19, ఏప్రిల్ 2025, శనివారం
హృదయ విపంచి కవితా సంపుటి...!!
పద్మజ సబ్బినేని గారి "హృదయ విపంచి" కవితా సంపుటికి ముందుగా హృదయపూర్వక అభినందనలు.
ఈ కవితా సంపుటిలో జీవితానికి సంబంధించిన అన్ని పార్శ్వాలు కనిపించాయి. ఓ సున్నితమైన మనసుకు చేరిన స్పందనల భావాలకు అక్షర రూపమే "హృదయ విపంచి." ప్రేమ, ఆరాధన, నిరీక్షణ, బాల్యం, వెనకబాటుతనం, పల్లె జీవితాలు, జ్ఞాపకాలు, గాయాలు, గతాలు, గుండె చప్పుళ్ళు, కలలు, కన్నీళ్లు, కోపం, ఆవేశం, సమాజంలో స్త్రీ పట్ల వివక్ష పై తిరుగుబాటు, అన్యాయాన్ని ప్రశ్నించడం ఇలా అన్ని భావోద్వేగాలు సమపాళ్లలో కనిపిస్తాయి.
వరం అన్న కవితలో
" ఏ జ్ఞాపకాలు నిన్ను కలతపెట్టాయో
ఆ జ్ఞాపకాలను తీసెయ్యలేను కానీ,
నా కనుపాపలలో నిను దాచుకుని
నీ మనసు కలత చెందకుండా
చూసుకుంటా..
నీవు నమ్మగలిగితే జీవితకాలం
నీ మనసుకి ఊరటనిచ్ఛే
నీ పేదలంపై చిరునవ్వునవుతా
మరి ఆ వరం నాకిస్తావా నేస్తం...!!"
ఎన్నో ఆశలతో చెంత చేరితే తనకు లభించిన నిర్లక్ష్యపు బహుమానాన్ని స్వీకరించి కూడా ఇంత ఆర్తిగా అడిగిన వరం ఎంత అద్భుతంగా అనిపించిందో..!!
నిశ్శబ్దాన్ని శబ్దం చేయిస్తూ అక్షరబద్దం చేయడం, స్నేహాన్ని, సవ్వడిని, ప్రేమ తత్వాన్ని, ఆలంబనను, అనురాగాన్ని, ఆశలను, ఆశయాలను, అహాలను, అనుభవాలను ఇలా జీవితంలో ప్రతి చిన్న భావనను మనసుతో చూడటం, దానిని ఓ చక్కని అక్షర భావనగా అందించాలన్న తపన ప్రతి కవితలోనూ కనిపిస్తుంది. ప్రతి ఒక్కరి స్పందించే మనసు మౌనం ఈ అక్షరాల్లో మనకు దర్శనమిస్తుందనడానికి ఎట్టి సందేహం లేదు.
హృద్యమైన భావాలను అక్షరీకరించిన పద్మజ సబ్బినేని గారు అభినందనీయులు. కాస్త పరిచయంలోనే నా రాతలకు విలువనిచ్చి ఈ కవితా సంపుటికి నాలుగు మాటలు రాయడానికి అవకాశమిచ్చిన పద్మజ సబ్బినేని గారికి మనఃపూర్వక ధన్యవాదాలతో... మరిన్ని కవితా సంపుటాలు తెలుగు సాహిత్యంలో వెలువరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందనల శుభాకాంక్షలు.
మంజు యనమదల
వర్గము
సమీక్ష
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి