నేస్తం,
పిలుపులకు, పలుకులకు సంబంధం లేకుండా పోతోంది. ఎంతయినా నాభి నుండి వచ్చే పిలుపులకు, నాలుక మీది పలుకులకు తేడా తెలుసుకోలేక పోవడం కాస్త దురదృష్టమనే చెప్పాల్సి వస్తోంది కొందరి ప్రవర్తన చూసిన తర్వాత. అభిమానాన్ని ఆసరా చేసుకుని పబ్బం గడుపుకునే వారు కోకొల్లలు మన సమాజంలో.
అమ్మ, అక్క, చెల్లి అంటూనే అడ్డమైన వాగుడు వాగేవారు బోలెడుమంది. కనీసం ఎదుటివారి వయసు కూడా గుర్తురాదు వీళ్ళకు. మన భారతీయ సంస్కృతిలో కుటుంబ విలువలకు అగ్రస్థానం ఒకప్పుడు. పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడిపోతూ వ్యక్తిత్వ విలువలకు తిలోదకాలిస్తూ ఆధునికత మెాజులో పడి పెడదారులు పడుతున్న సమాజం నేడు. పరాయి సంస్కృతిని వంటబట్టించుకునే ముందు మనమెక్కడున్నాం, మనమేంటి అన్నది తెలుసుకోవాలి. స్వేచ్ఛకు, విచ్చలవిడితనానికి తేడా తెలుసుకోవాలి. విశృంఖలత్వానికి స్నేహమనే ముసుగు వేసేసి చేతులు దులిపేసుకోవడం సమంజసం కాదు.
ఇంటి మనుషులకు విలువ ఇవ్వని ఎవరూ ప్రపంచంలో బాగు పడిన దాఖలాలు లేవు. ఇంటి బాధ్యతలు, ఇంటిలోని వారికి విలువ ఇవ్వని చదువు, సంస్కారం ఈనాడు గొప్పదని కొందరనుకుంటున్నారు. అక్కరకు రాని బంధుత్వాలే అన్నీ ఈనాడు. రక్త సంబంధాలు రాలిపోతున్న ఆనవాళ్ళే అయిపోతున్నాయి.
భాషా సంస్కృతులు మన ఉనికికి పట్టుగొమ్మలు. మనమే చీడపురుగుల్లా చేరి పచ్చని చెట్టు వినాశనానికి దోహదం చేస్తున్నాం. మరోపక్క సభ్య సమాజ అభ్యుదయం కావాలంటున్నాం. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవని మర్చిపోతున్నాం. అందరం సమాజం బాగుపడాలనే అంటాం కాని, సమాజమంటే మనమేనని మర్చిపోతున్నాం. మనం మేల్కొన్న రోజే సమాజ పురోభివృద్ధి. ఎంత త్వరగా మనం మేల్కొంటే అంత త్వరగా మన తరువాతి తరాలకు చక్కని కుటుంబ అనుబంధాలను, వ్యక్తిత్వ విలువలను ఇస్తూ, ఉన్నతమైన మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కానుకలుగా అందించగలుగుతాం.
3, ఫిబ్రవరి 2020, సోమవారం
జీవన 'మంజూ'ష (ఫిబ్రవరిె 2020 )
వర్గము
ముచ్చట్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి