25, ఫిబ్రవరి 2020, మంగళవారం
త్రిపదలు..!!
1. అలలకుందా
అలుపు వెరుపు
పడినా లేవడమే దాని లక్షణం...!!
2. చిన్మయంలోనే
ఆ చిదంబర రహస్యం
మనసు మాయం కావడంలో..!!
3. రేపటులన్నీ...
నిన్నటి ఆనవాళ్ళే
ఈరోజుని కలుపుకుంటూ...!!
4. లౌక్యం తెలియని బతుకులింతే
అటు తెంచుకోనూలేవు
ఇటు సరిపెట్టుకోనూలేవు...!!
5. ఏ క్షణమూ
నాది అవడం లేదు
తడబడకుండా ఉందామంటే..!!
6. హత్తుకోవడంలో
అమ్మతో సమానమే అక్షరమూను
మనసు భారాన్ని తానందుకుంటూ..!!
7. నా అనుకున్న బంధాల
ఘడియలన్నీ గడియ లోపలే
నేనంటూ మిగలనప్పుడు..!!
8. మనసు..
కనిపించకుండానే
కనుమాయ చేసేస్తుంది...!!
9. శూన్యానికి చోటేది
చిత్తమంతా నీ చిత్తరువే
కొలువై ఉంటే..!!
10. మనోనేత్రంతో చూడు
అంతరార్థమేంటి
విశ్వమే నీ పాదాక్రాంతమౌతుంది...!!
11. వినాలనే ఉంటుదెప్పుడూ
నిశ్శబ్ధంలో నీ మనసు పలికే
నయగారపు పిలుపులను...!!
12. నేస్తమనే అనుకున్నా
నన్నే లేకుండా చేసి
తానే నిండిపోతుందని తెలియక..!!
13. దెప్పడం కాదది
ప్రేమగా మందలించడమని
తెలుసుకోవెందుకూ..!!
14. వెంటబడే వెతలను
సముదాయించడంలోనే
అయినవారి ఆనందం వెదుక్కునే అల్పసంతోషి ఆమె...!!
15. దోబూచులాడే నవ్వులు
దాచే దుఃఖాలెన్నో
వెతలకు మరుపు లేపనమద్దుతూ...!!
16. అమ్మ నేర్పిన అక్షరాలివి
అనుబంధాలకు వారధులుగా
మమకారానికి మరో రూపుగా...!!
17. అక్షయమెప్పుడూ
అమ్మ చేతిలో ఆటబొమ్మే
విశ్వాన్ని తన చీరకొంగులో దాచి మనకిస్తూ..!!
18. శూన్యంతో పనేంటి
చుట్టమైన ఏకాంతం
నీతోనే ఉందిగా గాయాలను జోకొడుతూ..!!
19. నెలవంక వయ్యారమది
అరకొరగా ఉన్నా
ఆకాశంలో చుక్కలరేడై విలసిల్లుతూ..!!
20. ఓ క్షణం సరిపోదనేగా
అరుదైన జ్ఞాపకమవ్వాలన్న
అతిశయంలో అలా మిగిలిపోతున్నా...!!
21. వినే మనసుంటే
శిథిలాలు చెప్పే చరితలెన్నో
ఘనమైన గతాన్ని భవితకందిస్తూ...!!
22. చెప్పేద్దామనే అనుకున్నా
కానీ...విలువ కన్నా
బంధమే ఎక్కువనిపించి..!!
23. ముడి ఎలాంటిదైనా
బంధాన్ని ఏర్పరిచిందిగా
ఇక అభిజాత్యాని ఆత్మభిమానానికి లంకెందుకటా...!!
24. ఆంతర్యాన్ని అంచనా వేస్తున్నా
అర్థం కాకున్నా
ఆలోచనలనాపలేక...!!
25. నీ(నా) మనసుకు
వ్యాఖ్యాతగా వ్యవహరిద్దామనుకున్నా
ఓ వాక్యంలో చెప్పలేక...!!
26. చెప్పమని అడగలేదందుకే
అక్షరాలకు తెలుసు కదా
ఎలా వ్యక్తపరచాలో..!!
27. ఏ నగరానికి ఏమి కాలేదు
చుట్టంలా చూసెళ్ళమంటే
ఇల్లరికం ఉండిపోతానందంతే..!!
28. మంద్రంగా
వినిపించే పాటయినా
మౌనాన్ని ఛేదించలేదేమెా...!!
29. శబ్దం వినిపిస్తూనే ఉంది
చీకటి చీర చుట్టుకుంటున్న ఆకాశంలో
అలికిడితోనైనా గుర్తుపడతావని...!!
30. దాయలేకున్నా మనసుని
ఊరడించే అక్షరాలతో
బంధుత్వం కలుపుకున్నాక..!!
వర్గము
త్రిపదం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి