16, అక్టోబర్ 2019, బుధవారం

జీవన 'మంజూ'ష (డిసెంబర్ )

నేస్తం,
        ఒంటరితనం అనుభవించని వారు ఈరోజుల్లో లేరనే చెప్పాలి. మనకంటూ అందరు ఉన్నా,  ఒంటరితనం ఏదో ఒక క్షణం మన మనసు తలుపు తట్టలేదని అబద్ధం చెప్పలేము. ఈ ఒంటరి రక్కసి ఎన్నో జీవితాలను నాశనం చేస్తోంది. ఎందరి ప్రాణాలనో బలి కోరుతోంది. పేదా, మధ్యతరగతి, సంపన్న కుటుంబాలు అనే తేడా దీనికి ఏమాత్రమూ లేదు. పిల్లల నుండి పెద్దల వరకు అందరు దీని బారిన పడుతున్నారు. ఎవరికి చెప్పుకోలేని ఎన్నో మానసిక సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు, జీవితాలను బలి చేసుకుంటున్నారు.
         ఒంటరితనానికి కారణాలు వెతకడం మెుదలుబెడితే సవాలక్ష సాకులు చెప్తారు కొందరు. కుటుంబం అన్న తర్వాత సమస్యలు, కోపతాపాలు సహజం. మన ఇంట్లో కరువైన దగ్గరతనాన్ని మరోచోట వెదుక్కోవాలన్న ఆలోచనలతో ఉచ్ఛం నీచం మరచి ప్రవర్తించడం నేడు సర్వసాధారణమైపోయింది. మన అనైతిక ప్రవర్తనతో మరో కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికి వెనుకాడని మనస్తత్వాన్ని అలవరుచుకుంటున్నాం. ఇది ఎంతో హేయమైన చర్య అని అనిపించక పోవడం దురదృష్టం.
           మనిషి కనిపెట్టిన డబ్బు నేడు మనిషినే శాసిస్తోంది. దీనికి కారణం మనం అనుబంధాలకు విలువనివ్వకుండా, ప్రతి బంధాన్ని డబ్బుతో కొలవడం, మన స్వార్థం మనం చూసుకుంటూ " నా " అన్న అక్షరంతో బతికేయడం మెుదలుబెట్టాం. బంధం, బాధ్యత మరిచి హక్కులు, అవసరాలతో, అహంకారం అలంకారమని మన చుట్టూ ఓ చట్రం గీసేసుకుని బతికేయడం అలవాటు చేసుకుంటున్నాం. చావు, పుట్టుకలు ప్రతి ఇంటికి సహజమని మర్చిపోతూ, ఈరోజు గడిచిపోయింది చాలనుకుంటున్నాం. రేపన్నది ఒకటుందని, తాతకు పెట్టిన ముంత మన తల వైపునే ఉంటుందని మర్చిపోయి, ఎగిరెగిరిపడుతున్నాం.
        ప్రపంచమంతా మన అరిచేతిలోనే చూసుకునే వెసులుబాటు సాంకేతిక కల్పించినందుకు సంతోషించాలో లేక ఒకే ఇంట్లో ఉంటున్నా ఎవరికెవరు ఏమీ కానట్టు ఉంటున్నందుకు బాధ పడాలో తెలియని అయెామయంలో పాత కొత్త తరాలకు మధ్యన నలిగిపోతున్న నేటి తరం పరిస్థితి ఇది. రక్త సంబంధాలు లేవు, కుటుంబ అనుబంధాలు కానరాని నేటి దుస్థితి మన భారతీయ వ్యవస్థకు తీరని నష్టం. అవసరానికి డబ్బులు కావాలి కాని అవసరమే డబ్బుగా బతుకుతున్న నేటి మనిషి, తను ఏం కోల్పోతున్నాడో తెలుసుకునే రోజు త్వరలో వస్తే బావుండు.   

       

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner