13, సెప్టెంబర్ 2021, సోమవారం

కాలం వెంబడి కలం..71


          బ్లాగులో రాయడం మెుదలు పెట్టిన తర్వాత చిన్న చిన్న వాటికి కూడా అందరు చక్కగా ప్రోత్సహించేవారు. బ్లాగును కాస్త ముస్తాబు చేయడంలో జ్యోతి వలభోజు గారు, మా AMSOL పిల్లలు శరత్, చంద్రశేఖర్ మరి కొంతమంది హెల్ప్ చేసారు. మేరాజ్ ఫాతిమా అక్క, వనజ గారు, జలతారు వెన్నెల, మెహదీ ఆలీ గారు, మాలా గారు, శివ, అశోక్ పాపాయి, సత్య నీలహంస ఇంకా చాలామంది పరిచయమయ్యారు. అశోక్ దుబాయ్ లో పని చేసేవాడనుకుంటా. ఇండియా వచ్చినప్పుడు హైదరాబాదులో కలిసి, నాకు మేకప్ కిట్, పెన్ డ్రైవ్ ఇచ్చాడు. శివ ఇంటికి వచ్చేవాడు. తన టాబ్ పిల్లలకు ఇచ్చాడు. అక్కా అని పలకరిస్తుంటాడు ఇప్పటికి. బ్లాగు పరిచయాలన్నీ మంచి జ్ఞాపకాలే. నా చిన్నప్పటి నేస్తం నా రాతలు బ్లాగులో చదువుతూ, కామెంట్లు పెడుతూ ప్రోత్సహించేవాడు. ఎప్పుడోకసారి నేనే పుస్తకం వేయించేస్తా అని, పుస్తకానికి పేరు కూడా సెలక్ట్ చేసేసాడు అప్పట్లోనే. 
       బ్లాగుల నేస్తాలందరు ముఖపుస్తకంలోనూ ఉండేవారు. ముఖపుస్తకానికి నా ఇంజనీరింగ్ నేస్తాల కోసం రావడం జరిగింది. మెుదట్లో పోస్ట్ లు ఏమి పెట్టేదాన్ని కాదు. బ్లాగుల్లో స్నేహితులైన ఆర్ వి ఎస్ ఎస్ శ్రీనివాస్ గారు బ్లాగులో రాసేవి ఇక్కడ గ్రూప్ లలో కూడా పోస్ట్ చేయండి అని చెప్పారు. అలా మెల్లగా ముఖపుస్తకంలో రాతలు అలవాటయ్యాయి. చాలామంది పెద్దలతో నా స్నేహం ముందుగా తగవుతోనే మెుదలైంది. 
        మన తెలుగు మన సంస్కృతి గ్రూప్ లో వారం వారం నిర్వహించే చిత్ర కవితకు ఓ న్యాయ నిర్ణేతగా, కో అడ్మిన్ గా ఉండేదాన్ని. మీగడ త్రినాథ్ గారు మెుదటగా నాకు కో అడ్మిన్ బాధ్యతను అప్పగించారు, నాకు ఏమీ తెలియదని చెప్పినా వినకుండా. కత్తిమండ ప్రతాప్ గారు, సబ్బాని లక్ష్మీనారాయణ గారు గౌరవ న్యాయమూర్తులుగా వ్యవహరించేవారు. మనసంతా నువ్వే, కోకిల గీతం గ్రూపులకు కూడా కో అడ్మిన్ గా ఉండేదాన్ని. అప్పట్లో ఓ 7, 8 గ్రూపులుండేవి కవితలకు. రావి సురేష్ గారిది ఉత్తరాలకు ఓ గ్రూప్ ఉండేది. ప్రశాంత్ ఏక్ తార గ్రూప్ లో జాయిన్ చేసాడు. తర్వాత తర్వాత ద్విపదలు, త్రిపదలు, రెక్కలు, వంటలు ఇలా చాలా గ్రూప్ లలో ఉన్నాను ఇప్పటికి. ఏక్ తారలు పద్మా శ్రీరాం గారు నేర్పించారు. 
            ముఖపుస్తకంలో పరిచయమైన కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి అంకుల్ ని మెుదట్లో బాగా సతాయించాను. నా పోస్ట్ కి అంకుల్ కామెంట్ పెడితే సమాధానమిచ్చాను. అంకుల్ ఫోన్ నెంబర్ అడిగితే ఇవ్వకుండా 4, 5 రోజులు సతాయించి ఇచ్చాను. అప్పుడు అంకుల్, ఆంటీ అమెరికాలో ఉన్నారు. అక్కడి నుండి ఫోన్ చేసి మాట్లాడారు. ఆ మాటల్లో తెలిసిన విషయమేమిటంటే అంకుల్ మా నాన్నకు మచిలీపట్నంలో హిందూ కాలేజ్ లో క్లాస్మేట్. అప్పటి నుండి అంకుల్ అనేవారు. అమ్మాయ్ మంజూ నీ కవితల పుస్తకం అచ్చులో రావాలి అని. నేనెప్పుడూ నా రాతలు పుస్తకాలుగా రావాలని కాని, పత్రికల్లో రావాలని కాని అనుకోలేదు. సాహితీసేవ ముఖాముఖిలో పరిచయమైన ఎమ్ ఎన్ ఆర్ గుప్త గారు కూడా పుస్తకం వేయండి అని అంటూనే ఉండేవారు. 
    అసలు నా రాతల గురించి చాలా సంవత్సరాలు ఇంట్లోవాళ్ళకు తెలియదు. ఇంట్లో లాప్ టాప్ లేనప్పుడు కూడా, ఇంట్లో పనయ్యాక మధ్యాహ్నం అప్పుడు నెట్ సెంటర్ కి ఓ గంట వెళ్ళి గబగబా రాసి, పోస్ట్ పెట్టేసేదాన్ని. తర్వాత తర్వాత ఇంట్లోనే రాయడమైనా, ఎందుకా రాతలు? కాసేపు పడుకోరాదా! అని అమ్మ అనేది. అప్పట్లో అనుకూల పరిస్థితుల్లో రాసిన రాతలు చాలా తక్కువ. బ్రెయిన్ డెడ్ అయి, మామూలుగా అయిన తర్వాత, గోపాళం శివన్నారాయణ గారు చెప్పిన మాట..." అమెకు ఎలా సంతోషంగా ఉంటే అలా ఉండనివ్వండని. " అప్పటి నుండి అందరికి కాస్త తెలుసు నా రాతల గురించి. 

           " అనుకున్నామని జరగవు అన్ని. అనుకోలేదని ఆగవు కొన్ని. " ఇది నిజంగా నిజం. 

వచ్చే వారం మరిన్ని కబుర్లతో.... 
              

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner