2, ఫిబ్రవరి 2020, ఆదివారం

మడిపల్లి వెంకటేశ్వరరావు గారి గురించి...!!

                       " అందరి మనసులు తెలిసిన అక్షర ఆంతరంగికుడు మడిపల్లి వెంకటేశ్వరరావు "
        బ్రహ్మాండమంత విశ్వంలో అణువంత అక్షరం సృష్టించే విస్ఫోటనం ఏంటో అక్షరం విలువ తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు. ఒకప్పుడు తమ భావాలు పదిమందికి చేరాలంటే ముద్రితాక్షరాలై ఉండాలి. ఇప్పుడు మనకు క్షణాల్లో మన భావాలు ప్రపంచాన్ని చుట్టి వస్తాయి. ఆ వెసులుబాటు సాంకేతికత కల్పించింది. కావ్యాలు,  పద్యాలు, దీర్ఘ కావ్యాలు, కవితలు, కథలు, వ్యాసాలు, నవలలు ఇలా అన్ని ప్రక్రియలు ప్రజల్లో ప్రాచుర్యం పొందాయి మన తెలుగు సాహిత్యంలో. ఆ కోవలోకే ఇప్పుడు పలు లఘు కవితా భావ ప్రక్రియలు ప్రాచుర్యం పొందుతున్నాయి. అనల్ప పదాలలో అంతులేని భావాలను పొదగడంలో చాలా నేర్పు, ఓర్పు అవసరం. ఆ నేర్పును, ఓర్పును అలవోకగా అందుకున్న అతి కొద్దిమందిలో మడిపల్లి వెంకటేశ్వరరావు గారు ఒకరు. నిగర్వి, ముక్కుసూటితనం, దేనికి ఎవరికి భయపడని తత్వం, సమాజం పట్ల తన వంతుగా ఏదైనా చేయాలన్న తపన, అన్యాయాలను, అక్రమాలను నిరసించే గళం ఇలా ఎన్నో బాధ్యతలను తానుగా నిర్వహిస్తూ, సమాజ హితం కోసం అక్షర శరాలను సూటిగా ఎక్కుపెట్టి చదువరుల మనసు లోతులను తడిమే అక్షర ఆంతరంగికుడు మడిపల్లి వెంకటేశ్వరరావు గారు.
               తాను చెప్పాలనుకున్న విషయం సామాజికమైనా, ఆర్ధికపరమైనదైనా, రాజకీయమైనా నిష్పక్షపాతంగా, స్పష్టంగా చెప్పడం, అధికార పక్షం, ప్రతిపక్షం కాకుండా ప్రజల పక్షాన తన అక్షర శరాలను సంధించడం ఈయన ప్రత్యేక లక్షణం.  రైతుకు ప్రభుత్వం ఇచ్చే నష్టం పంటకా..? పోయిన ప్రాణానికా..? అన్న ప్రశ్నఎవరైనా ఇప్పటి వరకు వేసారా..? మడిపల్లి వెంకటేశ్వరరావు గారు మాత్రమే అడగగలిగారు. ఈ ఒక్క మాటలోనే ఆయన వ్యక్తిత్వం తెలుస్తోంది. పుణ్యానికి కొలమానాలు ఏమిటని మరొక మాట అడుగుతారు ఇలా..
" చేసేది పాపపట
   వేసేది ముస్టట
వచ్చేది పుణ్యమట.. నిజమేనా..!! " ఎవరు సమాధానం చెప్పగలరు ఇలాంటి ప్రశ్నలకి.
మాతృభాషను కాదని ఆంగ్ల భాషను, అధికార భాషను అభివృద్ధి చేయాలనుకోవడం ఎంతవరకు సమంజసం అని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తారు. కుల, మత వివక్షలకు సూటిగానే చురకలు అంటించారు. కలం విలువ, కలం విలువ తెలిసిన మనిషిగా
" కలం కథానికగా మారింది
   కలం విలువ తెలిసిన కథకుడి చేతిలో.. " అంటూ చక్కని భావాన్ని అందించారు.
మరో చోట నిజంలో జీవిస్తూనే అబద్ధంలో బతికేస్తున్నామన్న జీవిత సత్యాన్ని ఎంత సుళువుగా చెప్పేసారో. 
అనుబంధాల్లో నటనలు, మోసాలు, ఆనందాన్ని, కోపాన్ని, వేదనను, స్నేహాన్ని, ద్వేషాన్ని ఇలా ప్రతి అనుభూతిని చిన్న చిన్న వాక్యాల్లో చదివే వారి మనసులోనికి దూసుకుపోటట్లుగా రాయగలగడం ఓ కళ. బాధను ఒకేలా అనుభవించగలగడం స్థితప్రజ్ఞతగా తాత్విక భావాన్ని చెప్తారు. ఓ మనిషిలో మంచిని, మానవత్వాన్ని ఆ మనిషి పోయాకే మహాత్మునిగా గుర్తిస్తారని ఇప్పటి జనం తీరును చమత్కరిస్తారు. సమాజంలో మంచి మార్పు కోరేవాడు ఎప్పుడు సమాజానికి శత్రువేనంటారు. మనం అనుభవించే సుఖాలు మరొకరి కష్ట ఫలితమే అని ఎందుకు గుర్తించమో అని ఒకింత బాధను వ్యక్తపరుస్తారు. రాజకీయ మాయలో ప్రజానాయకుడెవరో, సేవకుడెవరో అన్న సంశయాన్ని రేకెత్తిస్తారు. ఆట ఏదైనా, రాజకీయమైనా గెలుపు నిజాయితీగా ఉండాలంటారు.
    " కలం నాదే
సిరానే నాదికాదు
చేయి నాదే
రాతే నాది కాదు.." అంటూ మనసు రాసే రాతలే తనవని స్పష్టం చేసారీ సమాజ హితుడు, అక్షర సన్నిహితుడు మడిపల్లి వెంకటేశ్వరరావు. సమాజంలో లోపాలను సరిచేయడానికి అక్షర ఆయుధాలను సిద్ధం చేసుకుని సాహిత్య యుద్ధభూమికి అడుగిడి, అలతి పదాలతో అందరిలో ఆలోచనలు రేకెత్తిస్తూ, బాధ్యతాయుత రచనలను అందిస్తున్న అక్షర శ్రామికుడు మడిపల్లి వెంకటేశ్వరరావు గారికి హృదయపూర్వక అభినందనలు. వీరి సాహితీ శర పరంపర నిత్యం కొనసాగాలని కోరుకుంటూ.... శుభాభినందనలు.

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner