ఒక లేఖలో ప్రేమ గురించి చెప్తూ " ప్రేమా ప్రేమించిన ప్రేమను ప్రేమిస్తావట నిజమేనా..!!" అంటూ ప్రేమను ప్రేమగా ప్రశ్నిస్తారు. మరో లేఖలో మనసుతో మాట్లాడుతూ " ఎన్నో ఏళ్లుగా నేస్తాలమైనా మనం మనసు నలిగినా కలిగినా, మాది ఊసులను పంచుకుంటూనే ఉన్నాం కదా" అంటూ తన సహాధ్యాయికి కలిగిన కష్టాన్ని తన మనసుతోనే పంచుకుంటారు. వర్ణికా అంటూ మరో లేఖలో సహజంగా మనిషికుండాల్సిన కాసింత జాలి,దయ, ప్రేమ వంటి లక్షణాలను చెప్తూ, " మాది ముచ్చట్లకు వెలుగునిస్తూ..ఎరుకనై... ఏషనై, ఏర్పునై,ఎలా ఉహల ఎడద నెసపెడుతూ వరమై, పర్వమై ప్రతి అడుగునా అందమైన కంటికి ఇంపైన పచ్చదనమై పరవశమిస్తూ..తమినై, తపమునై..తరణినై.. తలపుల వాక్కునై...." ఇలా మనం మర్చిపోయిన అందమైన తెలుగు పదాలను ఒద్దికైన చిక్కని భావుకత్వంతో నిండి ఉంటుంది.
ఉత్తరం రాయడంలో అంతరార్ధాన్ని అర్ధవంతంగా ఎక్కడ ఏది ఎలా చెప్పాలో అలా చెప్పడం తెలుగు భాషా ప్రావీణ్యురాలు మల్లీశ్వరి గారికి వెన్నతో పెట్టిన విద్య. స్వతహాగా తెలుగు భాషా సాహిత్య ప్రేమికురాలు కావడం వలన ఈమె లేఖలు చదువరులకు అసలు లేఖలు (ఉత్తరాలు) ఎలా ఉండాలి, ఏ ఏ విషయాలు ఎవరికి ఎలా చెప్పాలి, ఎంత వరకు చెప్పాలి అన్నది చక్కగా తెలుసు కనుక ఈ వర్ణిక లేఖా సాహిత్యం పుస్తకంలో మనకు అన్ని మన మనసులోని భావాలుగా అనిపిస్తాయనడంలో అతిశయోక్తి ఏమి లేదు. తెలుగు సాహిత్యంలో కవితలు, గజల్ ప్రక్రియ, పద్యం, లేఖలు, బాల సాహిత్యం ఇలా పలు సాహిత్య ప్రక్రియల్లో అందె వేసిన చేయి. మరుగున పడిపోతున్న పిరము, పద సుధావళి, హవణిక, శరది, కైరవీ రేయి, కౌముది రేయి వంటి ఎన్నో తెలుగు పదాలకు, పేర్లకు మళ్ళీ ఊపిరిని పునః ప్రతిష్ట చేస్తున్న మల్లీశ్వరి గారి తెలుగు భాషాభిమానానికి నేనూ అభిమానినే. సరళమైన భావాలను సున్నితంగా చెప్పడమే కాకుండా సమాజంలో లోపాలపై కూడా తన లేఖలలో సున్నితంగా విసుర్లు విసిరారు. వర్ణిక పేరులోనే ఓ చక్కని అందమైన అర్దానిస్తూ కవిగా వర్ణాలను తన అక్షర భావాలకు అద్ది మన ముందుకు వచ్చిన వర్ణిక అందరి మనసులలో చక్కని భావ పరిమళాలతో నిలిచిపోవాలని కోరుకుంటూ.. నాకు ఈ అవకాశాన్నిచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి