మనిషి చేతిలో అక్షర ఆయుధముంటే..!!
“ఆయుధంలాంటి మనిషి”..నిజమే మనిషి ఆయుధంగా మారితే ఎలా వుంటుంది? ఈ సమాజంలో అసమానతలు, అన్యాయాలు, అకృత్యాలు వంటి మరెన్నో దురాగతాలకు చరమగీతం పాడాలంటే “ లోసారి సుధాకర్” గారు అన్నట్టుగా మనిషి ఆయుధంగా మారక తప్పదు. ఇంతకు మునుపు “మైనపు బొమ్మలు”, “తడియారని స్వప్నం”, “ నా రహస్య మందిరంలో” కవితా సంపుటాలు వెలువరించారు. ఆ పుస్తకాలు పిల్లలకు పాఠ్యాంశాలుగా చేర్చబడి పలువురి ప్రశంసలు అందుకున్నాయి. ఆ కోవలోనే సాగుతూ సరికొత్తగా ఇప్పుడు “ఆయుధంలాంటి మనిషి” కవిత్వ సంపుటిని తెలుగు సాహితీ లోకానికి అందిస్తున్నారు.
అక్షరాన్ని ఆయుధంగా చేసి పదాల తూటాలతో ఈ సమాజంలోని లోపాలపై సూటిగా ఎక్కుపెట్టి తను అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఈ పుస్తకాన్ని ముద్రించినట్లు అనిపించింది. అమ్మ లేని లోటును “చిక్కనవుతున్న శూన్యం” కవితలో చెప్పినా మరికొన్ని చోట్ల కూడా కొన్ని శూన్యాలు, ఖాళీలు ఈ కవితా సంపుటిలో కనిపిస్తాయి. “ఒక ఖాళీ ప్రపంచం” కవితలో జీవితం మెుత్తాన్ని ఖాళీ చేస్తూ, ఇంటిని ఖాళీగా పూరించారు అద్భుతంగా. అంతే గొప్పగా “గది నాకొక ప్రపంచం” కవిత వుంది. ఎవరి పాట వారే పాడుకోవాలంటూ “గొంతు తెగిన పాట” కవితలో “కాసేపైనా జీవితం ఓ పాట కచేరీ అయితే ఎంత బావుండు” అంటూ తన ఆశను తెలియజేసారు. అమ్మతో ఆలిని పోల్చుతూ ఓ విషయంలో తప్ప తనకెప్పుడూ ఆలి “రెండో అమ్మ” అనడం ఎందరికి సాధ్యం? ప్రేమ గురించి ఆనాటి నుండి ఈనాటి వరకు ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్పారు. సుధాకర్ గారి భావాలలో “వసంత సమీరం” కవిత నుండి
“ కళ్ళు తెరిచి కన్న
ఒక స్వప్నం నువ్వు
విషాదముగింపుకు
తొలిసంతకం నేను”
విరహము, విషాదము, ప్రేమ, ఆరాధన ఇలా ఎన్నో భావాల సమాహారమే ఈ పై నాలుగు వాక్యాలు. “కవిత్వమంటే బతుకుప్రపంచం” అంటూ కవిని, కవిత్వాన్ని ఎంత గొప్ప స్థాయిలో వుంచారో ఈ పుస్తకంలో చాలా చోట్ల కనిపిస్తుంది.
దుఃఖాన్ని, చీకటి వెలుగులను, జ్ఞాపకాలను, ప్రకృతి సహజ సౌందర్యాన్ని, వియోగాన్ని, వేదనలను, సంవేదనలను, కోపాన్ని, అసహనాన్ని, దేశభక్తిని, చావుపుట్టుకల తాత్వికతను, ప్రశ్నలను, సమాధానాలను, సందేహాలను ఇలా ఒకటనేమిటి చాలా చాలా అక్షర ఆయుధాలను ఉపయోగించి “ఆయుధంలాంటి మనిషి” కాదు కాదు మనిషి మనసు ఆయుధంగా మారి అక్షరాలను ఆవహిస్తే ఎలా వుంటుందో అన్నది ఈ పుస్తకం చదివితే అర్థం అవుతుంది.
కర్ణుడంటే అమితమైన ఇష్టం కనబడింది. రామాయణ, భారతాల ప్రభావం కూడా చాలా చోట్ల కనిపించినట్లు అనిపించింది. తన వృత్తిధర్మాన్ని పాటిస్తూ, ఆ పరిసరాలను కూడా తన కవిత్వంలో నింపారు. సామాజిక, రాజకీయ అంశాలపై అక్షరశరాలు సంధించారు. జీవితంలో అన్ని పార్శ్వాలను స్పృశించారు తన కవితల్లో. గొప్ప కవిత్వాన్ని అందించిన “ఆయుధంలాంటి మనిషి” “లోసారి సుధాకర్” గారికి హృదయపూర్వక అభినందనలు.
అందుబాటులో వున్న వారందరూ ఈ పుస్తక ఆవిష్కరణ సభకు హాజరుకండి.


0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి