12, అక్టోబర్ 2019, శనివారం

జీవన 'మంజూ'ష (నవంబర్)..!!

నేస్తం,
         మనిషికి పరిణితి అనేది ఎప్పుడు వస్తుందో, దేని వలన వస్తుందో తెలియడం లేదు. వయసు పెరిగే కొలది బాధ్యతలు పెరిగి మానసిక పరిణితి వస్తుందనుకుంటే అది తప్పనిపిస్తోంది కొందరి ప్రవర్తన చూసి. పోని చదువు సంస్కారం, విలువలు నేర్పుతుందేమెాననుకుంటే అదీ పొరబాటని తెలిసిపోతోంది. కీర్తి కండూతి కోసం వెంపర్లాడటంలో తప్పులేదు కాని ఎదుటివారిని అణగదొక్కి మనం మాత్రమే పేరు సంపాయించుకోవాలన్న స్వార్థం మనల్ని అధఃపాతాళానికి తొక్కేస్తుందని మర్చిపోతున్నాం. ప్రపంచం అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతోందని అందరు అనుకుంటున్నారు, కాని మనిషి మనిషితనపు సహజత్వాన్ని మరచి ప్రవర్తించడం రానున్న తరాలకు మంచిది కాదని తెలుసుకోలేక పోతున్నారు. 
       ఒంటరితనం, డబ్బు, కీర్తికాంక్ష, అధికారహోదా ఇలా ఎన్నో కారణాలతో బంధాలకు దూరమైపోతూ, ఆ లోటు పూడ్చుకోవడానికి మరో దారిని వెదుక్కునే ప్రయత్నంలో కొందరు తమ చదువు, హోదా మరచిపోయి తప్పటడుగులు వేయడం అతి సహజ చర్యగా మారిపోయింది. దీని వలన ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. చావులు, ఆత్మహత్యలు నిత్యకృత్యం అయిపోయాయి. ఒకప్పుడు ప్రపంచం చాలా పెద్దది. ఇప్పుడు సాంకేతికత పెరిగి ప్రపంచమంతా మన అతిచేతిలోనే ఉండటంతో మంచికన్నా చెడే ఎక్కువగా జరుగుతోంది ముఖ్యంగా మన దేశంలోనే. ఒకే ఇంట్లో నలుగురు ఉంటున్నా ఎవరి దారి వారిదే. ఎవరి అభిప్రాయాలు వారివే. సర్దుకుపోవడం అన్న మాట తెలుగు భాషకు దూరమైపోతుందేమో కొన్ని రోజుల్లో అన్నట్టుగా అనుబంధాలు తయారవుతున్నాయి. మన దేశానికి తలమానికమైన కుటుంబ వ్యవస్థలు కూడా ఇకపై కానరావేమోనన్న భయం చోటు చేసుకుంటోంది. 
      సమస్య కొత్తగా ఏం పుట్టలేదు. మనిషి పుట్టుక ప్రారంభం నుండే సమస్య మొదలైంది. బతుకు పోరాటం సాగించడానికి ఆదిమానవుడు ఒక్కో అడుగే వేసుకుంటూ తన ఉనికిని కాపాడుకోవడానికి ప్రత్యామ్నాయాలు కనుక్కోవడంలో తన మెదడుకు పదును పెడుతూ నిత్యావసరాలను సమకూర్చుకోవడంతో మొదలుబెట్టిన ప్రయత్నాలు పలు మార్పులకు లోనై తిండి, బట్ట, గూడు మొదలైన నిత్యావసరాలతోపాటు, సాంకేతికంగా అభివృద్ధి సాధించడంలో పరిణామక్రమాన్ని అనుసరించి పరిపక్వత సాధించిన నాగరికత ఈనాడు. కాని ఏదో వెలితి ప్రతి ఒక్కరిలో. ఎందుకీ అసమానత, అసహనం అని కనీసం ఓ క్షణం ఎవరైనా ఆలోచిస్తే తరిగిపోతున్న కుటుంబ విలువలు, అహంతోను, ఆస్తుల కోసము దూరం చేసుకుంటున్న అనుబంధాలని గుర్తించిన రోజున అంతరించిపోతున్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థను మళ్ళి చూడగలమేమో..!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner