20, సెప్టెంబర్ 2021, సోమవారం
కాలం వెంబడి కలం...72
ఓ పది నెలలు దినేష్ దగ్గర అన్ లైన్ లో నైట్ షిప్ట్ వర్క్ చేసాను. మా అమెరికా జనాలకి కొందరికి ఫోన్ చేసినా పెద్దగా ఎవరు రెస్పాండ్ కాలేదు. ఏదో మెామాటానికి మాట్లాడినట్టు మాట్లాడారు తప్పించి ఆప్యాయంగా మాట్లాడలేదు. వాళ్ళకు మనతో అవసరం తీరిపోయింది కదా, అదన్న మాట సంగతి.మనల్ని కావాలనుకునే వాళ్ళను మనమూ కావాలనుకుంటే సరని నేను పెద్దగా పట్టించుకోలేదు. కనీసం ఆరోగ్యం బాలేదని తెలిసినప్పుడు కూడా ఓ మాట మాట్లాడే తీరిక లేనంత బిజీ పాపం వాళ్ళందరు. అప్పట్లోలా ఫోన్ కి ఖర్చు కూడా కాదు. అయినా ఓ మాట కూడా బరువైపోయింది చాలామందికి. కనీసం వాళ్ళు ఈరోజు అమెరికాలో సిటిజన్స్ గా, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ గా ఉన్నారంటే, దానికి కారణమైన వారు కష్టంలోనే ఉంటే, పలకరించేంత సమయం లేని బతుకులైపోయాయి మరి. మనిషి సహజ లక్షణం ఇదేనని మరోమారు తెలిసింది.
ఏదో మాటల్లో పుస్తకం వేయాలని అంటే మా వేంకటేశ్వరరావు బాబాయి, అమ్మాయి నేను వేయిస్తాను, ఆపనేంటో చూడు అని అన్నారు. అప్పటికే బాబాయి ఇంట్లో అవసరమని అడిగితే 35 వేలు ఇచ్చారు. తర్వాత ఓ 10 వేలు ఆయనకు ఇచ్చేసాను. శ్రీ శ్రీ ప్రింటర్స్ లో కనుక్కోమని అభి చెప్తే, అక్కడ అడిగితే 40, 42 వేల వరకు అవుతుందని చెప్పారు. జ్యోతి వలభోజు గారిని అడిగినా అలాగే చెప్పారు. ఆర్ వి ఎస్ ఎస్ శ్రీనివాస్ గారికి చెప్తే మల్లెతీగ కలిమిశ్రీ గారి నెంబర్ ఇచ్చి మాట్లాడమని చెప్పారు. ఫోన్ చేసి మాట్లాడితే 35 వేలని చెప్పారు. ఓ రోజు నేను, మా బేబి వెళ్లి 10వేలు ఇచ్చి వచ్చాము. అప్పటి నుండి ఇప్పటి వరకు కలిమిశ్రీ గారి కుటుంబంతో సత్ సంబంధమే. తర్వాత నాకు చిన్న ఆపరేషన్ జరిగింది. రానురానూ హెల్త్ ప్రోబ్లమ్స్ బాగా ఎక్కువైయ్యాయి. ఆ సమయంలోనే విజయనగరం ఫ్రెండ్ శ్రీను, తన వైఫ్ చూడటానికి అనుకోకుండా వచ్చి ఓ రెండు రోజులుండి వెళ్ళారు. అప్పటికింకా పుస్తకాలు రాలేదు.
అప్పటికే అంతర్వేదిలో మరోసారి కవి సమ్మేళనం రికార్డ్ కోసం జరిపించడానికి ఏర్పాట్లు అన్ని చేసారు కత్తిమండ ప్రతాప్ గారు. నా పుస్తకం కూడా అక్కడే ఆవిష్కరణ చేద్దామని అనుకున్నాము. నేను, వనజ గారు ఆ రోజు వెళదామని ప్లాన్ చేసుకున్నాము. ఆ ఫంక్షన్ కోసం దాచిన డబ్బులు అంతకు ముందు నా కజిన్ లక్ష్మి అడిగితే ఇచ్చాను. కాకపోతే ఫలానా టైమ్ కి కావాలని చెప్పి ఇచ్చాను. వెళ్ళే సమయానికి డబ్బులు ఇవ్వలేదు, వనజ గారు ఏదో ఇబ్బంది వచ్చి ప్రయాణం మానుకున్నారు. ముందు రోజు సాయంత్రం చెప్పారు తనకు వీలు కాదని. నేనూ ఇక డ్రాప్ అయిపోయాను, ఎలా జరగాలనుంటే అలా జరుగుతుందని. ఈయన తీసుకువెళతానన్నాడు కాని నేనే వద్దని మానేసాను.
మెుత్తానికి అలా ఇలా అని పుస్తకం ఆవిష్కరణ చాలా గ్రాండ్ గా జరిపించడానికి ముహూర్తం కుదిరింది. అప్పటికే పిల్లల పంచెల ఫంక్షన్ ఆపేసిన ఎఫెక్ట్ నా మీద ఉంది కదా. అందుకే నేనుగా ఎవరికి ఎక్కువగా చెప్పలేదు. బోలెడు మంది పుస్తకానికి తమ సందేశాన్ని అడిగిన వెంటనే రాశారు. ఈయన మా ఊరి వారందరికి చెప్పాడు. నేను మా రెండు కుటుంబాల వరకు చెప్పాను. మా పెద్దాడపడుచుకి చెప్పనన్నాను. అప్పటి వరకు దేనికి వదిలిపెట్టకుండా పిలిచినా రాలేదు. ఆవిడ, ఆవిడ అనుయాయలు నన్ను వేటికి పిలవలేదు. ఇదే ఆఖరుసారి పిలువు. రాకపోతే ఇంకెప్పుడూ నిన్ను పిలవమని అడగము అని అమ్మ, రాఘవేంద్ర అంటే, సరేనని ఫోన్ చేసి భార్యాభర్తలు ఇద్దరికి చెప్పాను. షరా మామూలే రాలేదు వారిద్దరు.
హోటల్ మినర్వా గ్రాండ్ లో మెుదటి పుస్తక ఆవిష్కరణ చాలా బాగా జరిగింది. పుస్తకం పేరు " అక్షరాల సాక్షిగా..నేను ఓడిపోలేదు. " నా ఇంజనీరింగ్ క్లాస్మేట్, తమ్ముడు రఘు, మా సీనియర్ దావులూరి శ్రీనివాస్ గారు రావడం చాలా సంతోషమనిపించింది. ముఖపుస్తక నేస్తాలు బోలెడు మంది తమ ఇంటి కార్యక్రమమే అన్నంత బాధ్యతగా వచ్చారు. నా చిన్నప్పటి శిశువిద్యామందిరం నేస్తాలు సాయి, నిర్మల, శ్రీలక్ష్మి కూడా వచ్చారు. మా అక్క కొడుకు సత్యకృష్ణ తీసిన వీడియెా, ఉమిత్ తీసిన ఫోటోలతో ఫంక్షన్ బాగా జరిగింది. అప్పటి నుండి కొన్ని పరిచయాలు ఆత్మీయంగా మారి, జీవితంలో ఓ భాగంగా నిలిచిపోయాయి ఇప్పటికి.
" మనం ఎలా పథకం వేసినా ఏది ఎలా జరగాలని రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది. దీనిలో ఏ మార్పు ఉండదు. "
వచ్చే వారం మరిన్ని కబుర్లతో ..
వర్గము
ముచ్చట్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి