28, అక్టోబర్ 2019, సోమవారం

ఏక్ తారలు..!!

1.   ఆత్మీయతలు అందకుండా పోతున్నాయి_మనసు మాయమయ్యాక...!!

2.   అనువదించే మనసుకు తెలుసు_అక్షరాల ఆంతర్యమేమిటో...!!

3.  అద్దమంటి మనసది_చదవనక్కర్లేకుండా చూసిన వెంటనే అర్థమైపోతూ..!!

4.   పదాలన్నీ పారాడుతున్నాయి_నీ అక్షరాల ఆత్మీయతనెరిగి...!!

5.   అనుకోని అతిథులైనాయి అక్షరాలు_ముగింపునెరిగిన జీవితానికి..!!

6.   లక్షణమైన అక్షరాలవి_లెక్కలేనన్ని భావాల మేళవింపులో..!!

7.   అదను చూసి అక్షరం శరమౌతుంది_అహానికి తలవంచక..!!

8.    అహమూ అలంకారమయ్యింది_అణుకువగా భావాల్లో ఒదిగిన అక్షరాలకు..!!

9.   ఏకాంతం ఎటో వెళ్ళింది_ఎడద ఎడబాటు తట్టుకోలేదని...!!

10.  మౌనం మనసు పడిందట_ఊసుల విహారాన్ని చూసి..!!

11.    అంత భయమెందుకు_స్వప్నాన్ని నిజం చేద్దామని నేనొస్తే..!!

12.   కదలిపోలేకున్నాను_కనులతో నీవిలా కట్టిపడేస్తుంటే..!!

13.   మరపు మనకెలా సాధ్యం_పంచుకున్న అనుబంధం గతజన్మదైతే...!!

14.   ప్రాణం నిలిపే తలపులవి_సజీవ జ్ఞాపకాలై మిగిలి..!!

15.  దొరకను నీకు_నీ నీడలా వెన్నంటి ఉంటూనే...!!

16.   కల కథగా మారింది_నేర్పు తెలిసిన కథకుని చేతిలో...!!

17.   జీవితం కథయ్యింది_తను వదిలెళ్ళిన జ్ఞాపకాలతో..!!

18.   గమనం గాయాలను గెలవాలి_కన్నీటి గురుతులను పన్నీటిజల్లుగా మార్చుతూ..!!

19.    కమ్మని గాత్రం తోడయ్యింది_పాటగ మారిన కథకు...!!

20.   పంజరమే పానుపయ్యింది_చిలక పలుకుల చిలకమ్మకి...!!

21.   శాపమూ వరమే_చిలుక కొరికిన పండుకు..!!

22.   స్వరాలలా జత కూడాయి మరి_గమకాలు గమ్మత్తుగా చేరిన పాటకు..!!

23.   విడివడని జ్ఞాపకం తానైంది_కలలాంటి వాస్తవమై వెన్నాడుతూ...!!

24.   నిషాదమెరుగని విషాదమది_మదిని లాలించే మౌనంలో...!!

25.   పటిష్టమయిన పునాది మనది_చెలిమి చలువరింతల సందిట...!!

26.   అలుక చిన్నబుచ్చుకుంది_గారంలో నయగారం రంగరించినందుకనుకుంటా...!!

27.   కన్నీటి నవ్వులెన్నో_కనబడని కాలం మాటున..!!

28.  బానిసత్వం కాదది_అక్షరాలతో మమేకమైన బాంధవ్యమిది...!!

29.  కాలనాగు నైజమది_కాలం దాయలేని నిజాన్ని వెళ్ళగక్కుతూ..!!

30.   మనసుని అనువదించాయి అక్షరాలు_మమతకు మాటలతో పనిలేకుండా...!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner