2, ఫిబ్రవరి 2020, ఆదివారం

ఈమని శ్రీసత్య సాంబశివరావు గారి గురించి...!!

                     సమాజ అసమానతలే తన కవితా వస్తువులంటున్న ఈమనికి గౌరవ డాక్టరేట్ పురస్కారం...!!
               ఏ అధికార హోదా, సాహిత్యపు పెద్దల వెన్నుదన్ను లేని ఓ సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబం నుండి వచ్చిన, సామాజిక బాధ్యత గలిగిన కవి, రచయితకు గుర్తింపు రావడమంటే సామాన్యమైన విషయం కాదు. అలాంటిది ఎన్నో అడ్డంకులను, అవరోధాలను ఎదుర్కొంటూ, కుటుంబ,ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తూ, రచనల్లో తనకంటూ ఓ విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న అతి సామాన్యులుగా ఉండే అసామాన్యులు ఈమని శ్రీసత్య సాంబశివరావు గారిని గౌరవ డాక్టరేట్ వరించడం, అదీ సాహిత్యంలో సేవలకు లభించడం అన్నది చాలా సంతోషకరమైన విషయం. నేషనల్ డీమ్డ్ యూనివర్సిటీ మరియు అమెరికాకు చెందిన అంతర్జాతీయ సంస్కృత సంస్థ సెప్టెంబర్ 27న దుబాయిలో ప్రముఖ హోటల్ ఆర్కిడ్ వ్యూ కాన్ఫరెన్స్ హాల్ లో జరిగిన అవార్డ్ ఫంక్షన్ లో సాహిత్య, సంస్కృత సేవలకు గుర్తింపునిచ్చి పలువురు ప్రముఖుల సమక్షంలో గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయడం తెలుగువారిగా మనము గర్వించదగ్గ విషయం. ఈమని శ్రీసత్య సాంబశివరావు గారి సాహితీ ప్రస్థానం వెనుక ఎంతో కఠోరశ్రమ ఉంది. ఎన్నో కష్టనష్టాలకోర్చి అక్షరం మీద మమకారాన్ని, సమాజానికి తనవంతుగా సేవ చేయాలన్న తలంపుతో మొదలుబెట్టిన సాహిత్యం ఈరోజు గౌరవ డాక్టరేట్ అందించి వారిని అత్యున్నత స్థానంలో నిలబెట్టింది. సమాజం మనకేమిచింది అని కాకుండా సమాజానికి మనమేం చేశామన్న ఆలోచనే ఈ పురస్కారానికి కారణం అయ్యింది. నిత్య సాహితీ సేవకులు ఈమని శ్రీసత్య సాంబశివరావు గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందనల శుభాకాంక్షలు.                
        కృష్ణాజిల్లా మచిలీపట్నంకి 15 కి మీ దూరంలో గల భోగిరెడ్డిపల్లి అన్న చిన్న పల్లెటూరు నుంచి పేదరిక వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన సామాజిక కవి ఈమని శ్రీసత్య సాంబశివరావు గారి గురించి నాలుగు మాటలు చెప్పడానికి ముందు వారు కవిత్వం రాయడం ఎప్పుడు, ఎలా మొదలైందో చెప్పాలి. కవిత్వం రాయడం అనేది దేవుడిచ్చిన ఒక వరం. చిన్నప్పటి నుండి పేదరికపు మధ్యతరగతి వ్యవసాయ కుటుంబపు బరువు, బాధ్యతలు ఎలా ఉంటాయో కళ్లారా చూసిన వ్యక్తి తన మనసులో కలిగిన భావాలకు అక్షర రూపం ఇవ్వడం అనేది, అది ఏ సాహిత్యపు వాసనలు లేని ఒక కుటుంబం నుండి రావడమన్నది చాలా అరుదైన విషయం. చిన్నప్పటి నుండి చదువులో ముందుంటు, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ తొమ్మిదవ తరగతిలోనే కవిత రాయడం ఆ రోజుల్లో చాలా అరుదు. ప్రముఖ కవయిత్రి డా. మంగళగిరి ప్రమీలాదేవి, మరో ప్రముఖ కవి అందరికి సుపరిచితులు రావి రంగారావు గారి శిష్యు. డినని సవినయంగా చెప్పుకుంటూ, శ్రీ శ్రీ కళా వేదిక తెలంగాణకు సహాయ కార్యదర్శిగా గురుతర బాధ్యతలను నెరవేర్చుతున్న అసాధారణ వ్యక్తి ఈమని శ్రీసత్య సాంబశివరావు. ఇప్పటి వరకు 800 పై చిలుకు కవితలు, 50 పైగా వ్యాసాలు ఈమని కలం పేరుతో రాశారు. 30 పైగా కవితలు, వ్యాసాలు వివిధ పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.
                      వీరి కవిత్వంలో ఎక్కువగా సమాజ అసమానతలను ప్రశ్నిస్తూ, ప్రజలను చైతన్యవంతం చేయడమే లక్ష్యంగా కనిపిస్తుంది. సగటు మనిషి కష్టాలను, కన్నీళ్లను, ఆవేదనను, సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను ఎత్తి చూపడం, అనాధలకు, బడుగు బలహీన వర్గాలకు  ఉంటూ, న్యాయం కోసం కోసం పోరాడటమే తన కవితల లక్ష్యం అంటున్నారు. భవిష్యత్ తరాలకు వారధిగా తన భావాలను అమర్చుతాననడం సమాజం పట్ల ఈయనకున్న నిబద్ధతను తెలియజేస్తోంది.
                 వీరి కవితలు కొన్ని పరిశీలిస్తే వాటిలో దాగిన సమాజ హితం, సంస్కృతుల పట్ల తనకున్న ఇష్టం తెలుస్తుంది. సగటు మనిషి సవ్వడి కవితలో సగ్గటు మనిషి ఆంతర్యాన్ని చక్కగా వినిపిస్తారు. ప్రశ్నలు, సమాధానాలు, న్యాయాన్యాయాలు, అవకతవకలు ఇలా ప్రతి విషయాన్నీ విప్పి చెప్తారు. తన భావాల్లో అప్పుడప్పుడు కాస్త తాత్వికత కూడా చోటు చేసుకోవడం గమనార్హం. తాను పనిచేసే మెడికల్ సంస్థలకు కూడా న్యాయం చేసే ఉద్దేశ్యంతో ప్రజలకు ఆరోగ్య విషయాలను చక్కని వ్యాసాల ద్వారా పలు వార్తా పత్రికల్లో ప్రచురించారు. అమ్మ లేని లోటుని, రాజకీయ అసమానతలను, కష్టాలకు ఓదార్పుగా ఆశావహ దృక్పథాన్ని, తొందరపడి ప్రేమలో మోసపోతే ఎలాంటి అనర్థాలు కలుగుతాయో ఇలా తన ప్రతి ఆలోచనకు చక్కని అక్షర రూపాన్ని అందించడంలో కృతకృత్యులయ్యారు. రాజకీయ, సామాజిక అంశాలతోపాటుగా,  ప్రేమ, వేదన, ఆశలు, ఆశయాలు మొదలైన భావాలను తన కవితల్లో పంచుకున్నారు. ఈ తరం నుండి తరువాతి తరాలకు పది కాలాలు  మంచి  సాహిత్యం, మానవత్వపు విలువలు అందించాలన్న ఈమని గారి కోరిక నెరవేరాలని కోరుకుంటూ, మరిన్ని రచనలు ఈయన కలం నుండి వెలువడాలని ఆశిస్తూ ... హృదయపూర్వక అభినందనలు.. 

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner