7, అక్టోబర్ 2019, సోమవారం

ద్విపదలు...!!

1.   కలమే రాయగలిగే కథనాలెన్నో
కాలంతో సాగే గుండెల్లో దాగిన కల్లోల సంద్రాలను...!!

2.  ఎడబాటే తెలుపుతుంది
ఎదలో దాగిన ఇష్టాన్ని  ఎరుగమంటూ...!!

3.   చూపు లేకున్ననేమి
మనోనేత్రంతో అనుక్షణం నీ దర్శనమే...!!

4.   మౌనంలో ఒలికాయి మాటలు
మనసాక్షరాలను చేరువకు రమ్మంటూ..!!

5.  అల'జడి అల్లంత దూరమే ఎప్పుడు
కన్నీటి కలత కల'వర పెడుతున్నా...!!

6.   అనుబంధపు ఆనవాలది
గతజన్మ బాంధవ్యాన్ని గురుతెరగమని గుర్తుచేస్తూ...!!

7.  అక్షరాలు తెలిపాయి
అద్దమంటి మనసదని..!!

8.  బంధాలకున్న అనుబంధమదేననుకుంటా
తెలియకుండానే మనసుకు చేరువగా వచ్చేస్తాయి...!!

9.    సంకోచ వ్యాకోచాలు అవసరమే
ఎద సవ్వడి తెలియాలంటే...!!

10.   తరిగిపోని అభిమానమిది
కరిగిపోని అనుబంధాలతో...!!

11.  విశ్వంతో పని ఏముంది
ఎద నిండుగా నువ్వుంటే..!!

13.   నక్షత్రాలెందుకు
నీ నవ్వుంటే చాలదూ..!!

14.   కొన్ని మౌనాలంతే
మనసుని మళ్ళిస్తాయి మాటలను వినమంటూ...!!

15.  నీ మనసు మకరందం
మాటల్లో ఒలికి పోతూ...!!

16.   చిరునామా తెలిపిన చెలిమి
గతపు జ్ఞాపకాన్ని గుర్తుచేస్తూ..!!

17.  అక్షరాలెన్ని సృష్టించాలో
నీ మౌనాన్ని మాటలుగా పేర్చడానికి...!!

18.   చెలియలి కట్టకు తప్పదు
సంద్రంతో స్నేహం చేయక..!!

19.   అలల ఆరాటమది
ఆగని పోరాటమై అందరికి ఆదర్శమై...!!

20.   రెప్పలిప్పాలని లేదు
కలలోనైనా కనిపిస్తావని..!!

21.   ఎన్ని పున్నముల పెట్టో
నీ నవ్వుల వెలుగులు...!!

22.   అక్షరాలకు అద్దకాలెందుకు
అందమైన భావాలుగా అవి అమరుతుంటే...!!

23.   శృతికి చిక్కిన సాహిత్యమిది
మదికి ఆహ్లాదమిచ్చే మౌనగీతమై...!!

24.  సజీవ చిత్రమే నీవు
స్వప్నం సాకారమైన వేళ...!!

25.   అలరించడం అక్షరాలకు అలవాటే
సాహిత్యపు సుమగంధాల చేరికతో...!!

26.   ఇష్టంగా ఉంది
నీ ఇష్టపదైనందుకేమెా...!!

27.   కాలమెంత తేలికైనదో
అందరి బరువుభారాలు తనపై పడుతున్నా...!!

28.  రంగుల కలే అది
కనుపాపల్లో అనుక్షణం కదలాడుతునే..!!

29.   మాటల విరుపులే
మౌనం వయ్యారాల్లో...!!

30.   అనువదించడం కష్టమే
అక్షరాలకు అలవి కాని మనసును...!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner