25, సెప్టెంబర్ 2021, శనివారం

ఏక్ తారలు..!!

1.  కొన్ని మాటలు మరిచిపోవాలంతే_మనసులేని మనిషిగా బతికేయడానికి...!!
2.  దాగలేనంటున్నాయి గుప్పెట్లో గురుతులు_గుండె బరువును మెాయలేక..!!
3.  గొప్పవారికేదైనా ఘనమే_చావుపుట్టుకలు వేడుకగా..!!
4.    గుండె గూడు ఉండనే ఉందిగా_భావాల బాంధవ్యాన్ని దాచుకోవడానికి..!!
5.   అనుభవమేదైనా ఓ పాఠమే_జీవిత పాఠశాలలో...!!
6.   ఎన్ని ప్రశ్నలను సంధిస్తుందో అక్షరం_సమాధానాలు వెదకమంటూ.!!
7.  అప్పుడప్పుడూ వెన్నెలా ఉంటుంది_రాతిరికి తోడుగా..!!
8.   జ్ఞాపకమే నువ్వు_కన్నీరుగానో పన్నీరుగానో..!!
9.  జన్మజన్మల ఋణానుబంధమిది_గతానికి వర్తమానానికి లంకెలేస్తూ..!!
10.   తెలిసినా కాదనలేని మోమాటం అక్షరాలది_బాధైనా భారమైనా భరించేస్తూ..!!
11.   పదాలెన్ని ఉంటేనేం_అర్థవంతం కాలేని వాక్యంలో..!!
12.   మధ్యలో తెర దించలేని నాటకమే ఇది_ముగింపు ముందే తెలిసినా..!!
13.  జీవితమంటే ఇంతేనేమో_తిరిగి రాయలేని పుస్తకంలా..!!
14.   మదికి అంతులేని సంబరమే ఇప్పుడు_అక్షరాలతో ఆడటం నేర్చుకున్నందుకు..!!
15.   పొడి పొడి మాటలే అన్నీ_కలుపుకుపోలేని అనుబంధాలై పోతూ..!!
16.  ఋణశేషాలు పాశాలై పట్టుకున్నాయి_అనుబంధమెరుగని అనాకారాలుగా మారి..!!
17.  కనుమాయ చేసిన అబద్ధాలెన్నో_నిజాలను నీటి పాలుజేస్తూ..!!
18.   అనుబంధాలకు అర్థం మారిపోయింది_ధనబంధం కమ్ముకున్న ఈ కాలంలో..!!
19.   అక్షరాల ఆలంబనే ఇది_మనసు శబ్దాలు సద్దుమణిగిన వేళ..!!
20.   కలానికీ తొట్రుపాటే_కష్టాల కాలాన్ని కదిలించడానికి..!!
21.   గ్రహపాట్లన్నీ మనిషివే_సరిచేయలేని మనసులను కాలానికిచ్చేసాక..!!
22.   పరిచయం వయసెంతని కాదు_ఆ ఆస్వాదన వెలకట్టలేనంత..!!
23.   విరామానికి వినోదం పంచుతాయి జ్ఞాపకాలు_విశ్రాంతికి చోటీయకుండా..!!
24.   మూడు ముళ్లేనని రవ్వంత అజాగ్రత్త_శూన్యాన్ని కానుకిస్తాయని తెలుసుకోలేక..!!
25.   పాద ముద్రలు పదపదమంటున్నాయి_సైకతం శాశ్వతం కాదంటూ..!!
26.   కల’వరాల కలబోతలే జీవితాలు_లలాటలిఖితపు వడపోతల్లో..!!
27.   వినోదం చూస్తున్నాడు దేవుడు_వదిలేస్తే మనిషి నేర్పు ఎంతని..!!
28.  మారని రాతైనా మరుగున పడాల్సిందే_మనోధైర్యం మనదైనప్పుడు..!!
29.  శూన్యంలోనూ చిత్రాలే_జీవితంలో ఖాళీలను పూరించే ప్రయత్నంలో…!!
30.  ఎదలో లీనమైపోతుంటాను_కనుకొలుకుల్లో ప్రత్యక్షమైతూ..!!



0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner