7, ఫిబ్రవరి 2020, శుక్రవారం

ఏక్ తారలు..!!

1.   ఓదార్పెప్పుడూ నీతోనే_అలసిన మదికి ఆలంబనగా...!!
2.   నిత్యస్మరణకు తీరికెక్కడా_మౌనంలోనూ నీ జపమే చేస్తుంటే..!!
3.  ఓరిమిగా వెంటబడుతుంది వలపు_వద్దన్నా వదలక వెంబడిస్తూ...!!
4.  ఒల్లకుంటాయా భావాలు_అక్షరాలతో నెయ్యం నెరపకుండా...!! 
5.   సరిపెట్టుకోవడమే అలవాటయిపోయింది_అర్థాలు అపార్థాల పాలౌతుంటే..!!
6.   అపార్థం అధిష్టానాన్ని ఆక్రమించింది_సర్దుబాటుకు అవకాశం లేకుండా...!!
7.   అక్షరాలకు తెలుసు_అది భారమైనా, భావమైనా నా మనసేనని...!!
8.   తెలియనిదల్లా నీకే_బోధపరిచే అక్షరాలను ఆషామాషిగా తీసుకుంటూ...!!
9.   లోకంతో పనేముందిక_నా ప్రపంచమంతా నీవయ్యాక...!!
10.   అక్షరాలు వదిలుండలేవట_అమాయకంగా పదాల ఆటకు పడిపోతూ..!!
11.   బడాయి భావాలకెందుకో_నయగారం అక్షరకన్నెలదయితే..!!
12.   పైసలకు చిక్కలేదట అక్షరాలు_పదాల కూర్పుకు తలొగ్గాయట..!!
13.   బేరసారాలే నడుస్తున్నాయిప్పుడు_అనుబంధాలు అంగట్లో సరుకులుగా మారితే..!!
14.   తొలి పలుకులిక్కడే_అమ్మ నేర్పిన అక్షరాలను అటు ఇటు సర్దుతూ...!!
15.   సాధ్యం కాదనెలా అంటావు_నా మౌనం మాట్లాడేదే నీతోనైతే..!!
16.   నీకు తెలియని లిపేముందని_మరో వివరణతో పనేముందిగనుక..!!
17.  అక్షరాలెప్పుడూ ఆకతాయివే_భావాలను అల్లరిగా అల్లేసుకుంటూ...!!
18.   గొప్పదనం అక్షరాలది కాదు_ఆదరించే మనసులది..!!
19.   బాధ్యతనెరిగిన అక్షరాలవి_పదాలనటూనిటూ పోనీయకుండా..!!
20.   పరిమితులు తెలిసిన అక్షరాలివి_పద పారిజాతాలతో విలసిల్లుతూ...!!
21.  విహారంలో విరుపులెక్కువైయ్యాయట_అక్షరాలందుకే అలా..!!
22.   ఆత్మకథల అగచాట్లవి_చీకటిలో వెలుగు నింపే యత్నంలో..!!
23.   సన్నిహితులమే కదా_సహకారం నామమాత్రమే మన మధ్య...!!
24.   చేయకుండా చేయించే హత్య_నిర్లక్ష్యం..!!
25.  అలంకరణలెన్నుంటేనేమి_కనబడని మనసేగా అది..!!
26.   లెక్కకురాని నైరాశ్యాలు_కనులకు తెలియని కన్నీటిలా...!!
27.   జ్ఞాపకాల నిండా గాయాలే_వాస్తవంలో సైతం వీడలేమంటూ..!!
28.  నిశీథిని పారద్రోలే జ్ఞాపకాలవి_తల్లడిల్లే మనసును ఊరడింప..!!
29.   నిజం పునాది గట్టిదనం తెలియలేదు_పేకమేడలో జీవించే అబద్ధానికి...!!
30.   కొన్ని నవ్వులంతే_కలతలను కలలుగా మార్చేస్తూ..!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner