25, సెప్టెంబర్ 2021, శనివారం
రెక్కలు
1. సహనం
29. ఆస్తులు పంచుకోవడం
కొందరికే
అసహనం
అందరికి
మాటలు చెప్పినంత తేలిక కాదు
ఆచరణ..!!
2. విసిగించడం
కొందరి నైజం
విరాగిలాబ్రతికేస్తారు
మరి కొందరు
లలాటలిఖితం
విధాత వింత...!!
3. ఓర్పుకెప్పుడూ
ఓరిమే
క్షణాలను
అవలీలగా దాచేస్తూ
దాపరికం కొత్తేమీ కాదు
మనసుకు..!!
4. లోపాలు
సహజం
బ్రహ్మ చేసిన
బొమ్మలకు
దైవమేమీ మినహాయింపు కాదు
అరిషడ్వర్గాలకు..!!
5. సాధ్యాసాధ్యాలకు
కారణాలెన్నో
సుఖదుఃఖాలకు
చేరువగా
పరమాత్మ
లీలావినోదమీ జీవితం..!!
6. లక్ష్యం లేని
జన్మే లేదు
అది
ఏ లక్షణమైనా
అవకతవకలు తప్పవు
అవసరార్థపు అనుబంధాలకు..!!
7. వినోదాన్నిచ్చే
యంత్రాన్ని కాదు
విరహగీతికలకు పరవశించే
ప్రేమపక్షినసలే కాదు
జీవన సంద్రాన్ని
ఆస్వాదించే సామాన్యురాలిని..!!
8. వివేకం
ఆలోచననిస్తుంది
విచక్షణ
బాధ్యత నేర్పుతుంది
గాయమైనా గేయమైన
మనసుని కదిలించగలగాలంతే...!!
9. విలాసం
కొందరికి
విలాపం
కొందరిది
ఏదెలా వున్నా
మన ఆనందం మనది...!!
10. గమకం
అలవాటుగా పడిపోతుంది
స్వరం
అలవోకగా పాడేస్తుంది
విషాదమైనా ఆనందమైనా
గానం వినసొంపుగానే ఉంటుంది..!!
11. పదాల్లో
భావం కనబడుతుంది
అక్షరాలకు
అలవాటైన విద్యది
వేదనను
వాటంగా చెప్పడమే నేర్పు మరి..!!
12. భాష
సహకరిస్తుంది
అక్షరం
అల్లుకుంటుంది
జనిస్తుంది
సుస్వరాల సాహిత్యం...!!
13. జీవితం
ఇమిడిపోయింది
అక్షరంతో
సహవాసం చేస్తూ
సన్నిహితమే
ఏ అనుబంధమైనా..!!
14. మౌనం
కనపడని గాయం
మాట
మానసిక హింస
అన్నింటిని భరిస్తుంది
సముద్రం...!!
15. గొప్పోళ్ళందరూ
మనకి తెలుసు
మనమెంతమందికి
తెలుసో మరి
మాటలు కోటలు దాటటం
నిజమేగా..!!
16. ఘనత
ఎవరిదైనా
గొప్పదనం
నాదే
వదిలేసిన విలువలే
ఘనకార్యాలిప్పుడు..!!
17. మనమేంటన్నది
మనకు తెలుసు
లోకం పోకడెప్పుడూ
నిలకడే
ఛాయను నిజమనే
భ్రమను వీడగలగాలి..!!
18. క్లిష్టమైన
పదాలు అందమేమెా
వాడుక భాష
వద్దకు చేరుతుంది త్వరగా
అక్షరం అక్కరకు రావడమే
నిజమైన సాహిత్యం..!!
19. జ్ఞాపకాలే
జీవితం
అక్షరాలే
సన్మిత్రులు
శూన్యంతో సహవాసమైనా
మదినిండా సంతోషమే..!!
20. అక్షరానికి
అందమైన అలంకారంమౌతుంది
రాయాలన్న
తపన తోడైతే
భాషకు
భావం వొనగూడితే...!!
21. అహంభావం
అలంకారమూ కాదు
మౌనం
అంగీకారమూ కాదెన్నటికి
నువ్వేంటన్నది
నీ మనస్సాక్షికి తెలుసు..!!
22. అర్థం కాని
ఆశ్చర్యమే
మనిషి
నైజమెప్పుడూ
అనుభవాలెన్నో
ఈ జీవితానికి..!!
23. అనుబంధాల
వెదుకులాటలు
అనుభవాల
ఆటుపోట్లు
వెరసి కాలానికి
కలంతో సమాధానం..!!
24. ఎడతెగని
ముడులెన్నో
ఎగసిపడే
అంతరంగ తరంగాలెన్నో
మనసుకు మెదడుకు
అనుసంధానం కావాలి..!!
25. అక్షరాలతో
అనునయించడం
నిర్వేదనను
వేదంగా మలచడం
మానసానికి
సులభమే..!!
26. ఊపిరి
నిలిపేది
ఊరట
ఇచ్చేది
ఊతమైన
ఈ అక్షరానుబంధమే...!!
27. మనిషి
నడవడి
మనసు
అలజడి
ఈ అక్షరాల
ఉరవడి...!!
28. బెణుకో
బెదురో
హత్యో
ఆత్మహత్యో
ఏదైనా
పదవి మహిమే..!!
సర్వసాధారణం
ప్రాంతాలను విభజించి
ఏలాలనుకోవడమే వింత
జనానికి
అర్థమైన చతురతే ఇది...!!
30. మాటలు రాని
మనసు
కనబడని
గాయపు ఆనవాళ్ళు
చూపాలన్న తాపత్రయం
అక్షరాలకి..!!
వర్గము
రెక్కలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి