31, అక్టోబర్ 2019, గురువారం

సంపాదకీయం..!!

నేస్తం,
          ఏదైనా రాయాలన్నా ఒకింత సంశయం మెుదలైందీ మధ్యన. భావ ప్రకటనా స్వేచ్ఛకు కూడా ఆంక్షలు, పరిధులు బాగా ఎక్కువైనట్టుగా అనిపించడమెా కారణం కావచ్చునేమెా. సోషల్ మీడియా రాజకీయ ట్రోలింగ్ మీడియాగా మారిపోవడమూ, ప్రతి ఒక్కరి రాతను మరొకరు ఎద్దేవా చేయడం పరిపాటైపోయింది. మన చేతికున్న ఐదు వేళ్ళే ఒకలా ఉండవు. అలాంటప్పుడు ఏ ఇద్దరి అభిప్రాయాలు కలవవు. స్నేహం వేరు, అభిప్రాయాలు విభేదించడం వేరు. పరస్పర అభిప్రాయాలను గౌరవించుకోవడంలోనే వ్యక్తిత్వం బయట పడుతుంది. తప్పు అని ఎవరైనా అంటే వారిని ట్రోల్ చేయడం, దానికి ఈ మేథావుల సమర్థన. సామాజిక సమస్యలు తెలిసిన వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే స్వాగతించం, కాని సామాజిక ప్రయెాజనమైన రచనలే రచనలంటే ఎలా..? 
         ఇక రాతల కోతల విషయానికి వస్తే మనం మనకు నచ్చినట్టు రాయగలిగినప్పుడే ఆ రాతకు జీవం ఉంటుంది. అది సామాజిక సమస్య అయినా, మానసిక వేదన/సంతోషం అయినా రాసిన వారికి తమ రాత సంతృప్తినివ్వడం రచన ముఖ్య ఉద్దేశ్యం. స్వప్రయెాజనం లేని రాత సమాజ హితం కాదన్నది నా అభిప్రాయం. రచనా ప్రక్రియల గురించి ఒకరినొకరు విభేదించుకోవడం ఈనాడు సర్వసాధారణమై పోయింది. ప్రక్రియ ఏదైనా కానివ్వండి, దాని వలన నలుగురికి ప్రయెాజనం లేకున్నా రాసిన వారికి ఆత్మ తృప్తి కలిగితే ఆ రచనకు ప్రయెాజనం చేకూరినట్లే. ఇక భాష విషయానికొస్తే రాసే అందరూ పండితులు కాదు. ఒకప్పుడు తమ రాతను అచ్చులో చూసుకోవాలన్నా, నలుగురికి చేరాలన్నా ఎన్నో వ్యయప్రయాసలుండేవి. ఇప్పుడు మనకా ఇబ్బందులు లేవు. సాంకేతిక మనకిచ్చిన సౌలభ్యం క్షణాల్లో ప్రపంచమంతా చేరిపోతుంది ఏ రాతయినా. రాయడం కొందరికి జన్మతః వస్తే, మరి కొందరు ఇష్టంతో తమ భావ ప్రకటనకు రాయడం ఓ మార్గంగా ఎంచుకుని, ఆ అలవాటులో నిష్ణాతులవుతారు. పుడుతూనే ఎవరికి ఏదీ రాదన్నది గుర్తుచేసుకుంటే ఎదుటివారి రాతల్లో తప్పులు మాత్రమే వెదికే మన నైజం మారుతుందేమెా. నాకయితే స్వాతికిరణం సినిమా గుర్తు వస్తోంది ఈమధ్యన.
         మనకు నచ్చిన నలుగురిని పొగిడి, వారికి బిరుదులు,  పురస్కారాలిచ్చి, సన్మానాలు చేసి, శాలువాలు కప్పినంత మాత్రాన వారు గొప్ప రచయితలు, కవులు కాదు. మనం కడుపుబ్బరంతో నలుగురి రాతలను విమర్శించినంత మాత్రాన వారు రాయడం తెలియని అనామకులు కాదు. సాహితీ పెద్దలు, విజ్ఞులు ఈ చిన్న విషయం గుర్తుంచుకుని నిజాయితీ గల సద్విమర్శలు చేయాలని, అవి ఈ తరం రచయితలకు మార్గదర్శనం కావాలని నా ఆశ.
తమ రాతలు అచ్చులో చబసుకోవాలనుకునే వారు ఎన్నో ఇబ్బందులు పడి పుస్తకాలు వేసుకుంటున్నారు. కనీసం మనకు ఆ పుస్తకాల్లో ఒక్కటయినా కొని చదివే అలవాటు లేకపోగా, చదివిన వారు తమ అభిప్రాయం చెప్పినప్పుడో, రాసినప్పుడో కనీసం కృతజ్ఞత చెప్పడం కూడా తెలియని ఎందరో మహామహులు ఈరోజున్నారు. రాతల్లో నీతులు, చూడబోతే నేతిబీరకాయలో నెయ్యి చందం. మన రచనలపై ఎదుటివారి అభిప్రాయాల కోసం మనం ఎలా ఎదురుచూస్తామెా మన అభిప్రాయం కోసం వారు అలానే చూస్తారన్న ఆలోచనే రాదు. ఒక రచనను పొగిడితే మనకేమెాస్తుందని కాకుండా మన చిన్న స్పందన  ఎదుటి వారికి ఎంత ఆనందాన్నిస్తుందో తెలుసుకుంటే చాలు. ఏ సాహిత్యమైనా సమాజ హితం కోసమే. మన ఆలోచనలు సరళంగా ఉంటే చూసే ప్రతి రచనలోనూ ప్రయెాజనమే కనిపిస్తుంది.   

       

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner