19, ఏప్రిల్ 2025, శనివారం

అక్షర కిరణాలు (నాలుగు మాటలు)..!!

                                  " మది వెలిగించిన జ్యోతులే ఈ అక్షర కిరణాలు "

                తెలుగు సాహిత్యంలో వచన కవిత్వానిదొక ప్రత్యేక స్థానం. ఈ ఆధునిక కాలంలో వచన కవిత్వం విరివిగా రాస్తున్నవాళ్ళు కోకొల్లలు, కాని విమర్శకుల ప్రశంసలు కూడా పొందుతున్న వచన కవిత్వం అరుదనే చెప్పాలి. ఉషశ్రీ రాసిన " అక్షర కిరణాలు " కవిత్వ సంపుటిలోని కవితలను చదువుతుంటే నాకనిపించింది ఈ కవిత్వపు శైలి పలువురి ప్రశంసలు పొందుతుందని. ఓ కవికైనా, రచయితకైనా ఇంతకన్నా కావాల్సింది ఏమి ఉండదు. ఉషశ్రీ వయసు చిన్నదైనా మనసు విశాల భావాల పూపొద అని అక్షర కిరణాల్లోని ప్రతి కవితా, ఆ కవితా పరిమళాలు సుదూర తీరాలకు చేరతాయని నిస్సందేహంగా చెప్పగలను.
                 " రోజులెంతగా మారినా
                    మనుషులెంత ఆధునికులైనా
                    రూపు మారినా
                    ముగ్గులు
                    గత వైభవపు ఆనవాళ్ళుగా
                    కలకాలం మిగిలే ఉంటాయి...!! "
గత వైభవాన్ని తల్చుకోవడమే కాకుండా, ఆనాటి ఆనందాలను, ఆస్వాదనలను వాడుక పదాల్లో కాస్తంత ఆంగ్లాన్ని చేర్చి చక్కగా..ఓ పల్లెటూర్లో ఇంటి ముందు ముగ్గును అందంగా వేయడమనే అలవాటుని మొదటి నుండి చివరి వరకు ఆ దృశ్యాన్ని ఆలా మన కళ్ళ ముందు చూపడం సామాన్య విషయం కాదు.
            డబ్బు గురించి చెప్పినా, చందమామను తల్చుకున్నా, అమ్మను మరుజన్మకు కూడా అమ్మగానే కావాలని వరమడిగినా, వెలకట్టలేని నేస్తం పుస్తకమని చెప్పినా, పల్లె మనసు గుట్టు విప్పినా, మనిషి మార్చే రంగుల మాయను గుర్తుజేసుకున్నా, అనంతమైన ప్రేమకు దక్కిన తిరస్కారాన్ని తెలిపినా ఇలా ప్రతి భావాన్ని తనదైన సరికొత్త శైలి, ఎత్తుగడతో చక్కని అభివ్యక్తితో ఓ శిల్పి శిల్పాన్ని ఎంత శ్రద్ధగా చెక్కుతాడో, అంతకన్నా ఎక్కువ శ్రద్ధతో మనసుపెట్టి రాసిన అక్షర కిరణాలివి.
             ఆశ మనిషిని ఎంత దూరమైనా తీసికెళుతుంది, కాని అధికారం, ఆర్ధికబలం ముందు నిజాయితీకి దక్కేది శూన్యమే అని చెప్పడంలో తనదైన ముద్ర కనిపిస్తుంది. మగువను మహారాణిని చేస్తూ ఆమె పాత్రలను సజీవంగా మన ముందు నిలుపుతుంది. అమ్మను, నాన్నను, అనుబంధాలను, బడి, గుడి, చెట్టుచేమా, సంగీతం, సాహిత్యం, నవ్వులు, బిడ్డల మీద మమకారము, ఇలా ఈ కవితా సంపుటిలోని ప్రతి కవితా విభిన్నమైనదే.
      "  నా జీవనమే మీ జీవితమని చెప్పినా చెవికెక్కని మనుషులగని
          తను కన్నీటి పాయగా మిగిలిపోయింది. "
అతివ కన్నీటి జీవితాన్ని ఇంతకన్నా బాగా ఎవరు చెప్పగలరు.  
            మల్లెలను తల్చుకోవడం, వానను ఆస్వాదించడము, ఏం రాయాలన్న సందిగ్ధాన్ని, సమాజంలోని అసమానతలను, లోపాలను, మనుషులు కోల్పోతున్న సున్నితత్వాన్ని, మానవత్వాన్ని, నిరీక్షణలో వేదనను, ధిక్కారస్వరాన్ని, ఎన్నెన్నో పాఠాలను, ఏ దేవుడు చెప్పినా విశ్వశాంతి సందేశాన్నే అని, మృతువును, మౌనాన్ని వదలని తాత్వికతో, మెరుగైన సాంకేతిక విజ్ఞానాన్ని ఇలా మన చుట్టూ ఉన్న ప్రతి చిన్న విషయాన్ని చక్కగా తనకు మక్కువైన ప్రాంతీయతను జోడించి, తెలుగు, ఆంగ్ల పదాల మేళవింపుతో, ఏ కవిత చదివినా ఆద్యంతమూ చదవనిదే సంపూర్తిగా అర్థంకాని మార్మికత, వస్తు విశిష్టత కవయిత్రి ఉషశ్రీ ప్రత్యేకత.
         నా రాతలకు విలువనిచ్చి నాలుగు మాటలు రాసే అవకాశాన్ని నాకిచ్చినందుకు ధన్యవాదాలు. అక్షర కిరణాలు  కవితా సంపుటిలో వైవిధ్య వస్తుశిల్పాలతో, ప్రతి కవితను మనసుపెట్టి రాసిన ఉషశ్రీకి హృదయపూర్వక అభినందనలు.

మంజు యనమదల
విజయవాడ
9490769585

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner