు
కల్లలు చేయదగునా... !!

25.   చిరునామా అక్కర్లేని చెలిమి
ఎదలో శాశ్వతంగా నిక్షిప్తమై...!!

26.  భాష మధురం
మనసులను తడుముతున్నందుకనుకుంటా...!!

27.   లెక్కకు రాని క్షణాలేనన్నీ
నీతో కలిసున్నప్పటి కాలానికి....!!

28.  అక్షర సన్యాసమే
కన్నీళ్ళు కరవాలాలై కాపు కాస్తుంటే...!!

29.   తీరని మచ్చట్లకే
ఆ తీపి జ్ఞాపకాల తలపు....!!

30.   మనసుదేముంది మరలిపోతుంది
కాలం పూసే మరపు లేపనంతో....!!

3, జులై 2018, మంగళవారం

గోదావరిలో నా గురించి...!!

మాటలకందని సంతోషమిది..నా రాతలకు ఇంతటి వన్నెనద్దిన వాణి గారికి మనఃపూర్వక కృతజ్ఞతలు... ప్రచురించిన గోదావరి యాజమాన్యానికి, కత్తిమండ ప్రతాప్ గారికి మనఃపూర్వక ధన్యవాదాలు..


మనసున్న కవయిత్రి మంజు మనసు భావాలు అరుదైన అంతర్లోచనాలు.....
మనసు ఎన్నో రకాలుగా మనతో చర్చిస్తుంది. రోజు మొదలయ్యే దగ్గరనుండి వేకువ మేల్కొపేదాకా ఎన్నో అనుభూతులు , అనుభవాలు. నిదురలో కూడా మనసు శాంతిగానో కలల కలవరాలుగానో , కలలే వరాలుగానో మొత్తానికి మనసు అనేది పదిలమైన అనుబంధం.
మనసును గురించి ఇంతలా ఎందుకు చెప్పానంటే భావకవులు ఎక్కువగా మనసుతోనే బంధించ బడి వుంటారు. సమాజం నేర్పిన పాఠాలన్నీ తమ అనుభూతులకు మేళవించి తాత్వికంగా,హృద్యంగా తమ భావాలను అల్లుకుంటారు.
వెలుగు,చీకటులు కాలపు అడుగులను ఆత్మ విశ్వాసపు మెళుకువలుగా సునితంగా గొప్పగా తమ కవిత్వాన్ని అక్షరబద్ధం చేయగలరు.
ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అచ్చం అలాంటి భావాలతో "కబుర్లు కాకరకాయలు" అనే బ్లాగ్ ద్వారా మరియు మంజు యనమదల అనే ముఖపుస్తక ఐడి ద్వారా తన అక్షర ప్రయాణాన్ని సాగిస్తున్న మంజు గురించి కాసిన్ని మాటలు అందరితో పంచుకోవాలనే చిన్న ప్రయత్నమిది.
అలతి పద విన్యాసాలు దుఃఖాలను ఓదార్చుకున్న ఆత్మవిశ్వాసాలు , ఏకాంతానికి ఎడబాటుగా అక్షరాలను నేస్తాలుగా చేసుకుంటూ ఙ్ఞాపకాలతో అనుబంధం కవిత్వమై పరిమళించింది.
గుండెచప్పుడు వేదనగా వినిపించినా కలత కన్నీళ్ళలో సేదతీరుతుంది. వాస్తవాలు వెక్కిరిస్తున్నా ' కలం ' స్నేహంగా వెన్నుతడుతుంది.
స్నేహశీలిగా, హుందాతనానికి ప్రతిరూపంగా మృదువైన పదశైలి ఆమె సొంతం అక్షరాలను అనునయిస్తూ భావాల పంటను పండిస్తారు.
అక్షరాల సాక్షిగా నేనోడిపోలేదంటూ మొదటి పుస్తకంలోనే గెలుపునూ తన సొంతం చేసుకున్నారు.
మౌనం రాల్చిన అక్షరాల్లొ మసకబారిన జ్ఞాపకాలు కదులుతున్న కాలంలో చెరిగిపోని ఆనవాళ్ళు’ ఆమె పేర్చిన అక్షరాలు అంతులేని ఆత్మ విశ్వాసాలు పదాల పొందికలో లోతైన భావాలు.
తన గెలుపుకు అక్షరాలే సాక్ష్య౦ అంటూ కవితా సంపుటి పేరులోనే విజయాన్ని ప్రకటించారు ఇలా ....”అక్షరాల సాక్షిగా ... నేనోడిపోలేదంటు.......”.తొలి పుస్తకం లోనే అందరి మనసుల్లో తన భావాలను నిలబెట్టేస్తూ...
మరో పుస్తకం చెదరని శిధిలాక్షరాలు మంజు లోతైన కవితలు ఇందులో ప్రత్యేకంగా వుంటాయి..
అంతుపట్టని మనసు అంతర్మధనమే శి(థి)లాక్షరాలు. కలానికి సాయంగా మిగిలిన తెల్ల కాగితం చిన్నబోవడం అద్భుతమైన భావుకత. కాలంతో మనసు పోటీ పడి భావాలను నిలువరించలేని ప్రయత్నం. మనుష్యులతో బంధాలు అల్లుకున్నవై మనసును వీడిపోవడం లేదు అక్షరాలు చీకటికి చుట్టాలయ్యాక చెదరని శిల్పాలై వెన్నెల కాంతులు వెలువరిస్తాయని అంటున్నారు.
ఆశలు ఆశయాలు , వాంఛలు వలపులు ,పలుకులు పలుకరింపులు మౌనం మాటలు ఇవే కాదు జీవితమసలే లేకున్నా..ఏదీ నాది కాకున్నా ..న్యాయంగా నిలవాలన్న తపన నాదంటూ ..స్వల్పమైన జీవితానికి అల్పమైన కోరిక ...రెప్పపాటు జీవితంలో స్వప్నంగా మిగలాలని వుందంటున్నారు మంజు.
స్వార్ధం ముసుగుకప్పుకున్న సమాజాన్ని, మారుతున్న మనుష్యుల స్వభావాన్ని, విలువలు దిగజారుతున్న వైనాన్ని అంతర్జాలపు మాయల వైఖరిని నిశ్శబ్దంగానే నిలదీస్తారు.
ఓదార్పు కోల్పోతున్న ఒంటరి జీవితాలు మానవ సంబంధాలకై వెంపర్లాడుతూ వేసారుతున్నాయి . మానవత్వం మనిషితత్వాన్ని కోల్పోయాక ఒంటరి అడుగుకు తోడు దొరకడం కష్టమే.
శిధిల క్షణాలుగా మిగిలిన ఙ్ఞాపకాలు నిశ్శబ్దం నిర్వచించిన భావాలు గుప్పెడు గుండె వెలిబుచ్చిన గాయాల గీతాలు సడి చేయని అక్షరాలు.
బంధాల ఉనికి ఏమార్చుకున్నా శాశ్వతమైన చెలిమి చిరునవ్వు సంతకం చేయిస్తుంది. అలసిపోయిన నిన్నలపై ఆత్మీయస్పర్శగా స్నేహం స్వాంతన నిస్తుంది.
అవసరం కోసం ఆంగ్ల భాషపై మక్కువ పెంచుకోక తప్పలేదు , మాతృప్రేమ మాతృ భూమిపై మమకారం చంపుకోలేని నిస్సహాయత . బ్రతుకుదెరువు సముద్రాలు దాటించినా డాలర్లు బ్రతుకు యుద్ధానికి బాసటగా నిలిచినా ...నాదేశం నా భాష అంటూ మమతను నింపుకోవడం అమ్మప్రేమ లాంటిదే అంతిమం దాకా పురిటిగడ్డను వీడిపోనంటారు తన అనుభవాలు వల్లె వేసుకుంటూ......
కవిత్వమే కాకుండా తన నేస్తాంతో చెప్పే కబుర్లన్ను మనతో చెపుతూ సందడి చేస్తారు ఈ వ్యాసాలన్నీ కూడా ఓ పుస్తకంగా అముద్రిత అక్షరాలంటూ ముద్రించి మన ముందు పెట్టేశారు . మరుగై పోయిన ఉత్తరాల కాలాన్ని ఈ పుస్తకం చదువుతూ గుర్తు చేసుకోవచ్చన్నమాట.
సడిచేయని (అ)ముద్రిత అక్షరాలు ఇలా ఉంటాయి చూడండి.
ఇప్పుడు తన నేస్తంతో చెపుతున్నట్లుగా ...రాసిన లేఖలు అందరినీ తన నేస్తాలుగా పలుకరిస్తూ సాగిన వ్యాసాల పరంపర అందరితొ ముచ్చట్లు చెపుతాయి ...సడి చేెయవు అక్షరాలంటూ ... తన అముద్రిత అక్షరాలను ముంద్రించి సందడి చెయించారు.
స్నేహానికి మంజు ఇచ్చే ప్రాధాన్యత ఈ పుస్తకంలో ముందు పేజీ నుంచే కనిపించింది తన ఈ పుస్తకాన్ని చిన్ననాటి స్నేహితులు " వాసు వేదుల" గారికి అంకితమివ్వడం ఆమె గొప్ప మనసుకు తార్కారణం ..చదువులో పోటి పడ్డ స్నేహితుడు మరణంలో సైతం తానే గెలిచానని స్వర్గంలో వున్న నేెస్తానికి అంకిత మిచ్చారు
నువ్వే చెప్పు ఏం చేయాలో. అంటూ... ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తారు తన నేస్తంతో చెప్పుకున్న ఈ కబుర్లన్నీ ఎవరికీ వారు తమకే చెపుతున్నట్లుగా భావిస్తారు. వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగ పడేలా..చదివితీరాల్సిన సడి చేయని అందమైన అక్షరాలు .
సందేహాలు, సందేశాలు ,సమస్యలు, సమాధానాలు ఇలా కొనసాగిన అక్షర ప్రయాణం.... ఇది
ఇంకా విదేశీ సంస్కృతి మోజులో మనమెంతలా కూరుకు పొయామో కదా ..! ఈ మాటలు అద్దం పడుతున్నాయి.
“ ఇప్పటికి మన మీద గెలుస్తున్నది తెల్లవాడే... మన సంప్రదాయపు పండగల కన్నా మన అందరికి గుర్తుండే పండుగ న్యూ ఇయర్... మనం ఇష్టపడే దుస్తులు జీన్స్... మాతృభాష కన్నా మనకు బాగా వచ్చిన భాష ఇంగ్లీష్...ఈ పదాలు తెలుగులో చెప్పినా అర్ధం కాని వారు ఎందరో.. అందుకే మనం ఎంతగా పరాయితనంపై మక్కువ పెంచుకున్నామో చెప్పడానికే ఈ ఉదాహరణలు...
విశిష్టమైన మన మత గ్రంధాల కన్నా మనకు తెలిసిన ముఖ పుస్తకమే ఎక్కువ ఇష్టం...బానిసత్వం నుంచి విముక్తి ఇచ్చినట్టే ఇచ్చి ఇప్పటికీ పరాయి తత్వానికి బానిసలుగా చేసుకున్న తెల్లవాడే గెలిచాడు మన మీద...”
భగవంతుడినే నిందిస్తున్నాను అనే వ్యాసంలో దేవుడు స్వార్ధపరుడంటు
తొమ్మిది నెలలు అమ్మ కడుపులో ఉంటే అమ్మ కష్టం ఆడదాని విలువ తెలిసేది .. ఉమ్మనీళ్ళు ఎలా ఉంటాయో.. ఆ కష్టం ఏమిటో తెలిసేది.
అహంకారం .. ధన దాహంతో రోజులు బిజీగా గడిచి పోతున్నాయి , నిజమైన అనుబంధాల విలువల రుచి మరిచి పోతున్నాము.నిత్య సంఘర్షణల మధ్య ఆత్మీయస్పర్శను కుడా అనుభవించలేని అంధకారంలో గడిపేస్తున్నాం. చుట్టూ మనుష్యులు వున్నా ఒంటరితనం వెంటే వుంటోంది .
నలుగురితో కలసి గంజితాగినా రుచిగా వుండదా..? ఎన్ని కోట్లు సంపాదించినా అమ్మ పెట్టే ముద్ద కమ్మదనం ముందు దిగదుడుపే కదా...!
అంతిమ ప్రయాణం గురించి చెప్పిన మాటలు ఇలా …
ఒక్క మనం తప్ప అందరు చూడగలరు అది.. ఈ ప్రపంచంతో బంధాలను వదిలించుకుని సాగే ప్రయాణం అదే అంతిమ యానం. జీవితానికి చిట్ట చివరి మజిలీ అని , అప్పటి వరకు మనతో ఉన్నదేది మనతో రాదంటూ మనకిచ్చే కన్నీటి వీడ్కోలు మనం చూడలేనిది, ఆఖరి ప్రయాణపు అంతర్మదానాన్ని జీవి తెలుసుకునే భాష ఇంకా రాలేదు. అంటున్న ఈ మాటలు ఆలోచింప చేస్తాయి.
"కలుషితమైంది పర్యావరణమా!! మనమా...!!"
నిజమే ఆలోచించిల్సిందే ....మానవ సంబంధాలే కలుషితమయ్యాయి ...మనుగడ కావాలనుకున్న మనిషే స్వార్ధాన్ని అందలమెక్కించాడు... ధన దాహంతో మానవత్వాన్నే మంట గలుపుతున్నాడు ....నాలుగు ముక్కల్లో కుండ బద్దలు కొట్టిన ఈ వ్యాసం ఆలోచింప చేస్తుంది.
"ప్రేమ ....పెళ్ళి..."
కన్నవాళ్ళను కన్నీళ్ళు పెట్టించి అన్నీ తుంచుకున్న తమదైనదనుకున్న జీవితం పంచుకునే వారులేని ప్రశ్నార్ధక పయనం కాదా ...ఒక్కసారైనా గుర్తుపెట్టుకోమంటుంది ఈ వ్యాసం...
"సమాధానం తెలియక...."
ఆది అంతాలు తెలియని జీవితం ఆలోచించడం మొదలెట్టాక సందేహంగానే వుంటుంది కదూ... బాధ్యతల నిర్వర్తించడం కోసం ఎదురయ్యే ఆటంకాలను అధిగమిస్తూ జీవన ప్రయాణం సాగిస్తూ వుంటాం అది అందరికీ తప్పని పరిస్దితి.
"ఆత్మహత్యలు ..ఎందుకు ..."
ఏ జీవికీ లేని ఆలోచనా శక్తి మనిషికే సొంతమయ్యింది తమకు తెలిసిన భాషలో మాట్లాడుకునే అవకాశం మనిషికి మాత్రమే సాధ్యమైయింది.
మనకు తెలియక ఎదురయ్యాయో... మనతప్పుకు మనకు ఎదురయ్యే శిక్షనో ...బాధ అనుభవించడం తప్పని పరిస్ధితి సమస్య మొదలయ్యాక సమాధానం దొరక్క పోదు ఆత్మహత్యలు పిరికితనం అన్న ఈ వ్యాసం సంఘర్షణకు స్వాంతన నిస్తుంది
నాకూ ఙ్ఞాపకాల నిండా గాయాలే ఆత్మ విశ్వాసాన్ని మంజు అక్షరాల నుండే నేర్చుకున్నాను
ఇదేగా జీవితం గతం గాయంగా మిగిలిందో ఆత్మీయతలు అద్దుకుందో అంతరంగం మాత్రం జ్ఞాపకాల కావ్యాన్ని రచిస్తోంది చెమరించిన దృశ్యాలన్నీ కావ్యాలై మిగులుతున్నాయి ...
అందరి మనసుల్లో ఆత్మీయంగ మిగిలిపోయిన సిరివెన్నెల గారి పాట మనసు పెట్టి విన్నప్పుడు తమ జీవితాన్ని గుర్తు చెసుకోకుండా వుండలేము ..." జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది సంసార సాగరం నాది సన్యాసం శూన్యం నాది ..." నిజమనుకోక తప్పని నిజం ఇది.
మార్పు కోసం ఎదురుచూస్తూ సాగుతున్న జీవితాన్ని మౌనంగానె మొస్తున్నాం కదూ...ఇవన్ని మంజుమాటలే నేనూ ఇలానే అనుకున్నా .. మీరూ అంతే అనుకుంటారు.
మంజు మనసు ముచ్చటే ఇది కూడా.. కొన్ని పుస్తకాలు చదువుతున్నప్పుడు మన మనసే కనిపిస్తుంది చెమ్మగిల్లిని కన్నులు గుండెను తడుముకుంటాయి .ఊరడించే అక్షరాలూ ఇక్కడె దొరుకుతాయి కాస్తయినా మనసును ప్రక్షాళన చేసుకోవచ్చు ..
స్నేహం గురించో.... , జ్ఞాపకాల నిధుల నుంచో... .అన్నీ తానై మనసుతో పడ్డ సంఘర్షణ. నిజాలు నిక్కచ్చిగా చెపుతూ .. అనునయించే అక్షరాలు ..
మానవతా విలువలు ..అనుబంధాల ఆప్యాయతలు ఇలా ఈ వ్యాసాల పరంపర .
మంజు గారి శైలి ని తన భావ ప్రయాణిన్ని ఆమె పుస్తకాల సంపద నుండి కొన్ని విశ్లేషించాను.
తన స్నేహితురాలితో కలిసి "గుప్పెడు గుండె సవ్వడులు " అనే మరో పుస్తకాన్ని వెలువరించారు. ఇందులోని భావాలలో రెండు గుండె చప్పుళ్ళను లోతుగానే వినవచ్చు.
"అక్షరాల సాక్షిగా నేను ఓడిపోలేదు
సడి చేయని (అ)ముద్రిత అక్షరాలు
చెదరని శి(ధి)లాక్షరాలు
గుప్పెడుగుండె సవ్వడులు"
ఇవి మంజు యనమదల గారు వెలువరించిన పుస్తకాలు.
ముద్రితం కాని ఎన్నో భావాలు పుస్తక రూపంలోకి రావాల్సిన అవసరం వుంది.
మనసు అన్వేషణ మౌనంగా సాగిపొతుంది మనిషి జీవితంలో ఎదుర్కొనే ఒడుదుడుకులు ఎన్నో... అంత:సంఘర్షణ అక్షరీకరించడం అందరూ చెయ్యలేక పోవచ్చు ఒక్కోరిది ఒక్కోరకమైన ప్రయాణం.
సమాజాన్ని తట్టి లేపినా ..జ్ఞాపకాన్ని ఒడిసి పట్టినా అలతి పదాలలో ప్రకటించడం మంజు నేర్పరితనం. తన కవిత్వంలో లోతైన భావాన్ని అలవోకగా అల్లేయడం కనిపిస్తుంది.
"అక్షరానికి ఊపిరి పోసిందేమో జీవితాన్నిచ్చింది
భారమంతా భావమై కురిసిందేమో బ్రతుకు బావుటా ఎగరేసింది
ఓటమికి విజయతిలకం దిద్దేసి వేదనకు వెన్నెలమరకలద్దేసి
కాలానికి కన్నీటిని కానుకగా ఇచ్చి
వేకువను మెలువనుకుని నమ్మకానికి చిరునామాను రచించింది"
చుట్టూ జరిగే అన్యాయాలకు మనసుతోనే యుద్ధం ప్రకటించింది . స్ర్రీ లపై జరుగుతున్న వివక్షలను కలంతోనే నిలదీసింది. మానవతా విలువలు కలగలసిన మనసు కవిత్వం మంజు కవిత్వం.
శోకం శ్లోకంగా మారిపోయింది.. వెంట పడుతున్న గమ్యాన్ని గడపదాటి రావద్దంటూ వెళ్ళగొడుతూనే వుంది.
అక్షరాల ఆలింగనంలో ఆత్శవిశ్వాసాన్ని గెలుచుకుంది చేతన కోల్పోనివ్వక తనువుకు ధైర్యమనే మలాము రాస్తూనే వుంది. నిశీధి చెంతలో నిశ్శబ్దాన్ని అక్షరమై జయించింది . భావాల రాశులు పోస్తూ కవిత్వమై పరిమళించింది.
చెదరని శిలాక్షరాలు ఇవి......
మంజు పుస్తకాల్లోవే నేను ఎంచుకున్నాను ముఖపుస్తకంలో ఎన్నో కవితలు వ్రాశారు. అక్షరానికి అలుపు వుండదు. మానసిక ఉల్లాసానికి కవిత్వం ఒక అవకాశం.
మంజు అలసిపోని అక్షరమై ప్రయాణించాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
..........వాణి కొరటమద్ది, visakhapatnam
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner